ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు డౌన్‌ | Equity mutual fund inflows experienced a 16. 4percent decline in April 2024 | Sakshi
Sakshi News home page

ఈక్విటీ ఫండ్స్‌లోకి పెట్టుబడులు డౌన్‌

Published Thu, May 16 2024 5:48 AM | Last Updated on Thu, May 16 2024 8:03 AM

Equity mutual fund inflows experienced a 16. 4percent decline in April 2024

ఏప్రిల్‌లో 16 శాతం క్షీణత; రూ. 18,917 కోట్లకు పరిమితం 

రూ. 20 వేల కోట్ల మార్కు దాటిన సిప్‌లు 

న్యూఢిల్లీ: ఎన్నికల ముందు మార్కెట్లలో ఒడిదుడుకులు పెరగడం, లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడుల ప్రవాహం తగ్గడం తదితర అంశాల కారణంగా ఏప్రిల్‌లో ఈక్విటీ మ్యుచువల్‌ ఫండ్స్‌లోకి ఇన్వెస్ట్‌మెంట్లు క్షీణించాయి. మార్చితో పోలిస్తే 16 శాతం తగ్గి రూ. 18,917 కోట్లకు పరిమితమయ్యాయి. ప్రవాహం కొంత తగ్గినప్పటికీ 2021 మార్చి నుంచి చూస్తే వరుసగా 38వ నెల కూడా ఈక్విటీ ఫండ్స్‌లోకి నికరంగా పెట్టుబడుల రాక కొనసాగినట్లు మ్యుచువల్‌ ఫండ్స్‌ అసోసియేషన్‌ (యాంఫీ) గణాంకాల్లో వెల్లడైంది. 

మరోవైపు, సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్ల (సిప్‌) రూపంలో పెట్టుబడులు ఏప్రిల్‌లో కీలకమైన రూ. 20,000 కోట్ల మార్కును దాటి ఆల్‌–టైమ్‌ గరిష్ట స్థాయి రూ. 20,371 కోట్లకు చేరాయి. అంతక్రితం నెలలో ఇవి రూ. 19,271 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం మీద మ్యుచువల్‌ ఫండ్‌ పరిశ్రమ నుంచి మార్చిలో రూ. 1.6 లక్షల కోట్ల పెట్టుబడుల ఉపసంహరణ జరగ్గా, ఏప్రిల్‌లో రూ. 2.4 లక్షల కోట్లు వచ్చాయి. డెట్‌ స్కీముల్లోకి అత్యధికంగా రూ. 1.9 లక్షల కోట్లు వచ్చాయి.  

యాంఫీ గణాంకాల్లో మరిన్ని విశేషాలు.. 
→ ఈక్విటీ, డెట్‌ కేటగిరీల్లోకి పెట్టుబడులు ప్రవా హం పటిష్టంగా ఉండటంతో నిర్వహణలోని ఆస్తుల పరిమాణం (ఏయూఎం) రూ. 57.26 లక్షల కోట్లకు పెరిగింది. మార్చి ఆఖరు నాటికి ఇది రూ. 53.54 లక్షల కోట్లుగా ఉంది.  
→ ఈక్విటీ ఆధారిత స్కీముల్లోకి ఏప్రిల్‌లో రూ. 18,917 కోట్లు వచ్చాయి. మార్చిలో ఇది రూ. 22,633 కోట్లుగా, ఫిబ్రవరిలో రూ. 26,866 కోట్లుగా నమోదైంది.  
→ గత నెల ఓపెన్‌ ఎండెడ్‌ స్కీముల విభాగంలో తొమ్మిది స్కీముల ద్వారా ఫండ్‌ సంస్థలు రూ. 1,532 కోట్లు సమీకరించాయి.  
→ లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడులు మార్చిలో రూ. 2,128 కోట్లు రాగా ఏప్రిల్‌లో ఏకంగా రూ. 357 కోట్లకు పడిపోయాయి. స్మాల్‌ క్యాప్‌ కేటగిరీలోకి రూ. 2,208 కోట్లు వచ్చాయి. అంతక్రితం నెలలో రూ. 94 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లను మదుపరులు వెనక్కి తీసుకున్నారు. సెక్టోరల్, థీమాటిక్‌ ఫండ్స్‌లోకి రూ. 5,166 కోట్లు, మలీ్ట–క్యాప్‌ కేటగిరీలోకి రూ. 2,724 కోట్లు వచ్చాయి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్‌ స్కీముల నుంచి రూ. 144 కోట్ల ఉపసంహరణ జరిగింది. 
→ హైబ్రిడ్‌ ఫండ్స్‌లోకి చెప్పకోతగ్గ స్థాయిలోకి రూ. 19,863 కోట్లు రాగా, డెట్‌ ఆధారిత స్కీముల విషయానికొస్తే లిక్విడ్‌ ఫండ్స్‌లోకి రూ. 1.02 లక్షల కోట్లు, మనీ మార్కెట్‌ ఫండ్స్‌లోకి రూ. 34,000 కోట్లు, ఓవర్‌నైట్‌ ఫండ్స్‌లోకి రూ. 21,000 కోట్లు వచ్చాయి.  
→ మ్యుచువల్‌ ఫండ్స్‌ ఫోలియోల సంఖ్య ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 18.14 కోట్లకు చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement