బంగారం..పెట్టుబడిగా మంచి సాధనమేనా? | Investment In Gold: Is It A Good Time To Invest In Gold Right Now | Sakshi
Sakshi News home page

బంగారం..పెట్టుబడిగా మంచి సాధనమేనా?

Published Mon, Dec 6 2021 8:26 PM | Last Updated on Mon, Dec 6 2021 8:54 PM

Investment In Gold: Is It A Good Time To Invest In Gold Right Now - Sakshi

ప్రశ్న: ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల నేపథ్యంలో కొత్తగా పెట్టుబడులు ప్రారంభించే ఇన్వెస్టర్లకు మీరు ఇచ్చే సూచన ఏమిటి?  - రాజేష్‌ 
సమాధానం: మార్కెట్లు ఆందోళనకరంగా కనిపించొచ్చు లేదా పడిపోతాయని అనిపించొచ్చు. లేదంటే ర్యాలీని కోల్పోవచ్చు. కనుక వీటిని పట్టించుకోకుండా ప్రతీ నెలా ఎంత మొత్తాన్ని పొదుపు చేయాలనుకుంటే అంత మేరకు వెంటనే ప్రారంభించాలి. మీ పెట్టుబడుల విలువను చూడకుండా మూడేళ్లపాటు అనుకున్నట్టుగా ఇన్వెస్ట్‌చేస్తూ వెళ్లండి. ఆరంభం ఇలానే ఉండాలి. ఒకవేళ సరైన సమయంలో ప్రవేశించాలని, మార్కెట్‌ పతనం కోసం వేచి చూస్తే ఆ పనిచేయడం కష్టమే అవుతుంది. మార్కెట్లు పడిపోవడం మొదలవగానే అప్పుడు కూడా పెట్టుబడులు పెట్టకుండా ఒక స్థాయి వరకు పడిపోయి స్థిరపడే వరకు చూద్దాంలే అని అనుకుంటారు. ఈ తరహా ఆలోచనల నుంచి బయటకు రావాలి. ప్రారంభంలో ప్రతీ రోజూ మార్కెట్‌ కదలికలను చూడకుండా పెట్టుబడులు పెడుతూ వెళ్లాలి.  

ప్రశ్న:  బంగారాన్ని పెట్టుబడిగా ఎందుకు పరిగణిస్తుంటారు? ఇది ఎంత భద్రం, పెట్టుబడిగా ఇది మంచి సాధనమేనా?  - అర్చనా సావిత్రి 
సమాధానం: బంగారం అన్నది భౌతిక రూపంలో ఉంటూ, ధరించేందుకు అనుకూలమైనది కావడంతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. దీనికి చారిత్రక, సాంస్కృతిక, సంప్రదాయాల విలువ కూడా తోడవుతుంది. చారిత్రకంగా చూస్తే భూమి తప్ప బంగారం మాదిరిగా విలువ కాపాడుకోగలిగినది మరొకటి లేదు. అయితే, కష్ట సమయాల్లో బంగారం మాదిరి భూమిని వినియోగించుకోవడం కష్టం. బంగారం నిజంగా నిల్వ చేసినా, విలువతో ఉండే సాధనమే. కానీ, పెట్టుబడులకు ఇది మంచి సాధనం కాదు. దీనికంటే కూడా ఈక్విటీ, స్థిరాదాయ పథకాలు మరింత ఉత్పాదకతతో ఉంటాయని నేను నమ్ముతాను. బంగారం ఆభరణాల గురించి మాట్లాడేట్టు అయితే వాటిని వినియోగంగానే చూడాల్సి ఉంటుంది. ఆభరణాలపై తయారీ చార్జీలు, లావాదేవీల, ఇతర చార్జీలన్నవి 10-20 శాతం వరకు ఉంటాయి. అంటే రూ.లక్ష బంగారం కొంటున్నారంటే నిజంగా రూ.80,000 విలువ బంగారాన్నే పొందుతున్నట్టుగా అర్థం చేసుకోవాలి.  

ప్రశ్న: పనిచేసే సంస్థ నుంచి హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ ఉన్నప్పటికీ ఉద్యోగి సొంతంగానూ ఒక హెల్త్‌ప్లాన్‌ కలిగి ఉండాలనడం ఎందుకని?- శ్రీరామ్‌ రామనాథన్‌ 
సమాధానం: ఇందుకు రెండు కారణాలను మీరు గమనించాల్సి ఉంటుంది. మీ సంస్థ ఇస్తున్న ఇన్సూరెన్స్‌ కవరేజీ సంపూర్ణంగా, తగినంతగా లేకపోవడం. ఉదాహరణకు రూ.3 లక్షల కవరేజీ ఇస్తుందనుకుంటే..అది చాలదనే చెప్పుకోవాలి. కనీసం రూ.5 లక్షల  కవరేజీ అయినా అవసరం. అలాగే, పనిచేసే సంస్థ ఇస్తున్న హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సమగ్రంగా లేకపోవచ్చు. ఉదాహరణకు మీకు వృద్ధులైన తల్లిదండ్రులు ఉంటే వారికి బీమాను పనిచేసే సంస్థ ఇవ్వకపోవచ్చు. లేదా వారికి కూడా తీసుకోవాలంటే ప్రీమియం భారీగా ఉండొచ్చు. అలాగే, మీకు అవసరమైన అన్ని రకాల కవరేజీ ఆప్షన్లు ఉండకపోవచ్చు. వ్యక్తిగతంగా అయితే మీ అవసరాలను తీర్చే అనుకూలమైన హెల్త్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకోవచ్చు. ఉద్యోగం మారినా, బీమా రక్షణ ఆగిపోకుండా చూసుకోవచ్చు.  

ప్రశ్న: మ్యూచువల్‌ ఫండ్స్‌ తాము పెట్టుబడులు పెట్టిన కంపెనీల నుంచి అందుకున్న డివిడెండ్‌పై పన్ను చెల్లించాలా? ఎందుకు? - ఆర్‌కే శర్మ 
సమాధానం: మ్యూచువల్‌ ఫండ్స్‌ పన్నులు చెల్లించవు. రెండేళ్ల క్రితం వరకు డివిడెండ్‌ పంపిణీ పన్ను అమల్లో ఉండేది. వ్యక్తిగత ఇన్వెస్టర్, మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇలా డివిడెండ్‌ ఎవరికి పంచినా దానిపై కంపెనీలే పన్ను లు చెల్లించేవి. దీంతో ఇన్వెస్టర్‌ చేతికి వచ్చే డివిడెండ్‌ పూర్తిగా పన్ను రహితంగా ఉండేది. కానీ, ఇప్పుడు ఇందులో మార్పు వచ్చింది. డివిడెండ్‌ స్వీకరించే ఇన్వెస్టరే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మ్యూచువల్‌ ఫండ్స్‌ తమ నిర్వహణలోని పెట్టుబడులకు సంబంధించి ఎటువంటి పన్నులు చెల్లించవు.

ధీరేంద్ర కుమార్ - సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement