నా వయసు చిన్నదే.. మళ్లీ అధికారంలోకి వస్తాం: వైఎస్‌ జగన్‌ | YS Jagan Meeting With YSRCP Lok Sabha Rajya Sabha MPs On June 14 Updates | Sakshi
Sakshi News home page

నా వయసు చిన్నదే.. మళ్లీ అధికారంలోకి వస్తాం: YSRCP ఎంపీలతో వైఎస్‌ జగన్‌

Published Fri, Jun 14 2024 8:39 AM | Last Updated on Fri, Jun 14 2024 2:06 PM

YS Jagan Meeting With YSRCP Lok Sabha Rajya Sabha MPs June 14 Updates

గుంటూరు, సాక్షి: వైఎస్సార్‌సీపీ పరిపాలనను, ఇప్పుడు చంద్రబాబు పరిపాలనను ప్రజలు గమనిస్తూనే ఉంటారు. కచ్చితంగా మనం తిరిగి ప్రజల విశ్వాసాన్ని పొందగలుగుతామనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయని అన్నారు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఈలోగా ధైర్యాన్ని కోల్పోకూడదని, విలువలు, విశ్వసనీయతతో ముందడుగులు వేయాలని పార్టీ ఎంపీలకు ఆయన ధైర్యం చెప్పారు.

వైఎస్సార్‌సీపీ ఎంపీలతో వైఎస్‌ జగన్‌.. ‘‘గడచిన ఐదేళ్లలో ఎప్పుడూ చేయలేని విధంగా మంచి పరిపాలన అందించాం. మేనిఫెస్టోలో 99శాతం హామీలు అమలు చేశాం. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడూ ఇలా ఎవ్వరూ చేయలేదు. చాలా చిత్తశుద్ధితో పనిచేసి, మేనిఫెస్టోను అమలు చేశాం. ఏ నెలలో ఏం ఇవ్వబోతున్నామో క్యాలెండర్ ప్రకటించి మరీ అమలు చేశాం. ప్రపంచాన్ని, ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసిన కోవిడ్ లాంటి సంక్షోభాలు ఉన్నప్పటికీ, ఆ సవాళ్లను అధిగమించి ప్రజలకు మంచి చేశాం.

.. విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం తదితర రంగాల్లో ఎప్పుడూ చూడని సంస్కరణలు తీసుకొచ్చాం. ప్రజల ఇంటివద్దకే పరిపాలనను తీసుకెళ్లాం.  అవినీతికి చోటులేకుండా, వివక్ష చూపకుండా అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశాం. ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు అందించాం. విద్యారంగంలో మనం తీసుకొచ్చిన సంస్కరణలతో పేదరిక నిర్మూనలదిశగా అడుగులు వేశాం. 

.. భవిష్యత్తు తరాలను ప్రపంచస్థాయిలో నిలబెట్టేందుకు ఇంగ్లిషు మీడియం, టోఫెల్, ఆరో తరగతి నుంచి డిజిటల్ టీవీలు, ఎనిమిదో తరగతి నుంచి ట్యాబులు అందించాం. ఐబీ సిలబస్‌ని కూడా తీసుకు వచ్చాం. ప్రఖ్యాత యూనివర్శిటీల కోర్సులను విద్యార్థులకు అందించాం. నాణ్యమైన విద్యాను శాశ్వతంగా అందించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించేదిశగా ఐదేళ్లలో అడుగులు వేశాం. 

.. సోషల్ ఇంజినీరింగ్‌లో భాగంగా ఎప్పుడూ చూడవిధంగా వివిధ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అవకాశాలు కల్పించాం. ఇన్ని గణనీయమైన మార్పులు తీసుకువచ్చినప్పటికీ ఎన్నికల ఫలితాలు ఇలా వచ్చాయంటే చాలా ఆశ్చర్యమేస్తోంది. శకుని పాచికలు మాదిరిగా ఈ ఎన్నికలు ఫలితాలు వచ్చాయనిపిస్తోంది. ఏం జరిగిందో దేవుడికే తెలియాలి’’ అని అన్నారారయన.

వైఎస్సార్‌సీపీ ఎంపీలతో వైఎస్‌ జగన్‌..  ‘‘ల్యాండ్ టైట్‌లింగ్‌ యాక్ట్‌ను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చింది. దీనికి అనుగుణంగా రాష్ట్రంలోకూడా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు అసెంబ్లీ సాక్షిగా టీడీపీ మద్దతు పలికింది. అమెరికా, యూరప్ దేశాల్లో అనుసరిస్తున్న మంచి విధానాలన్నీ ఇందులో ఉన్నాయని సభ సాక్షిగా ప్రశంసలు కురిపించింది. కానీ, సరిగ్గా ఎన్నికల సమయంలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్‌ను ఒక భూతంలా చూపి… టీడీపీ, కూటమి పార్టీలు విషప్రచారం చేశాయి. నిజంగా ఈ చట్టాన్ని తీసుకురావాలంటే.. అంత సులభమైన విషయం కాదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15 వేలమంది సర్వేయర్లను నియమించడం వల్లే సాధ్యపడే పరిస్థితులు వచ్చాయి. భూమి కొనాలన్నా, అమ్మాలన్నా.. మోసాలకు ఎలాంటి ఆస్కారం లేని పరిస్థితులు ఈ చట్టంవల్ల వస్తాయి. చరిత్రలో తొలిసారిగా భూ పత్రాలకు ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తుంది.  ఈ పత్రాల విషయంలో తప్పులు జరిగితే… సదరు వ్యక్తికి ప్రభుత్వమే పరిహారం ఇస్తుంది. టీడీపీ వాళ్లు మద్దతు పలికిన చట్టాన్ని ఇప్పుడు వాళ్లే తీసేస్తామంటున్నారు. వారి చేస్తున్న రాజకీయాలు ఎలా ఉంటాయో దీనిబట్టే తెలుస్తుంది.

.. వైఎస్సార్సీపీని నమ్మకుని కొన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి. కొన్ని లక్షలమంది కార్యకర్తలు ఈ పార్టీపై ఆధారపడి ఉన్నారు. కొన్ని వేలమంది నాయకులు పార్టీలో ఉన్నారు. అనుకున్న లక్ష్యాల దిశగా పార్టీ ముందుకు కొనసాగాల్సిన అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో మనకు 40శాతం ఓట్లు వచ్చాయి. గడచిన ఎన్నికలతో పోలిస్తే 10 శాతం ఓట్లు తగ్గాయి. రానున్న రోజుల్లో ఈ 10శాతం ప్రజలే… మన పాలనకు, ఇప్పటి ప్రభుత్వం పాలనకు తేడాను గుర్తిస్తారనే నమ్మకం, విశ్వాసం ఉన్నాయి.  ప్రతి ఇంట్లోకూడా మన ప్రభుత్వం చేసిన మంచి ఉంది. ఎట్టి పరిస్థితుల్లో మనలో ధైర్యం సన్నగిల్లకూడదు. 
మనలో పోరాటపటిమ తగ్గకూడదు.

.. నా వయసు చిన్నదే. నాలో సత్తువ ఇంకా తగ్గలేదు.  14 నెలలు పాదయాత్ర చేశాను. దేవుడుదయ వల్ల అన్నిరకాల పోరాటాలు చేసే శక్తి కూడా ఉంది. ప్రజలు మళ్లీ మనల్ని అధికారంలోకి తీసుకు వస్తారనే నమ్మకం, విశ్వాసం నాకు ఉన్నాయి’’ అని వైఎస్‌ జగన్‌ ధీమా వ్యక్తం చేశారు.

‘‘పార్లమెంటులో మనకు 11 మంది రాజ్యసభ సభ్యులు, 4గురు లోక్‌సభ సభ్యులు ఉన్నారు. మొత్తంగా 15 మంది ఎంపీలు మన పార్టీకి ఉన్నారు. టీడీపీకి 16 మంది ఉన్నారు. అందువల్ల మన పార్టీకూడా చాలా బలమైనదే. మనల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు.  మనం ధైర్యంగా ఉండి ప్రజల తరఫున పోరాటంచేయాలి. 2019-24 మధ్య ప్రభుత్వం ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు మన పరిపాలనాకాలం ముగిసిందో తెలియదు. ఈసారికూడా అంతే. ఐదేళ్లు ఇట్టే గడిచిపోతాయి..

.. పార్లమెంటులో వ్యవహరించేటప్పుడు ప్రజాహితమే ధ్యేయం కావాలి. రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంశాలవారీగానే మద్దతు ఉంటుంది. ఎవరికైనాగాని, అంశాలవారీగానే మద్దతు ఉంటుంది.  పార్టీ విధివిధానాల ప్రకారం ఎంపీలు ముందుకు సాగాలి. ప్రజలముందు తలెత్తుకునేలా పార్లమెంటులో ఎంపీలు ముందుకుసాగాలి. రాజకీయంగా ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు తాత్కాలికం.

YSRCP పార్లమెంటరీ నేతగా వైవీ సుబ్బారెడ్డి
పార్టీ తరఫున పార్లమెంటరీ నేతగా వైవీ సుబ్బారెడ్డి(రాజ్యసభ ఎంపీ) ఎన్నుకుంటున్నట్లు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. శుక్రవారం ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ‘‘రాజ్యసభలో పార్టీ నాయకుడిగా విజయసాయిరెడ్డి కొనసాగుతారు. లోక్‌సభలో పార్టీ నాయకుడిగా మిథన్ రెడ్డి వ్యవహరిస్తారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా వై.వి.సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తారు’’ అని వైఎస్‌ జగన్‌ తెలిపారు. 

‘‘అందరికీ నేను అందుబాటులో ఉంటాను. ఎంపీలంతా కలిసి కూర్చుని చర్చించుకుని ఆ మేరకు అడుగులు ముందుకేయాలి. పార్టీపరంగా వ్యవహరించాల్సిన అంశాలను పరస్పరం చర్చించుకుని, నిర్ణయాలు తీసుకోండి. ఎంపీలుగా మీరు వేసే ప్రతి అడుగూ పార్టీ ప్రతిష్టను పెంచేదిగా ఉండాలి.
మన పార్టీకి ఒక సిద్ధాంతం, గుర్తింపు ఉన్నాయి. పార్టీకోసం మీరు కష్టపడండి. పార్టీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది అని ఎంపీలకు జగన్‌ దిశానిర్దేశం చేశారు.

 

ఇదీ చదవండి: నిబ్బరంతో నిలబడదాం.. భవిత మనదే: వైఎస్‌ జగన్‌

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement