శభాష్‌ శ్రీజ.. పదో తరగతిలోనే స్టార్టప్‌కి శ్రీకారం | Rural Innovator Srija Biodegradable Pots Are Ready For Pilot | Sakshi
Sakshi News home page

శభాష్‌ శ్రీజ.. పదో తరగతిలోనే స్టార్టప్‌కి శ్రీకారం

Published Sat, Sep 18 2021 7:03 PM | Last Updated on Sat, Sep 18 2021 8:15 PM

Rural Innovator Srija Biodegradable Pots Are Ready For Pilot - Sakshi

స్టార్టప్స్‌ అంటే ఫ్లిప్‌కార్ట్‌, ఓలా, జోమాటోలు గుర్తుకు వస్తాయి. స్టార్టప్‌ ఫౌండర్లు అంటే బైజూస్‌ రవీంద్ర, అథర్‌ తరుణ్‌ మెహతా ఇలా బయటి వారి పేర్లే  వినిపిస్తాయి. స్విగ్గీ, రెడ్‌బస్‌ వంటి స్టార్టప్‌లు తెలుగు వారే స్థాపించిన వీరిలో చాలా మంది అర్బన్‌ నేపథ్యం, ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన వారే ఎక్కువ. కానీ తెలంగాణలోని గ్రామీణ ప్రాంతంలోని జిల్లా పరిషత్‌ స్కూల్‌కి చెందిన ఓ విద్యార్థికి వచ్చిన ఐడియా పెద్ద స్టార్టప్‌కి నాందిగా మారింది.

జోగులాంబ గద్వాల జిల్లా చింతలకుంట జిల్లా పరిషత్‌ స్కూల్‌లో చదివిన శ్రీజకి వచ్చిన ఐడియా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం రూపు రేఖలనే మార్చబోతుంది. ఆమె ఇచ్చిన ఐడియాతో రూపొందించిన బయోపాట్‌లను భారీ ఎత్తున తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది.

సైన్స్‌ఫేర్‌ కోసం
పాఠశాల స్థాయిలో నిర్వహించిన సైన్స్‌ఫేర్‌ పోటీల్లో ఇంటి దగ్గర దొరికే వస్తువులతో చేతులతోనే ప్లాస్టిక్‌ కవర్లకు ప్రత్యామ్నాయంగా ఉండే కుండీలను శ్రీజ తయారు చేసింది. నర్సరీల్లో మొక్కలు పెంచేందుకు ప్లాస్టిక్‌ కవర్ల స్థానంలో ఆమె రూపొందించిన కుండీలు ఎంతో ఉపయోకరంగా ఉన్నాయి. వీటిని ఉపయోగించడం వల్ల  వాయు కాలుష్యం తగ్గించడంతో పాటు ప్టాస్టిక్‌ వినియోగాన్ని కంట్రోల్‌ చేసే వీలుంది. 

ముందుకొచ్చిన టీఎస్‌ఐసీ
శ్రీజ బయోపాట్‌ కాన్సెప్టుని తెలంగాణ ఇన్నోవేషన్‌ సెంటర్ (టీఎస్‌ఐసీ) దృష్టికి తీసుకెళ్లారు ఆమె పాఠశాలలో పని చేసే మ్యాథ్స్‌ టీచర్‌ అగస్టీన్‌. శ్రీజ ఫార్ములా ప్రకారం కుండీలు తయారు చేసేందుకు అవసరమైన యంత్ర సామాగ్రిని రూపొందించేందుకు  టీఎస్‌ఐసీ ముందుకు వచ్చింది.  


శభాష్‌ శ్రీజ
టీఎస్‌ఐసీ చేపట్టిన పలు ప్రయోగాల అనంతరం తొలి బయో ప్రెస్‌ 4టీ మిషన్‌ సెప్టెంబరు మొదటి వారంలో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ తయారైన కుండీలకు బయోపాట్‌లుగా పేరు పెట్టారు. ఇటీవల శశిథరూర్‌ నేతృత్వంలో హైదరాబాద్‌లో పర్యటించిన పార్లమెంటు ఐటీ స్టాండింగ్‌ కమిటీ పరిశీలించి శ్రీజను మెచ్చుకుంది.

భారీ ఎత్తున
శ్రీజ ఐడియాని అనుసరించి టీఎస్‌ఐసీ రూపొందించిన బయోప్రెస్‌ 4టీ మిషన్‌తో నెలకు 6,000ల వరకు బయోపాట్స్‌ని తయారు చేయవచ్చు. దీన్ని త్వరలోనే 50,000 సామర్థ్యానికి పెంచాలని నిర్ణయించారు. హరితహారంలో వాడే మొక్కలతో పాటు పలు నర్సరీలకు సైతం వీటిని సరఫరా చేసే యోచనలో ఉన్నారు. దీని కోసం స్వయం సహాయక బృందాల సహకారం తీసుకోనున్నారు. గ్రామీణ ప్రాంతంలో సరికొత్త ఉపాధికి ఈ బయోపాట్స్‌ అవకాశం కల్పిస్తున్నాయి. 

2 మిలియన్‌ టన్నులు
బయోపాట్‌లను భారీ ఎత్తున తయారు చేసి దేశవ్యాప్తంగా అన్ని నర్సరీల్లో ఉపయోగిస్తే ఏడాదికి రెండు మిలియన్‌ టన్నుల ప్లాస్టిక్‌ వ్యర్థాలను భూమిపైకి రాకుండా అడ్డుకునే వీలుంది. రాష్ట్ర స్థాయిలో హరితహారం  ప్రాజెక్టులో బయోపాట్స్‌ మంచి ఫలితాలు సాధిస్తే.... జాతీయ స్థాయిలో  సైతం వీటిని తయారు చేసి, మార్కెటింగ్‌ చేసే వీలుంది. 


అందరూ వింటున్నదే
బయోపాట్‌ స్టార్టప్‌కి శ్రీకారం పాఠశాలో ఉన్నప్పుడే జరిగింది. పాఠశాల స్థాయి నుంచి కాలేజీ వరకు ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహిస్తే అందులో ప్లాస్టిక్‌ వల్ల తలెత్తే అనర్థాలు, పర్యావరణ కాలుష్యం అనే టాపిక్స్‌ కామన్‌. స్కూల్‌ స్థాయిలో దాదాపు అందరు పిల్లలు వీటి గురించి వినడం, రాయడం చేస్తారు. అయితే తాను తెలుసుకున్న సమస్యలకు పరిష్కారం చూపే ప్రయత్నం శ్రీజ చేసింది.


కళ్లెదుటే సమస్య
ప్రభుత్వం చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో పిల్లలు మొక్కలు నాటడం విధిగా మారింది.  శ్రీజ సైతం ఇలా అనేక సార్లు మొక్కలు నాటింది. అయితే మొక్కలు నాటిన తర్వాత ఆ ప్లాస్టిక్‌ కవర్లను ఇష్టారీతిగా పడేడయం అవి రోజల తరబడి అక్కడే ఉండటం ఆమెకు నచ్చేది కాదు. అంతేకాదు కవర్ల ఊరబెరికేప్పుడు అజాగ్రత్తగా ఉంటే కొన్ని మొక్కలు చనిపోవడం కూడా ఎన్నో సార్లు చూసింది. దీంతో  ప్లాస్టిక్‌ చెత్త అనే సమస్య శ్రీజను ఆలోచనలో పడేసింది. 


ఐడియా తట్టింది
శ్రీజ నివసించే ఏరియాకి సమీపంలో ఉన్న పల్లి నూనె మిల్లుల్లో వేరుశనగ పొట్టును బయట పారేసి కాల్చేస్తుండేవారు. దీంతో ఆమె కళ్ల ముందే వాయు కాలుష్యాన్ని  నిత్యం చూసేది. అయితే కాలిపోకుండా మిగిలిన పొట్టు భూమిలో కలిసి పోవడం గమనించింది. వేరుశనగ గింజలకు రక్షణగా ఉండే ఆ పొట్టు మొక్కలకు అండగా ఉండలేదా ? అనే ఆలోచన వచ్చింది. 


స్నేహితుల సాయంతో
స్నేహితుల సాయంతో సేకరించిన పల్లీల పొట్టును మిక్సీలో వేసి పౌడర్‌గా మార్చింది. దానికి నీటిని కలిపి పేస్టులా చేసి ఓ మట్టి పాత్రను తయారు చేసింది. అలా తాను తయారు చేసిన మట్టి పాత్రలో ఓ మొక్కను ఉంచి పాఠశాల ఆవరణలో పాతింది. సరిగ్గా 20 రోజులకు ఆ మట్టి పాత్ర భూమిలో కలిసిపోయి మొక్కకు ఎరువుగా మారింది. అంతే తాన కళ్ల ముందే ఉన్న  పోగుపడిన ప్లాస్టిక్‌ వ్యర్థాలు , వాయు కాలుష్యాలను తగ్గించేందుకు ఉమ్మడి అవకాశం అక్కడే లభించింది.

పల్లెల నుంచి
జోగులాంబ గద్వాలలోని చింతలకుంట జిల్లా పరిషత్‌ స్కూల్‌ వేదికగా  ఓ కొత్త స్టార్టప్‌ రూపుదిద్దుకుంది. దానికి ఊపిరి పోసింది ఓ సాధారణ పాఠశాల విద్యార్థిని అయితే ఆమెకు అండగా ఆ పాఠశాల నిలిచింది. మన గ్రామీణ ప్రాంతంలో ప్రతిభకు కొదవ లేదని మరోసారి నిరూపించింది. పల్లెల నుంచి స్టార్టప్‌లు పుట్టుకొస్తాయంటూ లోకానికి చాటింది. 

- సాక్షి, వెబ్‌డెస్క్‌

చదవండి: డిజిటల్‌ న్యూస్‌ స్టార్టప్స్‌ కోసం గూగుల్‌ ’ల్యాబ్‌’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement