బీమా పాలసీ.. అత్యవసర నిధి! | A facility to borrow against the policy if funds are required | Sakshi
Sakshi News home page

బీమా పాలసీ.. అత్యవసర నిధి!

Published Mon, May 20 2024 3:28 AM | Last Updated on Mon, May 20 2024 2:38 PM

A facility to borrow against the policy if funds are required

నిధులు కావాలంటే పాలసీపై రుణం తీసుకునే సదుపాయం 

వడ్డీ రేటు చాలా తక్కువ

బీమా రక్షణ కొనసాగించుకోవచ్చు 

ఉన్నట్టుండి నిధుల అవసరం ఏర్పడిందా..? వ్యక్తిగత రుణానికి తక్కువ క్రెడిట్‌ స్కోర్‌ అడ్డు పడుతోందా? లేదంటే వ్యక్తిగత రుణంపై అధిక వడ్డీ రేటు చూసి వెనుకాడుతున్నారా..? ఇలాంటి సందర్భాల్లో బీమా పాలసీయే మిమ్మల్ని ఆదుకుంటుంది. అదెలా అంటారా? ఎండోమెంట్‌ బీమా ప్లాన్లపై బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. పైగా పర్సనల్‌ లోన్‌తో పోలిస్తే వడ్డీ రేటు తక్కువే.

డబ్బులు అవసరం పడితే బీమా పాలసీని సరెండ్‌ చేసే వారూ ఉన్నారు. ఇలా ఇన్సూరెన్స్‌ పాలసీని సరెండర్‌ చేయడానికి బదులు, దానిపై రుణం తీసుకుని అవసరం గట్టెక్కడమే మంచి మార్గం అవుతుంది. దీనివల్ల బీమా రక్షణను ఎప్పటి మాదిరే కొనసాగించుకోవచ్చు. ఇది ఎలా పనిచేస్తుందన్నది తెలియజేసే కథనమే ఇది. 

రుణ సదుపాయం అన్ని రకాల బీమా పాలసీలపై వస్తుందనుకుంటే పొరపాటు. కేవలం కొన్ని రకాల పాలసీలకే ఇది పరిమితం. ‘‘పొదుపుతో కూడిన సంప్రదాయ బీమా పాలసీ (ఎండోమెంట్, మనీ బ్యాక్‌ ప్లాన్లు) కలిగి ఉన్నవారు వాటిపై పలు రకాల ఆర్థిక అవసరాల కోసం రుణాన్ని పొందొచ్చు’’అని ఏజెస్‌ ఫెడరల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈవో విఘ్నేష్‌ సహానే తెలిపారు. 

టర్మ్‌ ఇన్సూరెన్స్‌ ప్లాన్లు కేవలం మరణ పరిహారాన్నే అందిస్తాయని, ఎలాంటి రాబడి హామీ ఉండదు కనుక వాటిపై రుణం పొందలేరని స్పష్టం చేశారు. యూనిట్‌ లింక్డ్‌ ప్లాన్ల (యులిప్‌)లోనూ రాబడులు మార్కెట్‌పై ఆధారపడి ఉంటాయి కనుక వాటిపైనా రుణ సదుపాయం ఉండదని తెలిపారు.   

ఎక్కడ తీసుకోవచ్చు? 
పాలసీ మంజూరు చేసిన జీవిత బీమా కంపెనీ నుంచే రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. నేడు చాలా బీమా సంస్థలు పాలసీలపై రుణాలను కూడా ఇస్తున్నాయి. అలాగే, బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు ఈ తరహా రుణాలను ఆఫర్‌ చేస్తుంటాయి. అయితే, బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల కంటే పాలసీ మంజూరు చేసిన బీమా సంస్థను సంప్రదించడమే మెరుగైన మార్గమని నిపుణులు అంటున్నారు.

 ‘‘ఇన్సూరెన్స్‌ కంపెనీతో పోలిస్తే బ్యాంక్‌లు బీమా ప్లాన్లపై తక్కువ రుణ మొత్తాన్ని ఆఫర్‌ చేస్తాయి. అదే మాదిరి బీమా సంస్థలతో పోలిస్తే బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీలు రుణాలపై కొంచెం అధిక రేటును వసూలు చేస్తుంటాయి’’అని సెబీ నమోదిత ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ ‘ప్లాన్‌ ఆర్‌’ వ్యవస్థాపకుడు అజయ్‌ ప్రుతి తెలిపారు. 

బ్యాంక్‌లు సాధారణంగా బీమా పాలసీపై రుణాన్ని నేరుగా కాకుండా.. కరెంట్‌ అకౌంట్‌పై ఓవర్‌ డ్రాఫ్ట్‌ సదుపాయం కింద అందిస్తుంటాయి. ‘‘తరచుగా నిధుల అవసరం ఏర్పడేవారు ఇలా కరెంట్‌ అకౌంట్‌పై (సెక్యూరిటీ కింద బీమా పాలసీ జమ చేసి) ఓవర్‌డ్రాఫ్ట్‌ సదుపాయం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చని పైసా బజార్‌ చీఫ్‌ బిజినెస్‌ ఆఫీసర్‌ సహిల్‌ అరోరా సూచించారు. 

చౌక రుణం 
‘‘బీమా పాలసీలపై రుణ రేటు చాలా తక్కువగా ఉండడాన్ని గమనించొచ్చు. సాధారణంగా వీటిపై 9–9.5 శాతం వార్షిక వడ్డీ రేటును వసూలు చేస్తుంటారు. అదే వ్యక్తిగత రుణాలు (పర్సనల్‌ లోన్‌) అయితే 12 శాతం అంతకంటే ఎక్కువే ఉంటుంది’’అని బజాజ్‌ అలియాంజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ రాజేష్‌ కృష్ణన్‌ తెలిపారు. ఇక బీమా పాలసీలపై రుణం ఎంతొస్తుందంటే.. రుణం తీసుకునే నాటికి ఉన్న స్వా«దీనపు విలువ (సరెండర్‌ వ్యాల్యూ)లో 90 శాతం వరకు. బ్యాంక్‌లు, ఎన్‌బీఎఫ్‌సీల నుంచి రుణం మంజూరునకు సాధారణంగా నాలుగు నుంచి ఏడు రోజులు పడుతుంది.

 అదే బీమా సంస్థల నుంచి రుణం మూడు రోజుల్లోనే పొందొచ్చు. కొన్ని బీమా సంస్థలు ఇంతకంటే వేగంగా ఆన్‌లైన్‌లోనే పాలసీలపై రుణాలను మంజూరు చేస్తున్నాయి. ‘‘జీవిత బీమా పాలసీలపై రుణం దరఖాస్తు మదింపు, రుణం మంజూరు చాలా వేగంగా ఉంటుంది. బీమా సంస్థ నుంచే రుణం తీసుకునేట్టు అయితే ఎలాంటి అదనపు తనిఖీలు, పరిశీలనలు అవసరం పడవు’’అని రాజేష్‌ కృష్ణన్‌ వివరించారు.

బీమా పాలసీపై రుణం తీసుకోవడం ఎంతో సౌకర్యమైనదిగా పాలసీఎక్స్‌ సీఈవో నావల్‌ గోయల్‌ సైతం అంగీకరించారు. ‘‘దరఖాస్తు చేసుకోవడం ఎంతో సులభం. తక్కువ క్రెడిట్‌ స్కోర్‌ ఉన్న వారు సైతం పాలసీపై రుణానికి అర్హులే. ఎందుకంటే పాలసీపై రుణం జారీకి క్రెడిట్‌ స్కోర్‌ తనిఖీలు అవసరం పడవు’’అని కృష్ణన్‌ తెలిపారు. ఈ రుణం తిరిగి చెల్లింపు నిబంధనలు కూడా సులభమే.

 ‘‘రుణం చెల్లించడం వీలు కానప్పుడు కేవలం రుణంపై వడ్డీ వరకే చెల్లించొచ్చు. అసలు రుణాన్ని ఎప్పుడైనా తిరిగి తీర్చివేయవచ్చు’’అని ప్రుతి వివరించారు. ఎంత వీలైతే అంత అసలు రుణంలో చెల్లించుకుంటూ వెళ్లడం కూడా మంచి ఆలోచనే. దీనివల్ల ప్రతి నెలా చెల్లించే వడ్డీ భారాన్ని తగ్గించుకోవచ్చు.  

అత్యవసర నిధి 
బీమా పాలసీ అత్యవసర నిధిగానూ అక్కరకొస్తుంది. ప్రతి కుటుంబానికి విధిగా అత్యవసర నిధి ఉండాలి. అనుకోని పరిణామాలతో నెలవారీ వచ్చే ఆదాయం ఆగిపోతే? చేస్తున్న ఉద్యోగం ఊడిపోతే..? అక్కడి నుంచి తిరిగి ఉపాధి లభించేంత వరకు కుటుంబ అవసరాలను తీర్చేందుకు అత్యవసర నిధి ఉపయోగపడుతుంది. కనీసం ఆరు నెలల నుంచి ఏడాది అవసరాలను తీర్చేంత అత్యవసర నిధి ఏర్పాటు చేసుకోవాలని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. 

అయితే, ప్రతి ఒక్కరికీ ఇంత మొత్తం అత్యవసర నిధి కింద ఏర్పాటుకు వెసులుబాటు ఉండకపోవచ్చు. ఇలాంటి వారు ఎండోమెంట్‌ లేదా మనీబ్యాక్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలను అత్యవసర నిధి కింద ఉపయోగించుకోవచ్చు. తిరిగి ఉపాధి ఏర్పడి, ఆదాయం చేతికి అందేంత వరకు పాలసీపై రుణంతో అవసరాలను గట్టెక్కొచ్చు. ఆ తర్వాత క్రమంగా ఆరు నెలల్లోపు పాలసీపై రుణాన్ని తీర్చివేయడం మంచి ఆలోచన అవుతుంది.  

పాలసీ సరెండర్‌ అంటే? 
ఎండోమెంట్‌ లేదా మనీ బ్యాక్‌ బీమా ప్లాన్‌ వద్దనుకునే వారు దాన్ని సరెండర్‌ చేసుకోవచ్చు. అంటే గడువు ముగియకుండానే పాలసీని వెనక్కిచ్చేయడం. పాలసీ తీసుకున్న తర్వాత ఎంత కాలానికి సరెండర్‌ చేస్తున్నారనే దాని ఆధారంగా దానిపై ఎంతొస్తుందన్నది ఆధారపడి ఉంటుంది. ఈ సరెండర్‌ వ్యాల్యూ (స్వా«దీనపు విలువ) విషయంలో బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ (ఐఆర్‌డీఏఐ) 2024 ఏప్రిల్‌ 1 నుంచి నూతన నిబంధనలు తీసుకొచ్చింది.

 వీటి ప్రకారం బీమా పాలసీ తీసుకున్న మూడేళ్లలోపు సరెండర్‌ చేస్తే చేతికి చాలా తక్కువే వస్తుంది. అంటే అప్పటికి కట్టిన ప్రీమియంలో సగం కూడా రాదు. అదే పాలసీ తీసుకున్న తర్వాత నాలుగేళ్ల నుంచి ఏడేళ్లలోపు సరెండర్‌ చేస్తే అధిక విలువ పాలసీదారుకు దక్కుతుంది. 

నిజానికి ఎండోమెంట్, మనీబ్యాక్‌ పాలసీల్లో 20–30 ఏళ్లపాటు కొనసాగినప్పుడే ప్రతిఫలం కనిపిస్తుంది. ఇంతకంటే తక్కువ కాలవ్యవధిపై వచ్చే ప్రయోజనం అంతగా ఉండదు. అందుకని నిధుల అవసరం ఏర్పడితే బీమా ప్లాన్‌ను సరెండర్‌ చేయడానికి బదులు.. దానిపై రుణం పొందడమే మెరుగైనది అవుతుంది. మళ్లీ నిధుల వెసులుబాటు వచ్చిన వెంటనే తీసుకున్న రుణాన్ని తీర్చివేయాలి. 
 
ఆరంభంలో తక్కువే 
లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తీసుకున్న కొత్తలో దీనిపై వచ్చే రుణం చాలా స్వల్పం. ఇందులో ఉన్న ప్రతికూలత ఇదే. క్యాష్‌ వ్యాల్యూ లేదా సరెండర్‌ వ్యాల్యూ గణనీయంగా పెరిగేందుకు కొన్నేళ్లు పడుతుంది. అప్పుడే చెప్పుకోతగ్గ మేర రుణం దీనిపై వస్తుంది. ఇక ఎండోమెంట్‌ లేదా మనీ బ్యాంక్‌ పాలసీలపై దీర్ఘకాలంలో వచ్చే రాబడి 5–6 శాతం మేర ఉంటుంది. దీనిపై రుణం తీసుకుంటే, నికరంగా అందుకునే రాబడి ప్రయోజనం మరింత తగ్గిపోతుందని గుర్తు పెట్టుకోవాలి. 

తిరిగి చెల్లించలేకపోతే 
లైఫ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీలపై ఉన్న మరో అనుకూలత ఏమిటంటే.. రుణాన్ని తిరిగి చెల్లించడంలో విఫలమైనా అది క్రెడిట్‌ స్కోర్‌ను ప్రభావితం చేయబోదని కృష్ణన్‌ తెలిపారు. రుణంలో అసలు, వడ్డీ, చార్జీలు అన్నింటినీ పాలసీ సరెండర్‌ వ్యాల్యూ నుంచి బీమా సంస్థలు సర్దుబాటు చేసుకుంటాయని సహిల్‌ అరోరా తెలిపారు. రుణం చెల్లించకుండా పాలసీదారు మరణించిన సందర్భాల్లో.. పరిహారం నుంచి రుణం, వడ్డీ, చార్జీలను మినహాయించుకుని, మిగిలిన మొత్తాన్ని బీమా సంస్థ నామినీ లేదా పాలసీదారు వారసులకు చెల్లిస్తుంది. 

రుణం తీర్చకుండానే పాలసీ గడువు ముగిసిపోయిందనుకుంటే.. అప్పుడు నికరంగా చెల్లించే మొత్తం నుంచి రుణాన్ని బీమా సంస్థ వసూలు చేసుకుంటుంది. ఒకవేళ రుణంపై వడ్డీ కూడా బకాయి పడితే.. అసలు, వడ్డీ మొత్తం సరెండర్‌ వ్యాల్యూని దాటిపోతుంటే అప్పుడు పాలసీని బీమా సంస్థ రద్దు చేస్తుంది. పాలసీపై రుణం తీసుకునే సమయంలోనే దానిపై బీమా సంస్థకు హక్కులు బదలాయిస్తున్నట్టు అంగీకారాన్ని తీసుకుంటాయి.    

రుణం సమంజసమేనా..? 
అసలు జీవిత బీమా ఎందుకు? ఆర్జించే వ్యక్తికి దురదృష్టవశాత్తూ ఏదైనా వాటిల్లితే అప్పుడు అతనిపై ఆధారపడిన కుటుంబం ఆర్థికంగా కష్టాలు పడకూడదనే. తాను లేకపోయినా, తన కుటుంబ అవసరాలను తీర్చే లక్ష్యంతోనే లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీని తీసుకుంటుంటారు. మరి అలాంటి సాధనంపై రుణం తీసుకుంటే, అసలు ప్రయోజనానికే భంగం కలగొచ్చని నిపుణుల భావన. అదెలా అంటే పాలసీపై రుణం తీసుకున్న తర్వాత సదరు పాలసీదారు అనుకోకుండా మరణం పాలైతే.. కుటుంబానికి దక్కే బీమా పరిహారం పెద్దగా ఉండకపోవచ్చు. దాంతో బీమా ఉద్దేశ్యం నెరవేరకుండా పోతుంది. 

అందుకని బంగారం, మ్యూచువల్‌ ఫండ్స్, ప్రాపర్టీ తదితర ఇతర సాధనాలపై రుణం తీసుకోవడాన్ని పరిశీలించొచ్చని చెబుతుంటారు. కానీ, ఇక్కడ వాస్తవ అంశం ఏమిటంటే.. బంగారంపై రుణం తీసుకున్న తర్వాత సదరు వ్యక్తి మరణించినా కానీ, ఆ అప్పు తీర్చాల్సిన బాధ్యత కుటుంబంపైనే పడుతుంది. అందుకని ఏ సాధనంపై రుణం తీసుకున్నా పరిణామం ఒక్కటిగానే ఉంటుంది. అందుకుని దీనికి పరిష్కారం ఒకటి ఉంది. 

కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఏదైనా అవసరం కోసం రుణం తీసుకుంటుంటే, వెంటనే అంత విలువకు టర్మ్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీని పెంచుకోవడం లేదంటే అదనపు కవరేజీతో టర్మ్‌ ప్లాన్‌ కొనుగోలు చేయడం మంచిది. దీనివల్ల అనుకోనిది జరిగినా వచ్చే పరిహారంతో రుణాలను గట్టెక్కొచ్చు. ఇక దీర్ఘకాల అవసరాలకు కాకుండా స్వల్పకాల అవసరాలకే బీమాపై రుణానికి పరిమితం కావాలి. మూడు నుంచి ఆరు నెలలు మించకూడదు. 

ఎందుకంటే ఇంత తక్కువ కాలానికి చెల్లించాల్సిన వడ్డీ భారం కూడా చాలా తక్కువే ఉంటుంది. కనుక ఒకవేళ పాలసీదారు మరణించినా కుటుంబం పెద్దగా నష్టపోయేది ఉండదు. బీమా సంస్థ తనకు రావాల్సినంత మేర మినహాయించుకుని, మిగిలినది చెల్లించేస్తుంది. ఎండోమెంట్‌ ప్లాన్‌ ఉన్న వారు విధిగా మెరుగైన కవరేజీతో టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పాలసీ తప్పకుండా తీసుకోవాలి. అప్పుడు కుటుంబానికి మెరుగైన ఆర్థిక రక్షణ ఉంటుంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement