India Media Entertainment Industry Projected To Reach Rs 68 Lakh Crore By 2027, See Details - Sakshi
Sakshi News home page

మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఆదాయం... రూ. 6 లక్షల కోట్లు!

Published Wed, Jul 19 2023 1:15 PM | Last Updated on Wed, Jul 19 2023 1:40 PM

India media entertainment industry reach Rs 68 lakh crore by 2027 - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో మీడియా, వినోద పరిశ్రమ ఆదాయం భారీ వృద్ధిని చూడనుంది. 2027 నాటికి పరిశ్రమ ఆదాయం ఏటా 10 శాతం చొప్పున పెరుగుతూ 73.6 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని (రూ.6.03 లక్షల కోట్లు) పీడబ్ల్యూసీ సంస్థ అంచనా వేసింది. వినియోగదారుల ప్రాధాన్యతలు పెరుగుతూ ఉండడం, ఇంటర్నెట్‌ విస్తరణ, కొత్త టెక్నాలజీల అవతరణ ఇవన్నీ కూడా మీడియా, వినోద పరిశ్రమ రూపురేఖలను మార్చేస్తున్నట్టు పేర్కొంది. 

అంతర్జాతీయ మీడియా, వినోద పరిశ్రమపై ఓ నివేదికను విడుదల చేసింది. ‘‘అంతర్జాతీయ మీడియా, వినోద పరిశ్రమకు 2022ను కీలక మలుపుగా చెప్పుకోవాలి. 5.4 శాతం వృద్ధితో ఆదాయం 2.32 లక్షల డాలర్లకు (రూ.190 లక్షల కోట్లు) చేరింది. 2021లో వృద్ధి 10.6 శాతంతో పోలిస్తే సగం తగ్గింది. వినియోగదారులు చేసే ఖర్చు తగ్గడమే ఇందుకు కారణం’’అని నివేదిక తెలిపింది. మొత్తం ప్రకటనల ఆదాయంలో అతిపెద్ద విభాగంగా ఉన్న ఇంటర్నెట్‌ ప్రకటనల విభాగంలో వృద్ధి గతేడాది స్తబ్దుగా ఉన్నట్టు పేర్కొంది.  

భారత్‌లో ఆశావహం 
భారత్‌లో మీడియా, వినోద పరిశ్రమ వృద్ధికి ఆశావహ పరిస్థితులు నెలకొన్నట్టు పీడబ్ల్యూసీ నివేదిక తెలిపింది. 2022లో పరిశ్రమ ఆదాయం 15.9 శాతం వృద్ధి చెంది 46,207 మిలియన్‌ డాలర్లుగా (రూ.3.78 లక్షల కోట్లు) ఉన్నట్టు వెల్లడించింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు, గేమింగ్, సంప్రదాయ టీవీ, ఇంటర్నెట్, అవుట్‌ ఆఫ్‌ హోమ్‌ ప్రకటనల దన్నుతో పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందే అవకాశాలున్నట్టు వివరించింది. 

ఇదీ చదవండి  Economic Loss due to floods: కన్నీటి వరదలు.. ఎన్ని వేల కోట్ల నష్టాన్ని మిగిల్చాయో తెలుసా? ఎస్‌బీఐ రిపోర్ట్‌

ముఖ్యంగా 2022లో భారత్‌లో 5జీ సేవలు ప్రారంభించడం మీడియా, వినోద పరిశ్రమ వృద్ధికి దోహదపడే ముఖ్యమైన అంశంగా పేర్కొంది. నూతన ఆవిష్కరణలతో ఓటీటీ ఆదాయం 2022లో 1.8 బిలియన్‌ డాలర్లకు వృద్ధి చెందిందని, 2021లో 1.4 బిలియన్‌ డాలర్ల ఆదాయంతో పోలిస్తే 25 శాతం అధికమని, 2018లో ఉన్న ఆదాయంతో పోలిస్తే ఆరు రెట్లు వృద్ధి చెందినట్టు వివరించింది. భారత్‌లో ఓటీటీ ఆదాయం ఏటా 14.3 శాతం చొప్పున వృద్ధి చెందుతూ, 2027 నాటికి 3.5 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.  

వినియోగం విస్తృతం 
‘‘ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషిన్‌ లెర్నింగ్‌ (ఎంఎల్‌), మెటావర్స్‌ విస్తరణతో వినియోగం విస్తృతమైంది. ప్రేక్షకుల ఆకాంక్షలకు అనుగుణంగా కొనసాగేందుకు రూపాంతర ఆవిష్కరణలపై కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాయి’’అని పీడబ్ల్యూసీ ఇండియా చీఫ్‌ డిజిటల్‌ ఆఫీసర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ అహుజా తెలిపారు.

మొబైల్‌ వినియోగం పెరగడం ప్రస్తుత చానళ్లపై ప్రభావం చూపిస్తుందని పీడబ్ల్యూసీ నివేదిక అంచనా వేసింది. డిజిటల్‌ చానళ్ల నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నందున, సంప్రదాయ మీడియా, వినోద వ్యాపార సంస్థలు సరైన విధానాలను అవలంబించడం కీలకమని పేర్కొంది. భారత్‌ ఈ ఏడాది వేగంగా వృద్ధి సాధిస్తున్న వార్తా పత్రికల మార్కెట్‌గా ఉన్నట్టు తెలిపింది. ఓటీటీ, కనెక్టెడ్‌ టీవీ మార్కెట్‌కు భారత్‌లో భారీ వృద్ధి అవకాశాలున్నట్టు అంచనా వేసింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement