చిన్న ఇన్వెస్టర్లకూ ప్రభుత్వ బాండ్లు!! | PM Narendra Modi launches retail direct, integrated ombudsman schemes | Sakshi
Sakshi News home page

చిన్న ఇన్వెస్టర్లకూ ప్రభుత్వ బాండ్లు!!

Published Sat, Nov 13 2021 4:37 AM | Last Updated on Sat, Nov 13 2021 4:37 AM

PM Narendra Modi launches retail direct, integrated ombudsman schemes - Sakshi

న్యూఢిల్లీ: ఇప్పటిదాకా బ్యాంకులు, బీమా కంపెనీల్లాంటి పెద్ద సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటున్న ప్రభుత్వ బాండ్లను ఇకపై చిన్న స్థాయి రిటైల్‌ ఇన్వెస్టర్లు కూడా కొనుగోలు చేయొచ్చు. అంతే కాదు, బ్యాంకింగ్‌ సేవా లోపాలకు సంబంధించి వివిధ సంస్థల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఇందుకు సంబంధించిన రెండు స్కీములను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్‌గా ఆవిష్కరించారు. ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్, సమగ్ర అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ వీటిలో ఉన్నాయి.

దేశీయంగా పెట్టుబడి అవకాశాలను మరింతగా పెంచడానికి, సురక్షితమైన వ్యవస్థ ద్వారా క్యాపిటల్‌ మార్కెట్లలో సులువుగా ఇన్వెస్ట్‌ చేయడానికి రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ తోడ్పడగలదని ఈ సందర్భంగా ప్రధాని తెలిపారు. అభివృద్ధి పనుల కోసం నిధులు సమీకరించుకునేందుకు కూడా ఇది దోహదపడగలదని ఆయన పేర్కొన్నారు. ‘‘మధ్య తరగతి, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, సీనియర్‌ సిటిజన్‌లు మొదలైన వర్గాల వారంతా తమ పొదుపు మొత్తాలను నేరుగా, సురక్షితంగా ప్రభుత్వ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేయడానికి రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌ ఉపయోగపడుతుంది. ప్రభుత్వ సెక్యూరిటీలకు కచ్చితమైన సెటిల్మెంట్‌ హామీ ఉంటుంది కాబట్టి చిన్న ఇన్వెస్టర్లకు భరోసా ఉంటుంది’’ అని మోదీ చెప్పారు. ఇటీవలి కాలంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు మరింతగా ప్రభావం చూపేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ విధానాలు కూడా తోడ్పడ్డాయని ఆయన తెలిపారు.

సమష్టి కృషితో ఎకానమీ రికవరీ: ఆర్థిక మంత్రి
కోవిడ్‌–19తో దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, ఇటు ఆర్థిక శాఖ అటు ఆర్‌బీఐ కలిసికట్టుగా పనిచేయడం వల్ల, వేగంగా కోలుకుందని  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. రిటైల్‌ డైరెక్ట్‌ స్కీముతో బాండ్ల మార్కెట్‌ మరింతగా విస్తరించగలదని ఆమె తెలిపారు. మరోవైపు, తమ సర్వీసులను మెరుగుపర్చుకునేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ టెక్నాలజీ, నూతన ఆవిష్కరణలను గణనీయంగా ఉపయోగించుకుంటోందని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ తెలిపారు.

ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్ట్‌ స్కీమ్‌..
ఈ స్కీముతో వ్యక్తిగత రిటైల్‌ ఇన్వెస్టర్లు ఇకపై ప్రైమరీ, సెకండరీ మార్కెట్ల ద్వారా ట్రెజరీ బిల్లులు, ప్రభుత్వ బాండ్లు, సావరీన్‌ గోల్డ్‌ బాండ్లు, రాష్ట్రాల అభివృద్ధి రుణాలకు సంబంధించిన బాండ్లు మొదలైన వాటిని నేరుగా కొనుగోలు చేయొచ్చు. ఇతర ఇన్వెస్టర్లకు గిఫ్టుగా కూడా ఇవ్వొచ్చు. ఇందుకోసం ఆర్‌బీఐ వద్ద ఆన్‌లైన్‌ రిటైల్‌ డైరెక్ట్‌ గిల్ట్‌ అకౌంట్‌ (ఆర్‌డీజీ ఖాతా) తెరవాల్సి ఉంటుంది. ఈ అకౌంట్లు ఆయా ఇన్వెస్టర్ల పొదుపు ఖాతాలకు అనుసంధానమై ఉంటాయి. ఎన్‌డీఎస్‌–ఓఎం అనే ఎలక్ట్రానిక్‌ వ్యవస్థ ద్వారా ప్రభుత్వ బాండ్ల జారీ, సెకండరీ మార్కెట్‌ లావాదేవీల్లో రిటైల్‌ ఇన్వెస్టర్లు పాల్గొనవచ్చు. ప్రస్తుతం ఇది కేవలం బ్యాంకులు, ప్రైమరీ డీలర్లు, బీమా కంపెనీలు, మ్యూచువల్‌ ఫండ్స్‌ వంటి బడా సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉంటోంది.

ఒకే అంబుడ్స్‌మన్‌..
సమగ్ర అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ 2021 కింద, రిజర్వ్‌ బ్యాంక్‌ పరిధిలో పనిచేసే ఆర్థిక సంస్థలు అందించే సేవల్లో లోపాలపై కస్టమర్లు ఒకే చోట ఫిర్యాదు చేయొచ్చు. ప్రస్తుతం బ్యాంకులు, నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలు, పేమెంట్‌ సిస్టమ్‌ ఆపరేటర్లు వంటి వాటికి వేర్వేరుగా అంబుడ్స్‌మన్‌ ఉంటున్నారు. వీటికి సంబంధించిన బ్యాంకింగ్‌ అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ 2006, అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ ఫర్‌ నాన్‌–బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీస్‌ 2018, అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ ఫర్‌ డిజిటల్‌ ట్రాన్సాక్షన్స్‌ 2019 అనే 3 స్కీములను కలిపి కొత్తగా సమగ్ర అంబుడ్స్‌మన్‌ స్కీమ్‌ 2021ను రూపొందించారు. రూ. 50 కోట్ల పైగా డిపాజిట్‌ పరిమాణం ఉన్న షెడ్యుల్‌యేతర సహకార బ్యాంకులనూ దీనిలోకి చేర్చారు. ఫిర్యాదులపై ఆయా ఆర్థిక సంస్థలు 30 రోజుల్లోగా సంతృప్తికరమైన పరిష్కారం చూపకపోతే, కస్టమర్లు సమగ్ర అంబుడ్స్‌మన్‌ను ఆశ్రయించవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement