డ్రాగన్‌మార్ట్‌కు పోటీగా ‘భారత్‌మార్ట్‌’.. ఎక్కడో తెలుసా.. Bharatmart To Compete Dragonmart In Dubai | Sakshi
Sakshi News home page

డ్రాగన్‌మార్ట్‌కు పోటీగా ‘భారత్‌మార్ట్‌’.. ఎక్కడో తెలుసా..

Published Thu, Feb 15 2024 12:45 PM | Last Updated on Thu, Feb 15 2024 1:08 PM

Bharatmart To Compete Dragonmart In Dubai - Sakshi

భారతప్రధాని మోదీ దుబాయ్ పర్యటనలో భాగంగా ‘భారత్‌ మార్ట్‌’కు శంకుస్థాపన చేశారు. యూఏఈ ప్రధాని షేక్‌ మహమ్మద్‌ బిన్‌ రషీద్‌ అల్‌ మక్తూమ్‌తో కలిసి మోదీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దుబాయ్‌లోని జెబెల్ అలీ ఫ్రీ ట్రేడ్ జోన్‌లో రిటైల్, వేర్‌హౌసింగ్, లాజిస్టిక్స్ సౌకర్యాలను అందించేలా ఈ మార్ట్‌ను ఏర్పాటు చేయనున్నారు.

భారత్ మార్ట్ దుబాయ్‌కు చెందిన లాజిస్టిక్స్, పోర్ట్ టెర్మినల్ కార్యకలాపాలు, మెరిటైమ్‌ సేవలను అందిస్తున్న డీపీ వరల్డ్‌తో కలిసి రూపొందించనున్నారు. భారత్‌లోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు తయారుచేస్తున్న ఉత్పత్తుల ఎగుమతులకు ఈ మార్ట్‌ ఎంతో ఉపయోగపడుతుందని తెలిసింది. దాదాపు 1,00,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయబోయే ఈ మార్ట్‌ 2025 వరకు కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు సమాచారం. 

చైనాకు పోటీగా..

ప్రధానంగా ఈమార్ట్‌ వల్ల దుబాయ్‌తోపాటు దగ్గర్లోని ఇతర దేశాలకు త్వరగా సరుకులు రవాణాచేసేలా వీలవుతుంది. దాంతో సమయం, రవాణా ఖర్చులు తగ్గి ప్రపంచంలోని ఇతర దేశాలకు భారత ఉత్పత్తుల ఎగుమతులు పెంచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. గల్ఫ్, పశ్చిమాసియా, ఆఫ్రికా, యురేషియాలోని అంతర్జాతీయ కొనుగోలుదారులకు ఇది వేదికగా మారనుంది. దుబాయ్‌లో నెలకొల్పనున్న భారత్ మార్ట్ చైనాకు చెందిన డ్రాగన్ మార్ట్‌తో పోటీపడనుంది. డ్రాగన్ మార్ట్‌లాగా భారత్ మార్ట్ కూడా దుబాయ్‌లో అనేక ఉత్పత్తులను విక్రయించనుంది.

పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు..

మహ్మద్ బిన్ రషీద్‌తో మోదీ ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, సాంకేతికత, అంతరిక్షం, విద్య, ప్రజల మధ్య సంబంధాలతో సహా అనేక రంగాలలో సహకారంపై చర్చించారు. భారత్‌, యుఏఈ మధ్య పెరుగుతున్న ఆర్థిక, వాణిజ్య సంబంధాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: కొత్తప్లాన్‌తో భారత్‌లోకి టెస్లా.. ప్రయత్నం ఫలిస్తుందా..?

ఈ నేపథ్యంలో 2022లో ఇరు దేశాలు కుదుర్చుకున్న సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ప్రాధాన్యాన్ని గుర్తించి ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు చేశారు. దుబాయ్‌లో పనిచేస్తున్న భారతీయ కార్మికులకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందించేలా ప్రత్యేక కమ్యూనిటీ హాస్పిటల్ కోసం భూమిని కేటాయించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement