‘నేను గెలిస్తే ఆ పదవి మస్క్‌కే’.. రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి | Vivek Ramaswamy wants Elon Musk as his presidential adviser | Sakshi
Sakshi News home page

‘నేను గెలిస్తే ఆ పదవి మస్క్‌కే’.. రిపబ్లికన్ అభ్యర్థి వివేక్ రామస్వామి

Published Mon, Aug 28 2023 4:53 PM | Last Updated on Mon, Aug 28 2023 5:22 PM

Vivek Ramaswamy wants Elon Musk as his presidential adviser - Sakshi

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిచి యూఎస్‌ అధ్యక్షుడిగా ఎన్నికైతే తనకు సలహాదారుగా ఎలాన్ మస్క్‌ (Elon Musk)ను కోరుకుంటానని రిపబ్లికన్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి భారతీయ-అమెరికన్ వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) పేర్కొన్నారు. లోవాలోని టౌన్ హాల్‌లో రామస్వామి మాట్లాడుతూ తన సంభావ్య అధ్యక్ష పదవికి సలహాదారులుగా ఎవరు కావాలనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఎన్‌బీసీ న్యూస్ నివేదించింది.

ట్విటర్‌ (ప్రస్తుతం ‘ఎక్స్‌’)ని స్వాధీనం చేసుకున్న తర్వాత గత సంవత్సరం ఆ సంస్థ నుంచి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఈ తొలగింపు చర్యను వివేక్‌ రామస్వామి మెచ్చుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ‘ఎలాన్‌ మస్క్‌ ఇటీవల చాలా మెరుగవడం సంతోషంగా ఉంది. నాకు అతన్ని కీలక సలహాదారుగా కోరుకుంటున్నా. ఎందుకంటే అతను ట్విటర్‌లో 75 శాతం మందిని తొలగించాడు’ అని రామస్వామి పేర్కొన్నట్లుగా ఎన్‌బీసీ న్యూస్ కథనం వివరించింది.

గతంలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్‌కు మద్దతు తెలిపిన ఎలాన్‌ మస్క్‌ ఇటీవల వికేక్‌ రామస్వామిని ఆశాజనక అభ్యర్థిగా భివిస్తున్నట్లు చెప్పాడు. రిపబ్లికన్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా అత్యంత పిన్న వయస్కుడైన రామస్వామి.. దక్షిణ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ తర్వాత రిపబ్లికన్ పార్టీ నామినేషన్ కోసం పోటీ పడుతున్న మరో ఇండియన్-అమెరికన్. 

ప్రభుత్వంలో విద్యా శాఖ, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, బ్యూరో ఆఫ్ ఆల్కహాల్, టొబాకో, ఫైర్‌ ఆర్మ్స్‌, ఎక్స్‌ప్లోసివ్స్‌ను మూసివేయాలని తాను కోరుకుంటున్నట్లు రామస్వామి పేర్కొన్నట్లుగా ఎన్‌బీసీ నివేదిక వివరించింది. 38 ఏళ్ల వివేక్‌ రామస్వామి 40 ఏళ్లలోపు అత్యంత సంపన్న అమెరికన్లలో ఒకరు. యేల్ నుంచి న్యాయ పట్టా పొందే ముందు హార్వర్డ్‌లో జీవశాస్త్రాన్ని అభ్యసించారు. ఫోర్బ్స్ ప్రకారం, కొంతకాలం బిలియనీర్‌గా ఉన్న ఆయన సంపద స్టాక్ మార్కెట్ తిరోగమనంతో 950 మిలియన్ డాలర్లకు పడిపోయింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement