జొమాటో.. పబ్లిక్ ఇష్యూ బాట | Zomato to go public in coming days | Sakshi
Sakshi News home page

జొమాటో.. పబ్లిక్ ఇష్యూ బాట

Published Fri, Nov 6 2020 11:07 AM | Last Updated on Fri, Nov 6 2020 11:11 AM

Zomato to go public in coming days - Sakshi

ముంబై: ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. తద్వారా దేశీ స్టాక్ ఎక్స్ఛేంజీలలో తొలిసారి లిస్టయిన ఆధునిక ఇంటర్నెట్ వినియోదారు కంపెనీగా నిలిచే వీలున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. ఇంతక్రితం 2019 జూన్లో బీటూబీ ఆన్లైన్ కంపెనీ ఇండియామార్ట్ ఇంటర్మెష్ మార్కెట్లలో లిస్టయ్యింది. ఇంటర్నెట్ ఆధారిత సేవలందించే ఇతర కంపెనీలను పరిగణిస్తే.. 2006లో ఇన్ఫో ఎడ్జ్, 2013లో జస్ట్ డయల్ పబ్లిక్ ఇష్యూలను విజయవంతంగా ముగించాయి. జొమాటోలో ఇన్ఫో ఎడ్జ్ ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే. కాగా.. 2010లో ఆన్ లైన్ ట్రావెల్ సేవల కంపెనీ మేక్ మై ట్రిప్.. నాస్డాక్ లో లిస్టింగ్ సాధించింది. 

కొటక్ మహీంద్రా..
పబ్లిక్ ఇష్యూకి మర్చంట్ బ్యాంకుగా కొటక్ మహీంద్రాను జొమాటో ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇష్యూకి న్యాయ సలహాదారులుగా సైరిల్ అమర్చంద్ మంగళ్దాస్, ఇండస్ లా సేవలందించనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా.. దేశీయంగా దిగ్గజ కంపెనీలుగా ఆవిర్భవించిన ఫ్లిప్ కార్ట్, పేటీఎమ్, బిగ్ బాస్కెట్ సైతం భవిష్యత్ లో పబ్లిక్ ఇష్యూలు చేపట్టే యోచనలో ఉన్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటోలో.. ఇప్పటికే ఇన్ఫో ఎడ్జ్, టెమాసెక్, యాంట్ ఫైనాన్షియల్, టైగర్ గ్లోబల్ తదితర సంస్థలు ఇన్వెస్ట్ చేసిన విషయం విదితమే.
  
దేశీ మార్కెట్ ఓకే
విదేశీ లిస్టింగ్ కాకుండా దేశీయంగానే ఐపీవో చేపట్టాలని జొమాటో నిర్ణయించుకున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. దేశీయంగానూ విజయవంతమైన కంపెనీలకు తగిన ధర లభిస్తుండటమే దీనికి కారణమని వివరించారు. టెక్నాలజీ, ఇంటర్నెట్ కంపెనీల పట్ల పలు దేశాల ఇన్వెస్టర్లు సైతం ఆసక్తి చూపుతున్నట్లు తెలియజేశారు. 2019 జులైలో రూ. 973 ధరలో ఐపీవోకు వచ్చిన ఇండియామార్ట్ ఇంటర్మెష్ ప్రస్తుతం రూ. 4891కు చేరిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ కంపెనీ మార్కెట్ విలువ రూ. 14,240 కోట్లను తాకడం గమనార్హం. కాగా.. చివరిసారిగా నిధుల సమీకరణను పరిగణిస్తే జొమాటో విలువ 3.3 బిలియన్ డాలర్లుగా నమోదైంది. అయితే హెచ్ ఎస్బీసీ 5 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement