Work From Village: పల్లెల్లో వర్క్‌ఫ్రం హోం ? గ్రామీణ ప్రాంతాలపై స్టార్‌లింక్‌ దృష్టి Starlink broadband services plans in indian Rural Areas | Sakshi
Sakshi News home page

Work From Village: పల్లెల్లో వర్క్‌ఫ్రం హోం ? గ్రామీణ ప్రాంతాలపై స్టార్‌లింక్‌ దృష్టి

Published Sat, Nov 6 2021 3:05 AM | Last Updated on Sat, Nov 6 2021 9:54 AM

Starlink broadband services plans in indian Rural Areas - Sakshi

న్యూఢిల్లీ: పొలం గట్టున కూర్చునో.. మంచె మీద కంప్యూటర్‌ పెట్టుకునో.. పెరట్లో చెట్టు నీడన.. ఊరిపట్టున ఉంటూనే వర్క్‌ఫ్రం హోం పద్దతిలో ఉద్యోగం చేసే అవకాశం అతి త్వరలోనే రానుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. గ్రామీణ ప్రాంతాలకు బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించేందుకు అంతర్జాతీయ సంస్థలు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. అన్ని కుదిరితే అతి త్వరలో వైర్‌సెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు పల్లెలను పలకరించనున్నాయి.


నీతి అయోగ్‌ నిర్ణయంతో
అమెరికాకు చెందిన బ్రాడ్‌బ్యాండ్‌ సేవల సంస్థ స్టార్‌లింక్‌ తన కార్యకలాపాల్లో భాగంగా భారత్‌లో గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీసులను మరింతగా విస్తరించడంపై దృష్టి పెడుతోంది. ఇందుకోసం దేశీ టెలికం కంపెనీలతో జట్టు కట్టాలని భావిస్తోంది. స్టార్‌లింక్‌ ఇండియా కంట్రీ డైరెక్టర్‌ సంజయ్‌ భార్గవ ఈ విషయాలు తెలిపారు. జిల్లాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్టివిటీ ప్రణాళికకు సంబంధించి నీతి ఆయోగ్‌ ఫేజ్‌–1లో గ్రామాలను ఎంపిక చేసిన తర్వాత తాము బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ ప్రొవైడర్స్‌తో చర్చలు ప్రారంభించనున్నట్లు ఆయన వివరించారు.

టార్గెట్‌ రూరల్‌
గ్రామీణ జిల్లాల్లో 100 శాతం బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించడానికి ఇతర సంస్థలతో కూడా తాము కలిసి పని చేయాలనుకుంటున్నట్లు భార్గవ చెప్పారు. దేశీయంగా శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించేందుకు అవసరమయ్యే టెర్మినల్స్‌ ను కంపెనీ భారత్‌లో తయారు చేయబోతోందన్న వార్తలను ఆయన తోసిపుచ్చారు. స్థానికంగా వాటి ని ఉత్పత్తి చేసే యోచనేదీ ప్రస్తుతం లేదని పేర్కొ న్నారు.

స్టార్‌లింక్‌
మెరికాకు చెందిన బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌కు చెందిన రాకెట్ల తయారీ సంస్థ స్పేస్‌ఎక్స్‌కు స్టార్‌లింక్‌ అనుబంధ సంస్థ. ఇది ఇటీవలే భారత్‌లో కంపెనీ పేరు నమోదు చేసుకుంది. ఉపగ్రహ సాంకేతికత ద్వారా వేగవంతమైన ఇంటర్నెట్‌ సర్వీసులు అందించనుంది. ఇందుకోసం 99 డాలర్లు (సుమారు రూ. 7,350) డిపాజిట్‌గా కట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే భారత్‌లో 5,000 పైచిలుకు ప్రీ–ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ వెల్లడించింది.  

వైర్‌లెస్‌
స్టార్‌లింక్‌ సంస్థ లో ఎర్త్‌ ఆర్బిట్‌ (లియో) మోడ్‌లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించేలా ప్రణాళిక రూపొందిస్తోంది. పోల్స్‌, వైర్లు, ఫిక్స్‌డ్‌ ఏరియా వంటి చిక్కులు లేకుండా లియో ద్వారా బ్రాడ్‌బ్యాండ్‌ ఇంటర్నెట్‌ పొందవచ్చు. కరోనా తర్వాత వర్క్‌ఫ్రం విధానం పాపులర్‌గా మారింఇ. అయితే గ్రామీణ ప్రాంతాల్లో బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు ఎక్కువగా అందుబాటులో లేక చాలా మంది పట్టణ ప్రాంతాల్లోనే ఉంటూ వర్క్‌ఫ్రం హోం చేశారు. ఇక ఊర్లకు వైర్‌లెస్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు వస్తే అక్కడ కూడా వర్క్‌ఫ్రం హోం కల్చర్‌ చేసుకునేందుకు వీలవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement