మూరత్‌ ట్రేడింగ్‌ మురిపించెన్‌..! | Sensex, Nifty tick higher as Samvat 2078 begins on auspicious note | Sakshi
Sakshi News home page

మూరత్‌ ట్రేడింగ్‌ మురిపించెన్‌..!

Published Sat, Nov 6 2021 3:15 AM | Last Updated on Sat, Nov 6 2021 3:15 AM

Sensex, Nifty tick higher as Samvat 2078 begins on auspicious note - Sakshi

ముంబై: దీపావళి రోజు గంటసేపు జరిగిన మూరత్‌ ప్రత్యేక ట్రేడింగ్‌ మురిపించింది. స్టాక్‌ సూచీలు సంవత్‌ 2078 ఏడాదికి లాభాలతో స్వాగతం పలికాయి. మూరత్‌ ట్రేడింగ్‌లో ఎంపిక చేసుకున్న షేర్లు లాభాల్ని పంచుతాయనే నమ్మకంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు పాల్పడటంతో సూచీలు భారీ లాభాలతో మొదలయ్యాయి. రెండురోజుల వరుస నష్టాలకు చెక్‌పెడుతూ గురువారం సాయంత్రం 6:15 నిమిషాలకు సెన్సెక్స్‌ 436 పాయింట్ల లాభంతో 60,208 వద్ద మొదలైంది.

నిఫ్టీ 106 పాయింట్ల పెరిగి 17,935 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆటో షేర్లకు కలిసొచ్చింది. ప్రభుత్వరంగ బ్యాంక్‌ షేర్లకూ అధిక డిమాండ్‌ నెలకొంది. అయితే చివర్లో లాభాల స్వీకరణ జరగడంతో సెన్సెక్స్‌ 295 పాయింట్లు లాభపడి 60,067 దగ్గర స్థిరపడింది.

నిఫ్టీ 87 పాయింట్లు లాభపడి 17,916 పాయింట్ల దగ్గర ముగిసింది. సెన్సెక్స్‌ సూచీలో నాలుగు షేర్లు మాత్రమే నష్టపోయాయి.  విదేశీ ఇన్వెస్టర్లు రూ.328 కోట్ల షేర్లను విక్రయించగా.., దేశీయ ఇన్వెస్టర్లు స్వల్పంగా రూ.38 కోట్ల షేర్లను కొన్నారు. బలిప్రతిపదా సందర్భంగా శుక్రవారం స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. ఎక్సే్ఛంజీలతో          పాటు ఫారెక్స్, డెట్, కమోడిటీ మార్కెట్లు పనిచేయలేదు. నేడు, రేపు(శని,ఆది) సాధారణ సెలవు రోజులు. సోమవారం అన్ని మార్కెట్లు యథావిధిగా ప్రారంభమవుతాయి.   

ప్రపంచ మార్కెట్లకు ఫెడ్‌ బూస్ట్‌...
ఫెడ్‌ రిజర్వ్‌ కమిటి గురువారం రాత్రి ప్రకటించిన పాలసీ నిర్ణయాలు మెప్పించడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు నెలకొన్నాయి. తక్షణమే ఫెడ్‌ ట్యాపరింగ్‌ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది. నెలవారీగా చేపడుతున్న బాండ్ల కొనుగోళ్లను ఈ నవంబర్‌ నుంచి ప్రతి నెలా 15 బిలియన్‌ డాలర్ల మేర తగ్గించుకోనున్నట్లు పేర్కొంది. వడ్డీరేట్ల పెంపు ఇప్పట్లో ఉందని హామీనిచ్చింది. ఆసియా మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. అమెరికా అక్టోబర్‌ ఉద్యోగ గణాంకాలు అంచనాలకు మించి నమోదు కావడంతో శుక్రవారం ఐరోపా మార్కెట్లు ఒకశాతం లాభంతో ముగిశాయి. యూఎస్‌ సూచీలు అరశాతం లాభంతో ప్రారంభమయ్యాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement