ఆగిపోతున్న సరకు రవాణా..! | Supplies To India Largely Unaffected By Houthi Threat | Sakshi
Sakshi News home page

ఆగిపోతున్న సరకు రవాణా..!

Published Mon, Dec 25 2023 8:28 AM | Last Updated on Mon, Dec 25 2023 8:40 AM

Supplies To India Largely Unaffected By Houthi Threat  - Sakshi

అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటి సూయెజ్‌ కాలువలో 2021లో అతిపెద్ద కంటైనర్‌ నౌకల్లో ఒకటైన ఎవర్‌ గివెన్‌ చిక్కుకున్న విషయం తెలిసిందే. జపాన్‌కు చెందిన షూయీ కిసెన్‌ కేకే సంస్థకు చెందిన ఈ నౌకను అష్టకష్టాలతో ఎలాగోలా బయటకు తీసుకొచ్చిన ఉదంతం ఉంది. ఈ ఘటన వల్ల ప్రపంచ వాణిజ్యంపై చాలా ప్రభావం పడింది. వేల టన్నుల్లోని సరకు రవాణా నిలిచిపోయింది.

అయితే సూయెజ్‌ కాలువకు ఆనుకుని ఉన్న ఎర్ర సముద్రం ప్రపంచ నౌకా రవాణాకు కీలక మార్గం. ఈజిప్టులోని సూయెజ్‌ కాలువ మీదుగా ఈ మార్గాన్ని షిప్పింగ్‌ కంపెనీలు రవాణాకు ఉపయోగించుకుంటాయి. మధ్యదరా సముద్రం మీదుగా రవాణాకు ఇది అత్యంత దగ్గరి మార్గం. ఆఫ్రికా చుట్టూ తిరిగి రాకుండా దక్షిణ, తూర్పు ఆసియాలకు ఇది ఎంతో అనుకూలమైన మార్గం. ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడీ మార్గం ప్రమాదంలో పడింది. యెమెన్‌ కేంద్రంగా హౌతీ రెబల్స్‌ సరకు రవాణా చేసే నౌకలపై దాడులకు దిగుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

హౌతీ దాడులతో షిప్పింగ్‌ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఆఫ్రికాలోని బిజోటీ పక్కనే ఉన్న బాబ్‌ ఎల్‌-మండెబ్‌ మార్గంలో నౌకల రవాణా నిలిపేయనున్నట్లు ప్రకటించాయి. ఇది 10శాతం అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపనుంది. ఎర్ర సముద్రం మీదుగా 35 శాతం రవాణాను ఆపేశాయి. మార్స్క్‌, ఎంఎస్‌సీ, హపాగ్‌ లాయిడ్‌ కంపెనీలు ఇప్పటికే రవాణాను నిలిపేశాయి.

ప్రపంచ వ్యాప్తంగా వార్షిక షిప్పింగ్‌ వ్యాపారం 14 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. అది ప్రపంచ జీడీపీలో 16శాతం. అన్ని రవాణా వ్యవస్థల కంటే షిప్పింగ్‌ చౌకగా ఉంటుంది. ఇజ్రాయెల్‌, హమాస్‌ యుద్ధం ప్రారంభమయ్యాక నౌకా రవాణా వ్యయం పెరిగింది. 40 అడుగుల కంటైయినర్‌ ధర 5 శాతం పెరిగింది. ఏడాదికి 19,000 నౌకలు సూయెజ్‌ కాలువ మీదుగా ప్రయాణిస్తాయి. దీనివల్ల 30 రోజుల సమయం కలిసి వస్తుంది. అదే ఆఫ్రికా చుట్టూ తిరిగి వస్తే అధిక రవాణా వ్యయంతోపాటు సమయం వృథా అవుతుంది. దాంతోపాటు ప్రధానంగా సముద్ర దొంగల భయం ఎక్కువగా ఉంటుంది.

ఆసియా దేశాలు, ఈజిప్టు, ఈశాన్య ఐరోపాకు భారత్‌ నుంచి నౌకల ద్వారా సరకు రవాణా అవుతోంది. దీనికి ఎర్ర సముద్ర మార్గాన్ని వినియోగించుకుంటోంది. దీంతోపాటు అంతర్జాతీయ నౌకల్లో సిబ్బందిగా భారతీయులే అధికంగా ఉంటారు. మొత్తం సిబ్బందిలో 12 శాతం భారతీయులే. సముద్రపు దొంగల నుంచి ఇప్పటికే వారు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా యుద్ధం నేపథ్యంలో వారికి హౌతీ రెబల్స్‌ ప్రమాదకరంగా మారారు.

ఎర్ర సముద్రం మీదుగా సుదీర్ఘకాలం సరకు రవాణాకు అంతరాయం కలిగితే ఐరోపాలో ధరలు పెరుగుతాయి. సూయెజ్‌ కాలువ ద్వారా జరిగే సరకు రవాణాలో చమురు ఐదో వంతు ఉంటుంది. రెండు వైపులా రోజుకు దాదాపు 9 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. దీనికి ఆటంకం కలిగితే 2024లో చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: విమానం కంటే స్పీడ్‌గా వెళ్లే రైలు.. కథ కంచికే..

హౌతీ తెగకు చెందిన వారి హక్కుల పరిరక్షణ పేరుతో జైదీ షియాలు హౌతీ గ్రూపును ఏర్పాటు చేశారు. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్‌ పెత్తనాన్ని ఈ గ్రూపు వ్యతిరేకిస్తుంటుంది. పశ్చిమ యెమెన్‌ను కేంద్రంగా చేసుకుని ఈ గ్రూప్‌ తన కార్యకలాపాలు సాగిస్తోంది. ఇరాన్‌తోపాటు ఈ ప్రాంతంలోని ఇస్లామిక్‌ గ్రూపులు హౌతీ రెబల్స్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఎర్ర సముద్ర ముఖద్వారంగా ఉన్న బాబ్‌ ఎల్‌-మండెబ​్‌పై హౌతీ రెబల్స్‌కు ఆధిపత్యం ఉంది. ప్రస్తుతం ఈ గ్రూపునకు అబ్దుల్‌-మాలిక్‌ అల్‌ హౌతీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement