స్మార్ట్‌ఫోన్ల పండగ వచ్చింది India to see record smartphone sales at 7. 7 billion dollers during festive season | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ఫోన్ల పండగ వచ్చింది

Published Thu, Sep 22 2022 6:09 AM | Last Updated on Thu, Sep 22 2022 2:51 PM

India to see record smartphone sales at 7. 7 billion dollers during festive season - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ పండుగల సీజన్లో 5.17 కోట్ల యూనిట్ల స్మార్ట్‌ఫోన్లు అమ్ముడవుతాయని అంచనా. వీటి విలువ రూ.1.44 లక్షల కోట్లు ఉంటుందని టెక్నాలజీ మార్కెట్‌ రిసర్చ్‌ కంపెనీ టెక్‌ఆర్క్‌ వెల్లడించింది. 2022లో స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల ద్వారా కంపెనీలకు వచ్చే మొత్తం ఆదాయంలో ఇది 43 శాతానికి సమానం.

యూనిట్ల పరంగా చూస్తే అమ్ముడయ్యే మొత్తం పరిమాణంలో వీటి వాటా 31.9 శాతం. 4జీ స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో 58.7 శాతం యూనిట్లు రూ.6–12 వేల ధరల శ్రేణి మోడళ్లు ఉంటాయి. ఈ విభాగంలో ఆదాయం అత్యధికంగా రూ.12–25 వేల శ్రేణిలో నమోదు కానుంది. మొత్తం స్మార్ట్‌ఫోన్ల విక్రయాల్లో ఆన్‌లైన్‌ మార్కెట్‌ప్లేస్, ఈ–కామర్స్‌ స్టోర్లు అత్యధికంగా 65–68 శాతం చేజిక్కించుకోనునున్నాయి.  

ఏడు కంపెనీలదే..
ఇక 5జీ స్మార్ట్‌ఫోన్లు 30.2 శాతం వాటాతో 1.56 కోట్ల యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళతాయని టెక్‌ఆర్క్‌ అంచనా. సీజన్లో కంపెనీలు అందుకునే ఆదాయంలో వీటి వాటా ఏకంగా 66.7 శాతం ఉండనుంది. 5జీ విషయంలో పరిమాణం పరంగా రూ.25–50 వేల ధరల శ్రేణి మోడళ్ల వాటా 37.8 శాతం, విలువ పరంగా రూ.50 వేలు ఆపైన ధర కలిగిన మోడళ్ల వాటా 66.9 శాతం ఉండే చాన్స్‌ ఉంది. అమ్ముడయ్యే మొత్తం స్మార్ట్‌ఫోన్లలో యాపిల్, శామ్‌సంగ్, వన్‌ప్లస్, వివో, ఒప్పో, రియల్‌మీ, షావొమీ కలిపి 90 శాతం పరిమాణం కైవసం చేసుకుంటాయి.  

మేకిన్‌ ఇండియా ఫోన్లు..
ఈ ఏడాది ఏప్రిల్‌–జూన్‌లో మేకిన్‌ ఇండియా ఫోన్లు 4.4 కోట్ల యూనిట్లు నమోదయ్యాయి. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 16 శాతం అధికమని కౌంటర్‌పాయింట్‌ రిసర్చ్‌ తెలిపింది. ‘ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకం ఈ స్థాయి వృద్ధికి కారణం. స్మార్ట్‌వాచ్, ట్రూ వైర్‌లెస్‌ స్టీరియో, నెక్‌బ్యాండ్, ట్యాబ్లెట్‌ పీసీ వంటి ఉత్పత్తుల తయారీ సైతం అధికం అయింది. మేకిన్‌ ఇండియా స్మార్ట్‌ఫోన్లలో 24 శాతం వాటాతో ఒప్పో అగ్రస్థానంలో నిలిచింది. శామ్‌సంగ్, వివో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  

థర్డ్‌ పార్టీలు సైతం..
స్మార్ట్‌ఫోన్‌ విభాగంలో కంపెనీలు సొంతంగా తయారు చేసినవి 66 శాతం కాగా, మిగిలినది థర్డ్‌ పార్టీ కంపెనీలు రూపొందించినవి. స్మార్ట్‌ఫోన్ల రంగంలో భారత్‌ ఎఫ్‌ఐహెచ్, డిక్సన్, డీబీజీ కంపెనీలు థర్డ్‌ పార్టీ విభాగంలో ముందు వరుసలో ఉన్నాయి. 75 శాతం స్మార్ట్‌వాచ్‌లను ఆప్టీమస్‌ ఉత్పత్తి చేయడం విశేషం. ట్యాబ్లెట్‌ పీసీల్లో వింగ్‌టెక్, శామ్‌సంగ్, డిక్సన్‌లు టాప్‌–3లో ఉన్నాయి. టీవీల విభాగంలో డిక్సన్, రేడియంట్, శామ్‌సంగ్, ఎల్‌జీ కంపెనీల వాటా 50 శాతం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement