పిల్లల కోసం ‘ఎల్‌ఐసీ అమృత్‌బాల్‌’.. ప్రత్యేకతలివే.. | LIC Amritbaal Policy Features For Childrens | Sakshi
Sakshi News home page

పిల్లల కోసం ‘ఎల్‌ఐసీ అమృత్‌బాల్‌’.. ప్రత్యేకతలివే..

Published Tue, Feb 20 2024 6:08 PM | Last Updated on Tue, Feb 20 2024 6:11 PM

LIC Amritbaal Policy Features For Childrens - Sakshi

గతంతో పోలిస్తే ఇప్పుడు ఎల్‌కేజీ, యూకేజీ చదివించాలంటే రూ.లక్షల్లో ఖర్చు చేయాల్సిందే. చిరుద్యోగులైనా, కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లైనా, ప్రభుత్వోద్యోగులైనా, వ్యాపారులైనా తమ పిల్లలకు మెరుగైన విద్యాభ్యాసానికి మొగ్గు చూపుతున్నారు. మున్ముందు ఉన్నత విద్యాభ్యాసం కోసం భారీగా నిధులు అవసరం. ఈ నేపథ్యంలో భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) సరికొత్త పాలసీ తీసుకొచ్చింది. పిల్లల ఉన్నత చదువుల కోసం పొదుపు చేయాలని భావించే వారి కోసం ‘అమృత్ బాల్’ అనే పాలసీ తెచ్చింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యూవల్, సేవింగ్స్ జీవిత బీమా పథకం.

మెచ్చూరిటీ కాలం..

ఇటీవలే ప్రారంభమైన ఈ బీమా పాలసీని పిల్లల ఉన్నత చదువులకు పొదుపు చేసే తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టారు. ఇందులో అతి తక్కువ బీమా చెల్లింపు గడువు ఉంటుంది. సింగిల్ ప్రీమియం చెల్లింపు ఆప్షన్ కూడా ఉంది. పిల్లల ఉన్నత విద్య అవసరాల కోసం 18-25 ఏళ్ల వయసు మధ్య బీమా పాలసీ మెచ్యూరిటీ వస్తుంది. 30 రోజుల చిన్నారి పేరు మీద కూడా ఈ పాలసీ అప్లయ్ చేయొచ్చు. గరిష్టంగా 13 ఏండ్ల వయసు గల పిల్లల పేరిట తీసుకోవచ్చు. పాలసీ కనిష్ట మెచ్యూరిటీ 18 ఏళ్లు, గరిష్ట వయసు 25 ఏళ్లుగా నిర్ణయించారు. పాలసీ టర్మ్ కనీసం 10 ఏళ్లు, గరిష్టంగా 25 ఏళ్లు ఉంటుంది.

ప్రతి రూ.1000కి ఏటా జమ అయ్యే సొమ్ము..

ఈ పాలసీలో సింగిల్ ప్రీమియం ఆప్షన్ కూడా ఉన్నది. ఈ ఆప్షన్ ఎంచుకుంటే మాత్రం కనీస పాలసీ టర్మ్ ఐదేండ్లు, గరిష్ట పాలసీ టర్మ్ 25 ఏళ్లు ఉంటుంది. కనీస సమ్ హామీ రూ.2 లక్షలు ఉంటుంది. గరిష్ట మొత్తానికి ఎటువంటి పరిమితుల్లేవు. తల్లిదండ్రులు తమ పిల్లల విద్యావసరాలను పరిగణనలోకి తీసుకుని, వారి ప్రీమియం చెల్లింపు ఆధారంగా పాలసీ తీసుకొవచ్చు. బీమా పాలసీపై ప్రతి రూ.1000 లకు ఏటా రూ.80 చొప్పున పాలసీ ఉన్నంత కాలం కలుస్తుంది. పాలసీ చెల్లింపు సమయంలో పాలసీదారుడికి ఏదేనా జరిగితే నామినీకి డెత్ బెనిఫిట్లు అందిస్తారు.

ఇదీ చదవండి: మీ బైక్‌ మైలేజ్‌ ఇవ్వట్లేదా.. ఇవి పాటించాల్సిందే..

చెల్లింపుల వివరాలు..

ఈ పాలసీ కింద రుణం కూడా తీసుకోవచ్చు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లోనూ కొనుగోలు చేయవచ్చు. నెలవారీ, త్రైమాసికం, ఆరు నెలలు, ఏడాది ప్రీమియం ఎంచుకోవచ్చు. లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ -1లో ఏడు రెట్లు, ఆప్షన్-2లో పది రెట్ల రిటర్న్స్ ఉంటాయి. సింగిల్ ప్రీమియం ఆప్షన్-3లో 1.25 రెట్లు, ఆప్షన్-4 ప్రకారం 10 రెట్లు బెనిఫిట్ ఉంటుంది. ఐదేళ్ల ప్రీమియం ఆప్షన్-1 కింద రూ.99,625, ఆప్షన్ 2 కింద రూ.1,00,100, ఆరేళ్లు ప్రీమియం ఆప్షన్ -1 కింద రూ.84,275, ఆప్షన్ -2లో రూ.84,625, ఏడేళ్లు ప్రీమియం టర్మ్ ఆప్షన్ -1 కింద రూ.73,625, ఆప్షన్ -2లో రూ.73,900 చెల్లించాలి. ఇక సింగిల్ ప్రీమియం పాలసీలో ఆప్షన్-3 కింద రూ.3,89,225, ఆప్షన్ -4 కింద రూ.4,12,600 చెల్లించాల్సి ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement