Aadudam Andhra: క్రీడాకారుల కోసం రూ.41.43 కోట్ల విలువైన 5 లక్షల స్పోర్ట్స్‌ కిట్లు | 5 lakh sports kits worth Rs 41 crore for Aadudam Andhra players | Sakshi
Sakshi News home page

Aadudam Andhra: ఆటకు సిద్ధం.. క్రీడాకారుల కోసం రూ.41.43 కోట్ల విలువైన 5 లక్షల స్పోర్ట్స్‌ కిట్లు

Published Sun, Dec 3 2023 5:06 AM | Last Updated on Tue, Dec 5 2023 4:35 PM

5 lakh sports kits worth Rs 41 crore for Aadudam Andhra players - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రమంతటా ‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీల సందడి నెలకొంది. క్రీడాకారుల రిజిస్ట్రేషన్‌తో పాటు క్రీడా పరికరాల పంపిణీ ఊ­పం­­దుకుంది. సుమారు 50 రోజుల పాటు నిర్వి­రా­మంగా సాగే ఈ అతిపెద్ద మెగా టోర్నీ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.41.43 కోట్ల విలువైన దాదాపు 5.09 లక్షల స్పోర్ట్స్‌ కిట్లను సిద్ధం చేసింది.

ఇప్పటికే వీటిని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ(డీఎస్‌ఏ)లకు తరలించింది. డిసెంబర్‌ తొలివారం నాటికి గ్రామ, వార్డు సచివాలయాలకు ఈ కిట్లను అందించేలా ప్ర­త్యేక దృష్టి సారించింది. వీటితో పాటు గ్రామ, వా­ర్డు సచివాలయాల పరిధిలో విజేతలకు ‘ఆడుదాం ఆంధ్ర’ లోగోతో టీషర్టు, టోపీని ఇవ్వనున్నారు.

కిట్ల నాణ్యత పక్కాగా పరిశీలన..
ప్రతి గ్రామ, వార్డు సచివాలయానికి మూడు వాలీబాల్‌లు, నెట్, మూడు బ్యాడ్మింటన్‌ రాకెట్లు, షటిల్స్, మూడు బేసిక్‌ క్రికెట్‌ కిట్లు, రెండు టెన్నీకాయిట్‌ రింగ్‌లను ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఇక నియోజకవర్గ పోటీల్లో భాగంగా ఖోఖో, కబడ్డీ క్రీడాకారులకు యాంక్లెట్స్, నీక్యాప్స్‌ అందిస్తోంది. మండల స్థాయిలో ఆరు వాలీబాల్‌లు, రెండు ప్రొఫెషనల్‌ క్రికెట్‌ కిట్లను సమకూరుస్తోంది. వీటితో పాటు 6 వేల ట్రోఫీలు, 84 వేల పతకాలు, సర్టిఫికెట్లు ప్రదానం చేయనుంది.

క్రీడా పరికరాల తయారీలో మంచి పేరున్న సంస్థల నుంచి టెండర్లను ఆహ్వానించి స్పోర్ట్స్‌ కిట్లను కొనుగోలు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థకు చెందిన అధికారులు, కోచ్‌లు స్వయంగా స్పోర్ట్స్‌ కిట్ల తయారీ పరిశ్రమలకు వెళ్లి వాటి నాణ్యతను పరి­శీలించారు. ఆయా సంస్థలు జిల్లా క్రీడా ప్రాధి­కార సంస్థలకు సరఫరా చేసిన పరికరాలను ప్రత్యేక కమిటీ ద్వారా మరోసారి పరిశీలించిన తర్వాతే క్షేత్రస్థాయికి తరలిస్తున్నారు. 

వెలుగులోకి ప్రతిభావంతులు
‘ఆడుదాం ఆంధ్ర’ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభ కలిగిన క్రీడాకారులు వెలుగులోకి వస్తారు. ప్రతి క్రీడాకారుడు పోటీల కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. క్రీడాకారులకు అవసరమైన స్పోర్ట్స్‌ కిట్లను ప్రభుత్వమే సమకూరుస్తోంది. జిల్లా క్రీడాప్రాధికార సంస్థలకు చేరిన కిట్లను మరోసారి పరిశీలించి క్షేత్రస్థాయికి వేగంగా పంపించేలా ఆదేశించాం. ఈ మెగా టోర్నీని ప్రజలందరూ వీక్షించేలా ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు వీలుగా వెబ్‌సైట్‌ను, సిబ్బందిని సమకూర్చేందుకు ప్రయత్నిస్తున్నాం. – ధ్యాన్‌చంద్ర, ఎండీ, ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ .

ప్రత్యక్ష ప్రసారానికి సన్నాహాలు
‘ఆడుదాం ఆంధ్ర’ క్రీడా పోటీలను ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ క్రీడా ప్రాధికార సంస్థ సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో వెబ్‌సైట్‌ను రూపొందించింది.

ఇందులో గ్రామ, వార్డు సచివాలయాల్లో జరిగే మ్యాచ్‌ల వివరాలు, స్కోర్‌ను ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు అప్‌లోడ్‌ చేయనుంది. దీనికోసం గ్రామ, వార్డు సచివాలయాల నుంచి 10 మంది చొప్పున వలంటీర్లను ఎంపిక చేసి ప్రత్యేక శిక్షణ ఇస్తోంది. నియోజకవర్గస్థాయి పోటీలను యూట్యూబ్‌ చానెల్‌ ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేసేలా ప్రణాళికలు రచిస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement