ఆఫీస్‌కి రాకపోతే ఫైరింగే.. ప్రముఖ ఐటీ కంపెనీ వార్నింగ్‌! Come to office or you may get fired, Cognizant issues layoff warning to employees | Sakshi
Sakshi News home page

ఆఫీస్‌కి రాకపోతే ఫైరింగే.. ప్రముఖ ఐటీ కంపెనీ వార్నింగ్‌!

Published Fri, May 17 2024 8:38 AM | Last Updated on Fri, May 17 2024 9:59 AM

Come to office or you may get fired, Cognizant issues layoff warning to employees

ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్‌ (Cognizant) రిటర్న్-టు-ఆఫీస్ పాలసీకి సంబంధించి తమ ఉద్యోగులకు గట్టి హెచ్చరిక జారీ చేసింది. పదేపదే రిమైండర్‌లు చేసినప్పటికీ కార్యాలయానికి తిరిగి రావాలనే ఆదేశాన్ని విస్మరించేవారు తొలగింపు సహా తీవ్రమైన క్రమశిక్షణా చర్యలను ఎదుర్కోవలసి ఉంటుందని కంపెనీ స్పష్టం చేసిందని ‘లైవ్‌మింట్‌’ కథనం పేర్కొంది.

"నిర్దేశాలను పాటించడంలో వైఫల్యం కంపెనీ విధానాల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనకు దారితీస్తుందని దయచేసి గమనించండి. తదనుగుణంగా మీపై తగిన క్రమశిక్షణా చర్యలు ప్రారంభించడం జరుగుతుంది. ఇది తొలగింపునకు కూడా దారితీయవచ్చు" అని ఒక ఉద్యోగికి రాసిన లేఖలో కాగ్నెజెంట్‌ హెచ్చరించినట్లుగా నివేదిక పేర్కొంది.

ఇన్‌ ఆఫీస్‌ వర్క్‌ ప్రాముఖ్యతను కాగ్నిజెంట్ ఇంతకు ముందే పునరుద్ఘాటించింది. ఆఫీస్ పాలసీని పాటించడంలో వైఫల్యాన్ని కంపెనీ పాలసీల ప్రకారం తీవ్రమైన దుష్ప్రవర్తనగా పరిగణిస్తామని, ఇది టర్మినేషన్‌కు సైతం దారితీసే అవకాశం ఉందని ఏప్రిల్ 15 నాటి లేఖలో కాగ్నిజెంట్‌ స్పష్టం చేసింది.

భారత్‌లో కాగ్నిజెంట్ శ్రామిక శక్తి గణనీయంగా ఉంది. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం..  దాని 347,700 మంది ఉద్యోగులలో సుమారు 2,54,000 మంది భారత్‌లోనే ఉన్నారు. కంపెనీ అతిపెద్ద ఉద్యోగుల స్థావరం భారత్‌ అని దీనిని బట్టీ తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ రిటర్న్-టు-ఆఫీస్ విధానం భారత్‌లో ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇన్‌ ఆఫీస్‌ వర్క్‌ తప్పనిసరి ఆదేశాలు అనేక కారణాల నుంచి వచ్చాయి. ఆవిష్కరణలు, జట్టు కృషి, బలమైన సంస్థాగత సంస్కృతిని వ్యక్తిగత సహకారం ప్రోత్సహిస్తుందని కంపెనీలు విశ్వసిస్తున్నాయి. అంతేకాకుండా, ప్రత్యేకించి సెన్సిటివ్ డేటా, కాంప్లెక్స్ ప్రాజెక్ట్‌లను నిర్వహించే పరిశ్రమలలో కార్యాచరణ, భద్రతాపరమైన అంశాలు కూడా కారణంగా ఉన్నాయి.

టీసీఎస్‌ (TCS), ఇన్ఫోసిస్‌ (Infosys), విప్రో (Wipro) వంటి కంపెనీలు కూడా గతంలో రిటర్న్-టు-ఆఫీస్ విధానాన్ని తప్పనిసరి చేశాయి. అయితే, కొన్ని కంపెనీలు రిమోట్ పని సౌలభ్యానికి అలవాటుపడిన కొంతమంది ఉద్యోగుల నుంచి ప్రతిఘటనను ఎదుర్కొన్నాయి. చాలా మంది ఉద్యోగులు రిమోట్ వర్క్‌ మెరుగైన పని-జీవిత సమతుల్యతను అందిస్తుందని, ప్రయాణ ఒత్తిడిని తగ్గిస్తుందని వాదించారు. అయితే కాగ్నిజెంట్ వంటి కంపెనీలు ఈ ఉద్యోగుల ప్రాధాన్యతలను వ్యాపార అవసరాలు, కార్యాచరణ సామర్థ్యాలతో సమతుల్యం చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement