The Wire Sensational Article On CBI Investigation In Viveka Murder Case - Sakshi
Sakshi News home page

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై ‘ది వైర్‌’ సంచలన కథనం

Published Sat, Jul 22 2023 5:25 PM | Last Updated on Sun, Jul 23 2023 12:05 PM

The Wire Sensational Article On Cbi Investigation In Viveka Murder Case - Sakshi

వివేకా హత్య కేసులో సీబీఐ విచారణపై ‘ది వైర్‌’ సంచలన కథనం ప్రచురించింది. వివేకా హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన తుది చార్జీషీటు తప్పల తడక అంటూ విశ్లేషించింది. కేవలం ఇద్దరు వ్యక్తుల వాంగ్మూలంతో సీబీఐ వివేకా హత్యకు సంబంధించి విచారణ ముగించిందని సీబీఐ చార్జిషీటులో అసంబద్ధమైన వ్యాఖ్యానాలు తప్ప అసలు ఆధారాలు లేవని ది వైర్ కథనం స్పష్టం చేసింది.

వివేకా మర్డర్ కేసును ఏళ్ల తరబడి విచారించిన సీబీఐ ఏకంగా ముగ్గురు విచారణాధికారులను నియమించింది. తొలి చార్జిషీటు దాఖలు చేసేందుకు ఏకంగా 474 రోజులు తీసుకుంది. ఇక ఈ నెల 20న వచ్చిన తుదిచార్జీ షీట్‌లో సీబీఐ కేవలం అసంబద్ధమైన కథనాలను వండివార్చిందని ది వైర్ ఏకిపారేసింది.

వివేకా హత్యకు ప్రధాన కారణం కడప ఎంపీ సీటుపై వచ్చిన విభేదాలే అని సీబీఐ చార్జీషీటులో పేర్కొంది. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయినా వైఎస్ వివేకా రాజకీయంగా చాలా యాక్టివ్‌గా ఉన్నారని ఛార్జ్‌షీట్‌లో సీబీఐ చెప్పింది. ఇక  కడప ఎంపీ టిక్కెట్ తనకు కానీ,  వైఎస్ షర్మిలకు కానీ, వైఎస్ విజయమ్మకు ఇవ్వాలని వైఎస్ వివేకా కోరుకున్నారనేది సీబీఐ థియరీ.
చదవండి: వివేకా కేసు దర్యాప్తులో సీబీఐ హ్యాండ్సప్‌!

ఇంకా వైఎస్ అవినాష్ రెడ్డి కడప ఎంపీ స్థానానికి బలహీనమైన అభ్యర్థి అని వివేకా వాదించనట్లు.. అందుకే అవినాష్‌రెడ్డికి కడప ఎంపీ టిక్కెట్ ఇవ్వకూడదని జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థిగా పంపాలని వివేకా చెప్పేవారని తన చార్జిషీటులో సీబీఐ కథనం అల్లింది. అయితే ఈ కథనానికి ఎక్కడా ఆధారం చూపలేకపోయింది. పైగా సీబీఐ చార్జిషీటులోనే ఈవాదనను వ్యతిరేకిస్తూం ఎన్నో అంశాలున్నాయి.

కడప సీటుకు సంబంధించి హత్య జరిగిందని సీబీఐ చెప్తున్న మాటలకు చాలా వైరుధ్యాలున్నాయి.ఇందులో వివేకా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారని సీబీఐ చెప్పిన మాటలు పూర్తి వాస్తవ విరుద్ధం. నిజానికి 2004 తర్వాత  వివేకా ఏ ఎన్నికల్లోనూ గెలవలేదు. అసలు తన తండ్రి రాజకీయాల్లోకి రిటైర్ అయ్యారని వివేకా కుమార్తె నర్రెడ్డి సునీతా రెడ్డి సీబీఐ వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పింది. 2011 లో వైఎస్ విజయమ్మ చేతిలో ఓటమి తర్వాత మా నాన్న రాజకీయాలకు దూరంగా ఉన్నారని సునీత సీబీఐకి చెప్పింది. దీనిని పూర్తిగా పక్కన పెట్టిన సీబీఐ వివేకా యాక్టివ్‌గా ఉన్నారని చార్జిషీట్‌లో రాసుకొచ్చింది.

ఇక కడప ఎంపీ అభ్యర్ధి విషయంలో వచ్చిన విభేదాలే హత్యకు కారణమని సీబీఐ చెప్పిన మాటలకు ఆధారాలు లేవు. పైగా ఇది పూర్తి అబద్ధం అని నిరూపించే ఆధారాలు చార్జిషీట్‌లోనే ఉన్నాయి. ముఖ్యంగా 2019 మార్చి 10న ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. ఇక  మార్చి 17, 2019 న ఒకేసారి అన్ని స్థానాలకు వైఎస్సార్సీపీ అభ్యర్థులను ప్రకటించింది. అయితే రెండు రోజులు ముందుగానే అభ్యర్ధుల పేర్లు ప్రకటించాల్సి ఉన్నా.. వివేకా మరణంతో రెండు రోజులు ఆలస్యమయింది.

ఇక నోటిఫికేషన్‌కంటే ముందు అంటే అధికారికంగా అభ్యర్ధుల పేర్లు ప్రకటించడం కన్నా ముందే కడప ఎంపీ అభ్యర్ధిగా అవినాష్‌రెడ్డి పేరు ఖరారైంది.  ఇక కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి బలహీన అభ్యర్థి అనేది వాస్తవ విరుద్ధం. 2014 లోనే కడప నుండి లక్షా 93 వేల 323 ఓట్ల మెజారిటీతో గెలిచిన వైఎస్ అవినాష్ రెడ్డి. 2019 లో జరిగిన ఎన్నికల్లో తిరిగి 3,80,976 ఓట్లతో ఆదినారాయణ రెడ్డిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. వైఎస్సార్ కాంగ్రెస్‌కి వైఎస్ అవినాష్ రెడ్డి అత్యంత బలమైన అభ్యర్థి అనేది కడప వారినే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను గమనించే ప్రతి ఒక్కరికి అర్ధం అవుతుంది.

ఇక కడప ఎంపీ అభ్యర్థి విషయంలో ఎలాంటి గందరగోళం లేదని స్వతహాగా వివేకా కూతురు, అల్లుడు స్వయంగా సీబీఐకి చెప్పారు. కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డిని ఎప్పుడో నిర్ణయించారని వైఎస్ వివేకానందరెడ్డి కూడా అవినాష్‌ రెడ్డి కోసం ప్రచారం చేశారని స్వయంగా వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐ వాంగ్మూలంలో వెల్లడించారు. వివేకా చనిపోవడానికి ఒకరోజు ముందు వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి వివేకా జమ్మలమడుగులో ప్రచారం చేసినట్టు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐకి ఇచ్చిన స్టేట్‌మెంట్లో ఒకటికి రెండుసార్లు చెప్పారు.

అంతే కాదు కడప ఎంపీ అభ్యర్థిగా అవినాష్ రెడ్డి మినహా మరెవరి పేరు చర్చకు లేదని, అవినాష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఎవ్వరూ ఎన్నడూ వ్యతిరేకించలేదని వైఎస్ వివేకా సోదరి విమలమ్మ పలుమార్లు స్పష్టం చేశారు. ఈ విషయాలేవి మాత్రం సీబీఐకి కనపడలేదు. పైగా కడప ఎంపీ విషయంలో జోక్యం చేసుకుని పెద్దగా ప్రభావం చూపగల శక్తిగాని అంత అధికారంగాని వివేకాకు లేదని కడప రాజకీయాలను గమనించేవారందరికి తెలుసు. వైఎస్ వివేకా కడప ఎంపీ అభ్యర్థి నిర్ధారించే విషయంలో వైఎస్ వివేకా ప్రభావం చాలా తక్కువ. 2011 లో వైఎస్‌ జయమ్మకు వ్యతిరేకంగా పోటీ చేసిన వివేకా అనంతరం వైఎస్సార్ కుటుంబానికి దూరమయ్యారు.

వైఎస్ మరణం తర్వాత ఆయన తన కుటుంబంతో వెళ్లి సోనియా గాంధీని కలిశారు. సోనియా గాంధీ వైఎస్ జగన్ ఓదార్పు యాత్రను వ్యతిరేకించినా అధికారం కోసం వైఎస్ వివేకా కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ విజయమ్మ, వైఎస్ జగన్‌ బయటకు వస్తే మంత్రి పదవి కోసం ఏకంగా తల్లిలాంటి వదిన విజయమ్మపై పోటీ చేశారు. 2008లో అమెరికా నుండి వచ్చినవైఎస్ వివేకా అల్లుడికి రాజకీయ కాంక్ష ఎక్కువ. ఒకటి రెండు సార్లు ఎన్నికల్లో పోటీ చేద్దామని ప్రయత్నించారు.

2011లో వైఎస్ విజయమ్మకు వ్యతిరేకంగా నర్రెడ్డి కుటుంబం ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఎన్నికల్లో విజయమ్మ చేతిలో వివేకా ఘోరంగా పరాజయం పొందారు. ఇంత జరిగినా చిన్నాన్న వివేకాపై వైఎస్ జగన్ సానుభూతిగానే వ్యవహరించారు. ఆయనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని, కడప జిల్లా ఇన్ ఛార్జ్‌ని చేశారు. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఉన్నంత ప్రభావవంతంగా వివేకా లేరనేది చాలామంది కడప నాయకులకు తెలుసు. మరి అలాంటి వ్యక్తి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చగలిగే అంత ప్రభావం చూపిస్తారా

ఒకవైపు తన తండ్రి రాజకీయాల్లో నుంచి రిటైర్ అయ్యారని స్వయంగా వివేకా కూతురు సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు అధికారిక ప్రకటన కంటే ముందే వైఎస్ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి అన్న విషయం అందరికీ తెలుసని.. వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి సీబీఐ కి వాంగ్మూలం ఇచ్చారు.  అయినా సీబీఐ మాత్రం కడప ఎంపీ సీటు కోసమే వివేకా హత్య జరిగిందనిఛార్జ్ షీట్ లో కథ అల్లడం విస్మయానికి గురిచేస్తోంది.

ఇక కడప ఎంపీ సీటే వివేకా హత్యకు కారణం అని  కథ అల్లిన సీబీఐ ఎలాంటి ఆధారాలు చూపలేకపోయింది. ఇక ఈ కథనానికి బలం చేకూర్చేందుకు సీబీఐ మరో కథను సిద్ధం చేసింది. అదే 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి. వివేకాను అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ద్రోహం చేశారని అందుకే ఆయన ఓడిపోయారనేది సీబీఐ కథనం. ఇక ఓటమికి కారణం అయిన భాస్కర్‌ రెడ్డి, అవినాష్ రెడ్డిని ఇంటికి వెళ్లి  వైఎస్ వివేక తీవ్రంగా అవమానించారనేది సీబీఐ చార్జిషీటులో చెప్పిన మాట. దీంతో వైఎస్ భాస్కర్‌రెడ్డి కుటుంబం వివేకాను హత్య చేసిందనిం సీబీఐ కథనం అల్లింది. అయితే అసలు వాస్తవం మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఉంది.

2017 స్థానిక సంస్థల  ఎమ్మెల్సీ ఎన్నికల్లో  పోటీ చేసి వైఎస్ వివేకానందరెడ్డి ఓడిపోయారు. వివేకాను ఎమ్మెల్సీ చేసేందుకు వైఎస్ జగన్ ఆయనకు బీఫాం ఇచ్చారు. అయితే అధికారంలో ఉన్న టీడీపీ ఎలాగైన గెలవడానికి స్థానిక సంస్థల సభ్యులను బెదిరించి.. ప్రలోభాలకు గురిచేసి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచింది. అయితే సీబీఐ మాత్రం ఈ ఎన్నికల్లో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ముగ్గురు వివేకాకు వ్యతిరేకంగా పనిచేసినట్లు చెబుతోంది. అయితే దీనికి  ఒక్క ఆధారం కూడా చూపలేకపోయింది. కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేసిన 800 మంది ఓటర్లలో ఒక్కర్ని కూడా సీబీఐ విచారించలేకపో​యింది.

ఈ 800 మందిలో అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి తమకు డబ్బు ఇచ్చారని ఎక్కడా చెప్పలేదు. వీరెవరి దగ్గరు సీబీఐ స్టేట్‌మెంట్లు రికార్డు చేయేలేదు. అంతే కాదు కనీసం వివేకాను ఓడించిన మర్రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవిని కూడా సీబీఐ విచారించ లేదు. అయినా రాజకీయ కక్షతోనే హత్య జరిగిందని ఛార్జ్‌షీట్‌ లో కథనం అల్లేసింది. రెండేళ్ల కిందట జరిగిన గొడవకు, ఇప్పుడు జరిగిన హత్యకు సంబంధం ఎలా ఉంటుందో సీబీఐ చెప్పలేదు.

ఇక సీబీఐ చార్జిషీటులో రాజకీయ కోణమే హత్యకు కారణమని తేల్చేసింది. ఎక్కడా ఆధారం లేకపోయిన కథనం అల్లేసి వండివార్చేసింది. ఇక మిగిలిన ఆధారాలను మాత్రం పక్కన పడేసింది. అందులో ముఖ్య కారణం..ఆస్తి తగాదాలు.

హత్య జరిగిన సమయానికి వివేకా వయస్సు 67 సంవత్సరాలు.పులివెందులలోని తన నివాసంలో వివేకా ఒంటరిగా నివసిస్తున్నారు. వివేకాకు ఆరు నెలలకిందటే గుండె ఆపరేషన్ జరిగినా వివేకా భార్య మాత్రంం వివేకాను వదిలి తన కుమార్తె సునీత దగ్గర ఉంటున్నారు. నెలకు ఒక్కసారి మాత్రమే

వివేకా దగ్గరకి ఆయన సతీమణి వచ్చి వెళ్లేవారు. వివేకా కూతురు సునీతా ఏడాదిలో ఒకటి రెండు సార్లు మాత్రమే తండ్రిని కలిసేవారు. వ్యాపార సంబంధాల కారణంగా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి మాత్రం పలు మార్లు వివేకాను కలిసేవారనేది సీబీఐ సేకరించిన వాంగ్మూలాల ద్వారా స్పష్టం అవుతోంది.

వివేకా గురించి ఆయన కుమార్తె సునీత సీబీఐతో చెప్పిన విషయాలతో వారి కుటుంబం మధ్య ఉన్న గొడవలు స్పష్టంగా అర్ధం అవుతాయి. తన తండ్రి వివేకాకు షమీమ్ అనే మహిళతో వివాహేతర సంబంధం ఉన్న విషయం తెలిసాక తాను తండ్రి దగ్గరకు వెళ్లే దాన్ని కాదని ఏడాదిలో ఒకటి రెండు సార్లు వెళ్లినా కేవలం ఒకటి, రెండు రోజులు మాత్రమే అక్కడ ఉండే దాన్నని సునీతారెడ్డి సీబీఐకి చెప్పింది. వివేకా హత్య కంటే ముందు 2018 క్రిస్మస్‌ రోజున తాను చివరిసారిగా వివేకా ఇంచికి వెళ్లినట్లు సునీతారెడ్డి సీబీఐకి చెప్పింది. షమీమ్‌అనే మహిళతో వివాహేతర సంబంధం కారణంగా వివేకాకు మొదటి భార్య కుటుంబ సభ్యులతో గొడవలు ఉన్నాయనిం సీబీఐకి షమీమ్ ఇచ్చిన వాంగ్మూలం స్పష్టం చేస్తోంది.

2006లో వివేకాకు షమీమ్ అనే మహిళతో పరిచయమైంది. హైదరాబాద్‌లోని ఓ సంస్థలో ఉద్యోగం కోసం వివేకా సహాయం కావాలని షమీమ్ కోరింది. ఇక వివేకా షమీమ్ల మధ్య పరిచయం కాస్త వివాహానికి దారితీసింది. దీంతో తన పేరును అక్బర్‌గా మార్చుకుని వివేకా షమీమ్‌ను వివాహం చేసుకున్నారు.మరణించే సమయానికి వివేకా, షమీమ్ లకు ఆరేళ్ల కుమారుడు ఉన్నాడు. వివాహం గురించి తెలిసిన తర్వాత వివేక మొదటి భార్య కుటుంబ సభ్యులు తనను బెదిరించారని షమీమ్‌ సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పింది.

వివేకా బావమరిది నర్రెడ్డి శివప్రసాద్ పలుమార్లు మనుషులను పంపి నన్ను బెదిరించారని.. తన కోసం వివేకా పలుమార్లు బావ మరుదులతో ఘర్షణకు దిగారని సీబీఐకి తెలిపిన షమీమ్. నెలసరి ఖర్చులతో పాటు వివేకా తనను అన్ని రకాలుగా చూసుకున్నారని షమీమ్ సీబీఐకి తెలిపారు. 2018లో గుండె ఆపరేషన్ తర్వాత తన ఆరేళ్ల కుమారుడి భవిష్యత్ కోసం వివేకా ఆందోళన చెందేవారని షమీమ్‌ సీబీఐ అధికారులకు తెలిపింది.

తన కుమారుడిని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో చేర్పించడంతో పాటు తనకు హైదరాబాద్‌లో ఇల్లు కొనిస్తానని కొంత డబ్బు ఫిక్డ్స్‌ డిపాజిట్ చేయించడంతో పాటు వ్యవసాయ భూమిని కొనిస్తానని వివేకా వాగ్ధానం చేశారని సీబీఐ వాంగ్మూలంలో చెప్పిన షమీమ్. అయితే చనిపోవడానికి కొద్ది రోజుల ముందు అన్ని కంపెనీల నుండి వివేకా చెక్ పవర్ తొలగించడంతో ఆయన తీవ్రమైన ఆందోళనకు గురైనట్లు స్టేట్‌మెంట్‌లో స్పష్టం చేసిన వివేకా రెండో భార్య షమీమ్‌. 

ఇక మరణించడానికి కొద్ది రోజుల ముందు నుంచి వివేకా తీవ్రమైన వేదనలో ఉన్నట్లు కేర్‌టేకర్ పండింటి రాజశేఖర్ సీబీఐకి తెలిపారు. డబ్బులు లేకపోవడంతో వివేకా  ఆందోళనకు గురయ్యారని.. ఫలితంగా  విపరీతంగా మద్యం సేవించేవారని రాజశేఖర్ చెప్పాడు. ఒకరోజు డబ్బు విషయం మాట్లాడటం విన్నట్లు త్వరలోనే డబ్బు వస్తుందని అప్పటి వరకు ఓపిక పట్టాలని ఎర్ర గంగిరెడ్డి వివేకాతో అన్నట్లు పండింటి రాజ స్టేట్‌ద్వారా స్పష్టమవుతోంది.

అయితే ఎర్ర గంగిరెడ్డిని బూతులు తిడుతూ వివేకానందరెడ్డి గట్టిగా అరిచేవారని అయినా ఎర్ర గంగిరెడ్డి మౌనంగా ఉంటూ తరచూ వస్తు ఉండేవాడనేది రాజా సీబీఐకి చెప్పాడు. ఇక హత్యకు కొద్ది రోజుల ముందు నుంచి వివేకా ప్రవర్తన అసాధారణంగా మారిపోయిందని.. మెట్ల మీద కూర్చుని విపరీతంగా మద్యం సేవించడం, సిగరెట్లు విపరీతంగా కాల్చేవారని రాజా సీబీఐకి పూసగుచ్చినట్లు చెప్పాడు.

మెల్లమెల్లగా వివేకా ఆరోగ్యం పూర్తిగాక్షీణించడం ప్రారంభించిందని ఇది చూసి తాను ఒకరోజు ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పానట్లు రాజా స్టేట్‌మెంట్‌లో స్పష్టం చేశాడు. ఇంకా ఏదో ఒకపంచాయతీ విషయంలో పెద్ద ఎత్తున డబ్బు వస్తుందని వివేకా ఎదురుచూస్తున్నట్టు రాజశేఖర్ రెడ్డికి చెప్పానని సీబీఐ ముందు రాజా ఒప్పుకున్నాడు. ఇక వివేకా డబ్బు వ్యవహారాల గురించి పండింటి రాజశేఖర్‌తో పాటు చాలా మందికి తెలుసు.సీబీఐ వాంగ్మూలాలను పరిశీలించినా వివేకాకు దాదాపు 5 కోట్ల అప్పు ఉందని స్పష్టమౌతోంది.

ఇక ఓవైపు వివేకా అప్పులతో తీవ్రమైన వేదనలో ఉంటేం సునీత రెడ్డి మాత్రం సీబీఐ వాంగ్మూలంలో మరో చెప్పింది. సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో తన తండ్రి చనిపోయే సమయానికి ఆయన పేరు మీద 50 కోట్ల ఆస్తి ఉందని సునీతరెడ్డి చెప్పింది. అయితే వివేకా చెక్ పవర్ ఎందుకు తొలగించారని అడిగిన ప్రశ్నకు సునీత రెడ్డి విచిత్రమైన సమాధానం చెప్పింది. తాము  వ్యాపారం కోసం అప్పు తీసుకొడానికి ప్రయత్నించినట్టు, అయితే వివేక అప్పటికే చాలా అప్పులు చేసినందున తమ కంపెనీకి అప్పు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరించినట్లు సునీత వాంగ్మూలంలో చెప్పుకొచ్చింది.

అందుకే బ్యాంకు అకౌంట్లకు సంబంధించి కొన్ని మార్పులు చేసి వివేకా చెక్ పవర్‌ను తొలగించినట్లు సునీతారెడ్డి చెప్పింది. కేవలం కంపెనీలో అప్పుతెచ్చుకోవడానికే ఈ మార్పులు చేశామని తన తండ్రి కంపెనీలలో  తాను కూడా డైరెక్టర్‌గా ఉన్నానని సునీత ఒప్పుకుంది. ఇక వివేకా మరణం తరువాత ఆయన స్థానంలో తాను డైరెక్టర్‌గా చేరిన సునీత.. తండ్రి మరణం తరువాత అప్పులన్నీ కట్టేసి కంపెనీలను లాభాలలోకి తెచ్చామని చెప్పిన సునీత. అయితే వివేకా బతికి ఉన్నప్పుడు మాత్రం కనీస ఖర్చులకు డబ్బులు లేకుండా ఆయన తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వైఎస్ వివేకా మరణం తరువాత 2023 జనవరిలో 93 ఎకరాల భూమిని తమ పేరు మీద మార్చుకున్న కూతురు సునీత రెడ్డి, భార్య సౌభాగ్యమ్మ.

వివేకా కుటుంబంలో ఈ స్థాయిలో ఆస్తి కోసం కుట్రలు  జరిగినా సీబీఐ మాత్రం వీటిని పట్టించుకోలేదు. తన విచారణలో ఎక్కడా హత్యకు సంబంధించిన కారణాలలో ఆస్తి తగాదాలకు సంబంధించిన కోణంలో విచారణ జరప లేదు. కేవలం రాజకీయ కోణాన్నే హత్యకు కారణంగా చూపేందుకు సీబీఐ కావాలని ఆస్తి తగాదాలను చిన్నదిగా చెప్పే ప్రయత్నం చేసింది. వివేకా హత్యలో బయటి వ్యక్తుల ప్రమేయం పైన సీబీఐ పూర్తిగా విచారణ జరపలేదు.సీబీఐ విచారణ మొత్తం కేవలం ఇద్దరు వ్యక్తుల వాంగ్మూలం ఆధారంగానే సీబీఐ తన విచారణను ముగించింది. వివేకా హత్యకేసులో నిందితుడైన మాజీ డ్రైవర్ దస్తగిరి, వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగన్న చెప్పిన మాటలే సీబీఐ విచారణకు ఆధారం. కానీవీళ్లిద్దరు నిజం చెప్తున్నారా...? అనే దానికి ఎక్కడా ఆధారం లేదు అంటూ ది వైర్‌ కథనంలో పేర్కొంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement