టెల్కోలకు కాస్త ఊరట | Ten Years Extension For The Payment Of AGR Dues | Sakshi
Sakshi News home page

టెల్కోలకు కాస్త ఊరట

Published Wed, Sep 2 2020 4:25 AM | Last Updated on Wed, Sep 2 2020 5:43 AM

Ten Years Extension For The Payment Of AGR Dues - Sakshi

న్యూఢిల్లీ: ఏజీఆర్‌ బాకీల భారంతో కుంగుతున్న టెలికం సంస్థలకు సుప్రీంకోర్టు కాస్త ఊరట కల్పించింది. బకాయిల చెల్లింపునకు 10 సంవత్సరాల వ్యవధినిచ్చింది. 2021 మార్చి 31లోగా బాకీలో 10 శాతం భాగాన్ని కట్టాలని ఆదేశించింది. ఆయా టెల్కోల మేనేజింగ్‌ డైరెక్టర్లు (ఎండీ) లేదా చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్లు (సీఈవో) బకాయిల చెల్లింపునకు సంబంధించి నాలుగు వారాల్లోగా వ్యక్తిగత పూచీకత్తు ఇవ్వాల్సి ఉంటుందని సుప్రీం కోర్టు పేర్కొంది. వాయిదాలను చెల్లించని పక్షంలో జరిమానా, వడ్డీ విధించడంతో పాటు కోర్టు ఆదేశాల ధిక్కరణ కింద చర్యలు కూడా ఎదుర్కొనాల్సి వస్తుందని హెచ్చరించింది.

ఇక దివాలా చట్టం కింద చర్యలు ఎదుర్కొంటున్న టెలికం సంస్థలు స్పెక్ట్రంను విక్రయించే అంశంపై జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) తుది ఉత్తర్వులు ఇస్తుందని సుప్రీంకోర్టు తెలిపింది. బాకీల లెక్కింపునకు సంబంధించి టెలికం శాఖ లెక్కలు, గతంలో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల్లో మార్పేమీ ఉండబోవని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా సారథ్యంలోని బెంచ్‌ స్పష్టం చేసింది. వాస్తవానికి బాకీల చెల్లింపునకు టెల్కోలు, టెలికం శాఖ (డాట్‌) 20 ఏళ్ల వ్యవధికి అనుమతి కోరాయి. కానీ దాన్ని తిరస్కరించిన సుప్రీం కోర్టు పదేళ్ల వ్యవధికి అనుమతించడం గమనార్హం.

వొడాఫోన్‌కు కష్టం.. ఎయిర్‌టెల్‌కు ఫర్వాలేదు.. 
సుప్రీం కోర్టు తాజా ఆదేశాల ప్రకారం పదేళ్ల వ్యవధిలో బాకీలన్నీ కట్టాలంటే వొడాఫోన్‌ ఐడియాకు కష్టంగా ఉండవచ్చని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. భారతీ ఎయిర్‌టెల్‌ మాత్రం షెడ్యూల్‌ ప్రకారం చెల్లింపులు జరిపే అవకాశాలు ఉన్నాయని బ్రోకరేజీ సంస్థ మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పేర్కొంది. ఎనిమిది శాతం వడ్డీ రేటు ప్రకారం చూస్తే ఏటా భారతీ ఎయిర్‌టెల్‌ రూ. 3,900 కోట్లు, వొడాఫోన్‌ ఐడియా రూ. 7,500 కోట్లు కట్టాల్సి వస్తుందని లెక్క వేసింది. ఒకవేళ వడ్డీ భారం గానీ లేకపోతే ఇది రూ. 2,600 కోట్లు /రూ. 5,000 కోట్లకు తగ్గవచ్చని వివరించింది. ఇంకా వడ్డీ రేటు విషయంలో నిర్దిష్ట ఉత్తర్వులేమీ లేవని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ హెడ్‌ (ఈక్విటీ స్ట్రాటెజిస్ట్‌ బ్రోకింగ్‌ విభాగం) హేమంగ్‌ జానీ తెలిపారు.

‘ఎయిర్‌సెల్, వీడియోకాన్‌ కట్టాల్సిన బాకీల భారం ఎయిర్‌టెల్‌పై పడదు. అలాగే ఆర్‌కామ్‌ బకాయిల భారం రిలయన్స్‌ జియోపై ఉండదు. కాబట్టి సుప్రీంకోర్టు ఆదేశాలు ఎయిర్‌టెల్, రిలయన్స్‌లకు సానుకూలమైనవే కాగలవు‘ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు రీపేమెంట్‌ గడువులోగా లైసెన్సుల వ్యవధి ముగిసిపోయే టెలికం సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుందని కేఎస్‌ లీగల్‌ అండ్‌ అసోసియేట్స్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ సోనమ్‌ చంద్వాని అభిప్రాయపడ్డారు. ఇలాంటి టెల్కోలు లైసెన్సును రెన్యువల్‌ చేసుకోవడంలో విఫలమైతే పదేళ్ల వ్యవధి కన్నా ముందే బకాయి మొత్తం కట్టాల్సి వస్తుందని పేర్కొన్నారు.

ఏం జరిగింది.. 
సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) ఫార్ములా ప్రకారం స్పెక్ట్రం యూసేజీ చార్జీలు, లైసెన్సు ఫీజుల బాకీలను కేంద్రానికి టెలికం సంస్థలు కట్టాల్సిందేనని సుప్రీంకోర్టు గతేడాది అక్టోబర్‌లో ఆదేశాలు ఇచ్చింది. డాట్‌ లెక్కించిన దాని ప్రకారం టెల్కోలు దాదాపు రూ. 1.6 లక్షల కోట్లు పైచిలుకు కట్టాల్సి ఉంది. అయితే, తమ సొంత లెక్కల ప్రకారం తమ బాకీలు అంత భారీ స్థాయిలో లేవంటూ టెల్కోలు కొంతమేర కట్టాయి. ఇప్పటికే తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నందున మిగతాది కట్టేందుకు 20 ఏళ్ల   వ్యవధినివ్వాలంటూ కోరాయి.

అటు టెలికం శాఖ కూడా 20 ఏళ్ల వ్యవధినివ్వడంపై ఈ ఏడాది మార్చిలో అఫిడవిట్‌ దాఖలు చేసింది. వాయిదా పద్ధతిలో బాకీలు చెల్లించడంపై జూలై 20న సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్‌ చేసి ఉంచింది. అయితే, బాకీ మొత్తం విషయానికి సంబంధించి గతంలో ఇచ్చిన ఉత్తర్వుల్లో మార్పులేమీ ఉండబోవంటూ స్పష్టం చేసింది. ఇదే క్రమంలో టెలికం కంపెనీల గత పదేళ్ల ఖాతాలు సమర్పించాలని సూచించింది. అటు రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌ (ఆర్‌కామ్‌), రిలయన్స్‌ జియో మధ్య స్పెక్ట్రం షేరింగ్‌ ఒప్పందం వివరాలు కూడా ఇవ్వాలని ఆగస్టు 14న సూచించింది. తాజాగా బాకీల చెల్లింపు వ్యవధి విషయంలో ఆదేశాలు జారీ చేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement