ఎలాన్‌ మస్క్‌ కొత్త ఎత్తుగడ! ఆదాయం కోసం ఎంత పని చేస్తున్నాడో తెలుసా? | Sakshi
Sakshi News home page

ఎలాన్‌ మస్క్‌ కొత్త ఎత్తుగడ! ఆదాయం కోసం ఎంత పని చేస్తున్నాడో తెలుసా?

Published Sat, Nov 4 2023 10:08 PM

elon musk x twitter selling unused accounts - Sakshi

ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ (గతంలో Twitter) అధినేత ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) కొత్త ఎత్తుగడ వేశాడు. ‘ఎక్స్‌’లో ప్రస్తుతం వాడుకలో లేని యూజర్‌ అకౌంట్లను (Handles) అమ్మి సొమ్ము చేసుకోవాలనుకున్నాడు. 

ప్రముఖ అంతర్జాతీయ వార్తా పత్రిక ‘ఫోర్బ్స్’కు లభించిన ఈమెయిల్‌ల ప్రకారం.. ‘ఎక్స్‌’ ఉపయోగంలో లేని యూజర్‌ హ్యాండిల్స్‌ను విక్రయించడానికి ఒక ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. వాటిలో కొన్నింటిని 50 వేల డాలర్లకు (సుమారు రూ.41.5 లక్షలు) విక్రయించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.

ఆ హ్యాండిల్స్‌ను రిజిస్టర్‌ చేసుకున్న యూజర్లతో మాట్లాడి వారి ఇనాక్టివ్‌ అకౌంట్‌ పేర్లను కొనుగోలు చేసేందుకు గానూ ‘హ్యాండిల్‌ టీమ్‌’ పేరుతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు, ప్రక్రియలు, రుసుములు వంటి వివరాలను ‘ఎక్స్‌’ తమకు ఈమెయిల్‌ చేసినట్లు వాటిని అందుకున్నవారు ధ్రువీకరించారు.

ముందే హింట్‌ ఇచ్చిన మస్క్‌
మస్క్‌ ఇలాంటిదేదో చేస్తాడని యూజర్లు ఎప్పటి నుంచో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. యూజర్లు గణనీయమైన సంఖ్యలో హ్యాండిల్స్ తీసుకోవడం గురించి గతంలోనే స్పందించిన ఎలాన్‌ మస్క్‌ "హ్యాండిల్ మార్కెట్‌ప్లేస్" అవకాశం గురించి అప్పట్లో ప్రస్తావించాడు. ఇక్కడ వినియోగదారులు తమ ఖాతాలను ఒకరికొకరు విక్రయించవచ్చు.

దీనికోసం ప్లాట్‌ఫామ్ రుసుము తీసుకుంటుందని తన ఆలోచనను పంచుకున్నారు. అయితే ఈ మార్కెట్ ఇప్పుడు పనిచేస్తుందో లేదో అన్నది అస్పష్టంగానే ఉంది. ఈ ట్విటర్‌ హ్యాండిల్స్ విక్రయం గురించి గతంలోనే ఆ సంస్థ ఉద్యోగుల్లో చర్చ జరిగినట్లు న్యూయార్క్ టైమ్స్ గత జనవరిలో ప్రచురించింది.

ఇదీ చదవండి: Starlink: సాధించాం.. పట్టరాని ఆనందంలో ఎలాన్‌ మస్క్‌!

Advertisement
 
Advertisement
 
Advertisement