అవి గంజాయి చాక్లెట్లే  | 8 kg of ganja chocolates caught | Sakshi
Sakshi News home page

అవి గంజాయి చాక్లెట్లే 

Published Thu, Jan 11 2024 4:29 AM | Last Updated on Thu, Jan 11 2024 7:58 AM

8 kg of ganja chocolates caught  - Sakshi

శంషాబాద్‌: ఊహించిందే నిజమైంది. అవి గంజాయి కలిపిన చాక్లెట్లేనని నిర్ధారణ అయింది. కొత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు స్కూలు సమీపంలోని పాన్‌ డబ్బాల్లో చాక్లెట్లు కొనుగోలు చేసి తిన్న తర్వాత మత్తులోకి జోగడం, వింతవింతగా ప్రవర్తిస్తుండటం తెలిసిందే. దీంతో ఉపాధ్యాయులు పోలీసులకు సమాచారమిచ్చిన నేపథ్యంలో గంజాయి చాక్లెట్ల బాగోతం బయటపడింది. విద్యార్థుల వింత ప్రవర్తనతో పాటు మత్తులోకి జారుకునేలా చేస్తున్న చాక్లెట్లు గంజాయి కలిపినవేనని పోలీసులు నిర్ధారించారు. ఈ మేరకు శంషాబాద్‌ డీసీపీ నారాయణరెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
 
పోలీసుల దాడులు 
మంగళవారం సాయంత్రం ప్రభుత్వ పాఠశాల సమీపంలో ఉన్న పాన్‌ డబ్బాతో పాటు మరో మూడు కిరాణ దుకాణాల్లో శంషాబాద్‌ ఎస్‌ఓటీ , కొత్తూరు పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో 8 కేజీల బరువు కలిగిన ‘చార్మి నార్‌ గోల్డ్‌ మునకా’అనే పేరుతో ఉన్న 42 చాక్లెట్ల డబ్బాలు స్వాదీనం చేసుకున్నారు. వీటి విలువ 1.30 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. చాక్లెట్లను తీసుకొచ్చి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.
 
యూపీ వయా ఒడిశా? 
ఒడిశా రాష్ట్రం జస్పూర్‌ జిల్లాకు చెందిన ధీరేంద్ర బహేరా( 33) కొత్తూరులోని పరిశ్రమల్లో కార్మి  కుడిగా పనిచేసేందుకు కొంత కాలం కిందట వ చ్చాడు. అధికంగా డబ్బులు సంపాదించాలనే దు రాశతో అదే రాష్ట్రానికి చెందిన సోమ్‌నాథ్‌ బెహ్రే (33) సూర్యమని సాహు (35)తో పాటు పరారీలో ఉన్న మరో వ్యక్తితో కలిసి ఒడిశా నుంచి గంజాయి చాక్లెట్లను తీసుకొచ్చి స్థానికంగా విక్రయించడం మొదలు పెట్టారు. ప్రభుత్వ పాఠశాలకు సమీపంలో ఓ పాన్‌ డబ్బాను ఏర్పాటు చేసి విద్యార్థులకు దానిని నెమ్మదిగా అలవాటుగా మార్చారు.

అంతేకాకుండా సమీపంలోని మరికొన్ని కిరాణా దుకాణాల్లో కూడా వాటిని కార్మి కులు, కళాశాల విద్యార్థులకు విక్రయిస్తున్నారు. ఒక్కో చాక్లెట్‌ను రూ. 20 లేదా 30కి విక్రయిస్తున్నారు. చాక్లెట్లను ఉత్పత్తి చేస్తున్న ప్రదేశం ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ఉన్నావ్‌ జిల్లా మగర్‌ వారా నెహ్రూబాగ్‌లోని ఏఎం ఫార్మా పేరిట ఉంది. చాక్లెట్ల పై భాగంలో మాత్రం పూర్తి గా హిందీ అక్షరాలతో చార్మి నార్‌ గోల్డ్‌ మునకా అని ఉంది. అక్కడ నుంచి ఎలా తీసుకొస్తున్నారు అనే దానిపై లోతైన దర్యాప్తు జరుగుతోందని శంషాబాద్‌ డీసీపీ వెల్లడించారు. 

చాక్లెట్‌ ఫ్లేవర్‌తో గంజాయి కలిపి
కొంత చక్కెర, బెల్లం వంటి పదార్థాల్లో చాక్లెట్‌ ఫ్లేవర్‌ కలిపి అందులో గంజాయిని కలిపినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఎవరైనా ఇలాంటి చాక్లెట్లు విక్రయిస్తే పోలీసులకు సమాచారం అందించాలని డీసీపీ నారాయణరెడ్డి కోరారు. ఎస్‌ఓటీ డీసీపీ రషీద్, శంషాబాద్‌ అదనపు డీసీపీ రామ్‌కుమార్, శంషాబాద్‌ ఏసీపీ రాంచందర్‌రావు, కొత్తూరు సీఐ వి.నర్సింహారావు శంషాబాద్‌ ఎస్‌ఓటీ సీఐ సత్యనారాయణ కేసును ఛేదించారంటూ డీసీపీ అభినందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement