Mark Zuckerberg: Facebook Plans To Change Company Name - Sakshi
Sakshi News home page

Facebook: పేరు మార్చుకోనున్న ఫేస్‌బుక్‌? కారణాలు ఏంటంటే..

Published Wed, Oct 20 2021 12:53 PM | Last Updated on Thu, Oct 21 2021 2:15 PM

Facebook is planning to rebrand with new name to focus on metaverse - Sakshi

Facebook Name Change Says Verge: సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఫేస్‌బుక్‌ సంచలన నిర్ణయం తీసుకోనుందా? ఫేస్‌బుక్‌ పేరు మారబోతోందా? ప్రముఖ టెక్‌ బ్లాగ్‌ ది వెర్జ్‌ అవుననే అంటోంది. ఈ మేరకు ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ కీలక నిర్ణయం ప్రకటించబోతున్నాడంటూ తాజాగా తన వెబ్‌సైట్‌లో వెర్జ్‌ ఓ కథనం ప్రచురించింది. 


అక్టోబర్‌ 28న జరగబోయే కంపెనీ వార్షిక సమావేశంలో ఈ మేరకు ఫేస్‌బుక్‌ పేరు మార్చే అంశంపై జుకర్‌ బెర్గ్‌ స్పందించనున్నట్లు ది వెర్జ్‌ కథనం పేర్కొంది. ఒకవేళ అది జరిగినా.. ఇన్‌స్ట్రాగ్రామ్‌, వాట్సాప్‌, ఓకులస్‌లను తదితర ఫేస్‌బుక్‌ సంబంధిత సర్వీసులు మాత్రం పేరెంట్‌ కంపెనీ(ఫేస్‌బుక్‌ కంపెనీ) కిందనే నడుస్తాయి. మెటావర్స్‌ లాంటి భారీ ప్రాజెక్టు దిశగా పేస్‌బుక్‌ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పేరు మార్చడం ద్వారా రిఫ్రెష్‌నెస్‌ ఉంటుందని జుకర్‌బర్గ్‌ అండ్‌ కో భావిస్తున్నట్లు వెర్జ్‌ తన కథనంలో పేర్కొంది. 

అయితే కొత్త పేరు ఏంట‍న్న విషయంపై మాత్రం ఆ కథనం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఫేస్‌బుక్‌ కూడా ఈ పేరుమార్పు కథనంపై స్పందించేందుకు నిరాకరించడంతో .. ఇదొక రూమర్‌గానే భావించాల్సి ఉంటుంది.ఇక కంపెనీలు ఇలా పేర్లు మార్చుకోవడం కొత్తేం కాదు. అమెరికా టెక్‌ దిగ్గజం ఆల్ఫాబెట్‌ కంపెనీ(గూగుల్‌ పేరెంట్‌ కంపెనీ) నుంచి గూగుల్‌ ఇలాగే పేరు మార్చుకుని కొనసాగుతున్న విషయం తెలిసిందే.    

ఫేస్‌బుక్‌ అధినేత ఉక్కిరి బిక్కిరి

గత కొద్ది రోజులుగా వస్తున్న ఆరోపణులు  మార్క్‌ జుకర్‌ బెర్గ్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మాజీ ఎంప్లాయి ఫ్రానెస్స్‌ హాగెన్‌ ఆరోపణలు, అక్టోబర్‌ 4 రాత్రి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు అనుసంధానంగా ఉన్న వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ దాదాపు 7 గంటల పాటు స్తంభించిపోవడం, దీంతో అసౌకర్యానికి గురైన 2.7 బిలియన్ యూజర్లు ప్రత్యామ్నాయ సోషల్‌ నెట్‌ వర్క్‌లను వినియోగించుకునేందుకు మొగ్గు చూపడం, ఆ సర్వీసుల విఘాతం వల్ల  రూ.50 వేల కోట్ల నష్టం వాటిల్లడం, ఉద్యోగుల విషయంలో వివక్షతో పాటు ఫెడరల్‌ రిక్రూట్‌మెంట్‌ రూల్స్‌ను ఉల్లంఘించిందంటూ  ఫేస్‌బుక్‌ కు రూ.107 కోట్ల ఫైన్‌ విధించడం..ఆ ఫైన్‌ కట్టేందుకు జుకర్‌ బెర్గ్‌ ఒప్పుకోవడం, ఫేస్‌బుక్‌ సీఈఓగా మార్క్‌ జుకర్‌ బెర్గ్‌ రాజీనామా చేస్తున్నారంటూ బ్రిటన్‌కు చెందిన ఓ ప్రముఖ టాబ్లాయిడ్‌ సంచలన కథనాలు వెలుగులోకి రావడం జుకర్‌ బెర్గ్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

అందుకే ప్రస్తుతం ఈ విపత్తు నుంచి బయట పడేందుకు ఫేస్‌బుక్‌ పేరు మారిస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ జుకర్‌బెర్గ్‌ ఫేస్‌బుక్‌ బోర్డుతో సమాలోచనలు జరుపుతున్నట్లు ది వెర్జ్‌ తన కథనంలో పేర్కొంది. ఫేస్‌బుక్‌ పేరు మార్చడం వల్ల న్యాయపరమైన ఇబ్బందుల నుంచి బయటపడొచ్చనేది మరి కొందరి వాదన. అయితే ఫేస్‌బుక్‌ పేరు మారిస్తే..ఫేస్‌బుక్‌కు పెట్టబోయే కొత్త పేరేంటీ? పేరు మార్పును ఎప్పుడు ప్రకటిస్తారని అంశంపై కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.   

వాట్‌ నెక్ట్స్‌ 
ప్రస్తుతం సోషల్‌ మీడియా నెట్‌ వర్కింగ్‌ సైట‍్లతో బిజీగా ఉన్న జుకర్‌ బెర్గ్‌..భవిష‍్యత్‌ టెక్నాలజీ 'మెటావర్స్'ను డెవలప్‌ చేసే పనిలో ఉన్నారు. ఇందుకోసం యూరప్‌లో 10వేల మందిని నియమించుకోబోతున్నట్లు ప్రకటించారు. మెటావర్స్‌ అనేది వర్చువల్‌ రియాలిటీ స్పేస్‌. ఇటీవల ఫేస్‌బుక్, వర్క్‌ప్లేస్ అనే వర్చువల్ రియాల్టీ మీటింగ్స్ యాప్, హారిజన్స్ అనే సోషల్ స్పేస్‌తో ప్రయోగాలు చేస్తోంది. పనిచేసే ప్రదేశాల కోసమే కాకుండా, వాస్తవికతలో సంభాషించేందుకు అవసరమైన వర్చువల్ రియాలిటీ యాప్‌లను ఫేస్‌బుక్ రూపొందిస్తోంది. ఇందుకోసం 50 మిలియన్ డాలర్ల (సుమారు రూ.375 కోట్లు)ను ఫేస్‌బుక్ పెట్టుబడిగా కేటాయించింది. అయితే ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో వినియోగం రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందని టెక్‌ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

చదవండి: ఉద్యోగాల్లో వివక్ష.. భారీ మూల్యం చెల్లించనున్న ఫేస్‌బుక్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement