పెట్రోల్, డీజిల్‌ విక్రయాలు మళ్లీ పైకి | Petrol, diesel sales up 12-13percent in February | Sakshi
Sakshi News home page

పెట్రోల్, డీజిల్‌ విక్రయాలు మళ్లీ పైకి

Published Thu, Mar 2 2023 4:08 AM | Last Updated on Thu, Mar 2 2023 4:08 AM

Petrol, diesel sales up 12-13percent in February - Sakshi

న్యూఢిల్లీ: శీతాకాలం ప్రభావం తొలగిపోవడంతో ఫిబ్రవరిలో మళ్లీ పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు పుంజుకున్నాయి. రెండంకెల వృద్ధిని చూశాయి. ప్రభుత్వరంగ ఆయిల్‌ కంపెనీల గణాంకాలను పరిశీలిస్తే.. ఫిబ్రవరిలో పెట్రోల్‌ అమ్మకాలు 12 శాతం పెరిగి 2.57 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి. 2022 ఫిబ్రవరిలో పెట్రోల్‌ అమ్మకాలు 2.29 మిలియన్‌ టన్నులుగా ఉండడం గమనార్హం. 2021 ఫిబ్రవరి విక్రయాలు 1.57 మిలియన్‌ టన్నులతో పోల్చినా వృద్ధి నమోదైంది.

నెలవారీగా చూస్తే.. జనవరి నుంచి ఫిబ్రవరికి పెట్రోల్‌ అమ్మకాలు 13.5 శాతం పెరిగాయి. ఇక డీజిల్‌ విక్రయాలు గత నెలలో  6.52 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి. గతేడాది ఇదే నెలలో విక్రయాలతో పోలిస్తే 13 శాతం పెరిగాయి. ఈ ఏడాది జనవరి నెల విక్రయాలతో పోల్చి చూసినప్పుడు 9.2 శాతం వృద్ధి నమోదైంది. పర్వత ప్రాంతాల్లో మంచు వల్ల జనవరిలో డీజిల్‌ అమ్మకాలు 8.6 శాతం తగ్గడం గమనార్హం.

ట్రక్కులు తిరిగి పూర్తి స్థాయిలో రోడ్లపైకి రావడం, రబీ సాగు సీజన్‌ రద్దీగా మారడంతో ఇక ముందూ డీజిల్‌ అమ్మకాలు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. విమానయాన సేవలు పెరగడం ఏవియేషన్‌ టర్బయిన్‌ ఫ్యూయల్‌ (ఏటీఎఫ్‌) అమ్మకాలను పెంచింది. గతేడాది ఇదే నెలతో పోల్చినప్పుడు 2023 ఫిబ్రవరిలో ఏటీఎఫ్‌ విక్రయాలు 41 శాతం పెరిగి 5,74,200 టన్నులుగా ఉన్నాయి. ఎల్‌పీజీ అమ్మకాలు 2.43 శాతం పెరిగి 2.53 మిలియన్‌ టన్నులుగా ఉన్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement