ట్రేడింగ్‌లో మహిళల హవా.. | Women traders are increasing in the Stock Mrkets | Sakshi
Sakshi News home page

ట్రేడింగ్‌లో మహిళల హవా..

Published Sat, Mar 9 2024 2:26 AM | Last Updated on Sat, Mar 9 2024 2:26 AM

Women traders are increasing in the Stock Mrkets - Sakshi

సానుకూలంగా తక్కువ బ్రోకరేజ్‌ ఫీజులు, ట్రేడింగ్‌ వేళలు

యస్‌ సెక్యూరిటీస్‌ ఖాతాల్లో 75 శాతం వృద్ధి

రెలిగేర్‌ బ్రోకింగ్‌ యాక్టివ్‌ ట్రేడర్లలో 30 శాతం మహిళలే

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: అన్ని రంగాలతో పాటు ట్రేడింగ్‌లోనూ మహిళలు దూసుకెడుతున్నారు. బ్రోకరేజీ ఫీజులు తగ్గడం, ట్రేడింగ్‌ వేళలు కొంత అనువుగా ఉండటం వంటి అంశాలు ఇందుకు కారణంగా ఉంటున్నాయి. ఖాతాలు తెరవడమే కాకుండా మహిళలు ట్రేడింగ్‌లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారని యస్‌ సెక్యూరిటీస్‌ ఒక నివేదికలో పేర్కొంది. ఈ ఏడాది జనవరి 31 నాటికి మహిళా ఇన్వెస్టర్ల అకౌంట్లు వార్షికంగా 75 శాతం పెరిగినట్లు తెలిపింది.

అలాగే, మరో బ్రోకరేజ్‌ సంస్థ రెలిగేర్‌ బ్రోకింగ్‌ ప్లాట్‌ఫాంలోని యాక్టివ్‌ ట్రేడర్లలో మహిళలు 30 శాతం ఉన్నారు. ఇక ఇన్వెస్ట్‌మెంట్‌పరంగా చూస్తే గతేడాది తమ ప్లాట్‌ఫామ్‌ను ఎంచుకున్న కొత్త ఇన్వెస్టర్లలో 41 శాతం మంది మహిళలే ఉన్నారని టెక్‌ ఆధారిత ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థ ఫిన్‌ఎడ్జ్‌ తెలిపింది. రియల్‌ ఎస్టేట్‌లాగా కాకుండా చాలా తక్కువ మొత్తాన్నైనా షేర్లలో ఇన్వెస్ట్‌ చేసే వీలుండటం కూడా మహిళలు స్టాక్‌మార్కెట్‌ వైపు మొగ్గు చూపుతుండటానికి కారణం కావచ్చన్నది విశ్లేషణ.  

ఆర్థిక స్వాతంత్య్రంపై అవగాహన..
కచి్చతంగా నిర్దిష్ట ప్రదేశానికే పరిమితం కాకుండా ఎక్కడి నుంచైనా ట్రేడింగ్‌ చేసే సౌలభ్యం ఉండటం, వేళలు కూడా అనుకూలంగా ఉండటం వల్ల మహిళలు కూడా ట్రేడింగ్‌ను ఎంచుకుంటున్నారని ఆర్థిక అక్షరాస్యత కన్సల్టెంట్, ఫుల్‌–టైమ్‌ ట్రేడర్‌ అయిన ప్రీతి చాబ్రా తెలిపారు. మహిళా ట్రేడర్లు పెరగడానికి గల కారణాల్లో ఆర్థిక స్వాతంత్య్రంపై అవగాహన మెరుగుపడుతుండటం కూడా ఒకటని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలోనే ఇంటి నుంచే ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలను కలి్పంచే ట్రేడింగ్‌ ఆకర్షణీయంగా ఉంటోందని ఉమాదేవి అనే మరో ట్రేడర్‌ తెలిపారు. ట్రేడింగ్‌ అంత సులువైనదేమీ కాకపోయినప్పటికీ మార్కెట్ల గురించి అవగాహన పెంచుకుంటూ, రిస్కు మేనేజ్‌మెంటును అర్థం చేసుకుంటూ మహిళలు ఇప్పుడిప్పుడే ఇన్వెస్ట్‌మెంట్, ట్రేడింగ్‌ వైపు అడుగులు వేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి.  

మహిళా ఖాతాదార్లకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఆఫర్లు..
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్పొరేట్‌ సంస్థలు పలు కార్యక్రమాలు ప్రకటించాయి. ఈ ఏడాది జూన్‌ 30 వరకు మహిళా శక్తి సేవింగ్స్‌ ఖాతాలు లేదా ఉమెన్‌ పవర్‌ కరెంట్‌ అకౌంట్లు తీసుకున్నా, డిసెంబర్‌ 31లోగా రుణాలు తీసుకున్న మహిళలకు ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) తెలిపింది. రిటైల్‌ రుణాలపై 25 బేసిస్‌ పాయింట్ల వరకు తక్కువ వడ్డీ రేటు, ప్రాసెసింగ్‌ చార్జీలు పూర్తిగా మినహాయింపు, వార్షికంగా సేఫ్‌ డిపాజిట్‌ లాకర్‌ చార్జీలపై 50 శాతం డిస్కౌంటు వంటివి వీటిలో ఉన్నట్లు పేర్కొంది.

మరోవైపు, మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కెరియర్‌లో వివిధ దశల్లో ఉన్న మహిళా ఉద్యోగుల కోసం రీకిండిల్, ర్యాంప్‌ బ్యాక్, యామ్‌వాయిస్‌ వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు అమెజాన్‌ వెల్లడించింది. మరోవైపు, వేతనాల్లో సమానత, ఉద్యోగం–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యతను ప్రోత్సహించే విధానాలు అమలు చేస్తున్నట్లు ఐకియా తెలిపింది. మహిళా ఎంట్రప్రెన్యూర్స్‌కు తోడ్పాటు అందించేందుకు హర్‌స్టోర్‌ అనే వేదికను ఏర్పాటు చేసినట్లు బ్రిటానియా పేర్కొంది.   హెచ్‌సీసీబీ 25,000 మంది మహిళలకు ఆర్థిక, డిజిటల్‌ అక్షరాస్యతలో శిక్షణ కలి్పంచినట్లు తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement