ఎక్కడ చదివామన్నది కాదు..! జాబ్‌ వచ్చిందా? రాలేదా? | 36 Percent Of IIT Bombay Graduates Fail To Get Placement | Sakshi
Sakshi News home page

టాప్‌ సంస్థల్లో చదివినా కానరాని ఉద్యోగాలు..

Published Sat, Apr 6 2024 3:21 PM | Last Updated on Sun, Apr 7 2024 4:57 PM

36 Percent Of IIT Bombay Graduates Fail To Get Placement - Sakshi

అహర్నిశలు కష్టపడి, పోటీ పరీక్షల్లో నెగ్గి ఐఐటీ, ఐఐఎం, కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఎలాగోలా సీటు సంపాదిస్తున్నారు. ఇకేముంది ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో సీటు వచ్చింది కదా.. కొలువు గ్యారెంటీ అనుకుంటున్నారేమో. కాలం మారింది. కంపెనీల తీరు మారింది. ప్రముఖ సంస్థలు ఉద్యోగార్థుల్లో చూసే క్వాలిటీ మారింది. దాంతో ఎంతపెద్ద విద్యాసంస్థలో టాప్‌ ర్యాంకుతో డిగ్రీ పూర్తి చేసినా కొన్నిసార్లు కొలువు దొరకని పరిస్థితులు నెలకొంటున్నాయి. దేశవ్యాప్తంగా ఐఐటీ సంస్థల్లో ఐఐటీ-ముంబయికి ఉన్న ప్రాధాన్యం తెలిసిందే కదా. అయితే ఆ సంస్థలోని 36 శాతం గ్రాడ్యుయేట్లు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌ల్లో కొలువు సాధించలేకపోయారు. గతంలోనూ ఐఐఎం సంస్థల్లోని విద్యార్థులు కూడా కొలువులు రాక ఇతర మార్గాలను ఎంచుకున్నట్లు నివేదికలు వెల్లడయ్యాయి. దాంతో తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎక్కడ చదివామని కాకుండా.. ఏం చదివామనే దానిపై దృష్టిసారించాలని నిపుణులు చెబుతున్నారు. 

పదేళ్ల క్రితం కంపెనీలు ప్రధానంగా మూలధన పెట్టుబడివైపు ఆసక్తి కనబరిచేవి. నిజానికి ఆ సమయంలో సంస్థలు ఆశించిన మేరకు అభివృద్ధి చెందాయి. ఇటీవల నెలకొన్న అంతర్జాతీయ పరిస్థితులు, బౌగోళిక అనిశ్చితులు, ఖర్చులు తగ్గించుకోవడం, ఉన్నంతలో ఏయే విభాగాల్లో మరింత జాగ్రత్తగా వ్యవహరించవచ్చో తెలుసుకుని చర్యలు తీసుకుంటున్నారు. ఉత్పత్తి ఆధారిత కంపెనీలు ప్రధానంగా మిషనరీ, మార్కెటింగ్‌ కోసం ఖర్చు చేస్తాయి. అయితే ఐటీ కంపెనీలకు మాత్రం వేతనాల రూపంలో తమ ఉద్యోగులపైనే భారీగా పెట్టుబడి పెడుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కాస్ట్‌కటింగ్‌ పేరిట ఐటీ కంపెనీలు ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. దాంతో చాలా మంది టెకీలు ఆందోళన చెందుతున్నారు. 

కంపెనీలు అత్యవసరమైతే తప్పా కొత్త నియామకాలు చేపట్టడం లేదు. ఒకవేళ రిక్రూట్‌మెంట్‌ చేసినా టాప్‌ ఇన్‌స్టిట్యూట్ల నుంచే కొలువులు భర్తీ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఐఐటీ, ఐఐఎంల్లో చదివినా కంపెనీ అవసరాలకు తగిన నైపుణ్యాలు లేవని సంస్థలు గ్రహిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వారిని పక్కనపెట్టేస్తున్నాయి. పైగా ఐఐటీ, ఐఐఎంలో చదివిన వారు అధిక వేతనాలు ఆశిస్తున్నారు. ఇదికూడా ఒకింత ఉద్యోగాలు రాకపోవడానికి కారణం అవుతోంది. దాంతో ప్రముఖ సంస్థల్లో చదివినా ఉద్యోగాలు రాని పరిస్థితులు ఏర్పడుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఐఐటీ ముంబయిలో తాజాగా 2000 మంది విద్యార్థులు ఇంటర్వ్యూలకు హాజరైతే 712 మందికి ఉద్యోగాలు రాని పరిస్థితి నెలకొంది. డిసెంబర్‌ 2023లో 85 మంది ఐఐటీ బాంబే విద్యార్థులకు రూ.కోటికి పైగా జీతాలతో ఉద్యోగాలు వచ్చినట్లు ముందుగా ప్రకటించారు. కానీ దాన్ని సవరించి కేవలం 22 మందికే ఈ వేతనం వరిస్తుందని కంపెనీలు చెప్పడం గమనార్హం. 

ఐఐఎంల్లోనూ అదే తీరు..

ఐఐఎం విద్యార్థులను కంపెనీలు ప్రధానంగా మేనేజ్‌మెంట్‌ స్థాయిలో ట్రెయినీలుగా నియమించుకుంటాయి. ప్రస్తుత అనిశ్చితుల గరిష్ఠ వేతనాలు కలిగిన టాప్‌ మేనేజ్‌మెంట్‌  ఉద్యోగులను తొలగిస్తున్నాయి. దాంతో కొత్త వారికి అవకాశం కల్పించే దిశగా కంపెనీలు ఆలోచించడం లేదనే వాదనలున్నాయి. ఒకవేళ కొన్ని కంపెనీలు తమ అవసరాల కొద్దీ ఉద్యోగాలు కల్పించినా దాదాపు 10-15 శాతం వేతనాలు తగ్గించి ఆఫర్‌ లేటర్లు విడుదల చేస్తున్నట్లు తెలిసింది. ఐఐఎంలో చదివి కొన్నేళ్లు ఉద్యోగం చేసి కొత్తగా బిజినెస్‌ ప్రారంభించాలనుకునే వారిపై వెంచర్‌ క్యాపిటలిస్ట్‌లు ఆసక్తి చూపుతారు. ప్రస్తుత పరిస్థితుల వల్ల ఆ ఊసే లేకుండాపోయిందని నిపుణులు చెబుతున్నారు. కనీసం రిటైల్‌ కంపెనీలు, స్టార్టప్‌ కంపెనీల్లో సైతం ఉద్యోగాలు దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. 

ఇదీ చదవండి: క్రియేటివిటీ పేరుతో అరాచకం..!

భారత్‌లో నిరక్షరాస్యత, అరకొర పారిశ్రామికోత్పత్తి, నాసిరకం నైపుణ్యాలు తదితరాలు నిరుద్యోగానికి కారణాలుగా నిలుస్తున్నాయి. భారత్‌, చైనా వంటి దేశాలు తమ యువతకు సరైన ఉపాధి కల్పిస్తే ప్రపంచ జీడీపీ ఒక్కపెట్టున విజృంభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు కాలంతో పాటు సాంకేతికతలూ మారుతున్నాయి. వర్చువల్‌, ఆగ్మెంటెడ్‌ రియాలిటీలతో వృత్తి శిక్షణ ఇస్తే కొత్త తరం ఉద్యోగాలకు కావాల్సిన సిబ్బంది తయారవుతారు. అధునాతన సాంకేతికతల వినియోగం, ఇంక్యుబేషన్‌ విధానాన్ని ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement