‘రుయా’లో విషాదం.. సీఎం జగన్‌ దిగ్భ్రాంతి | Tirupati RUIA Hospital Oxygen Supply Delay Patients Health Critical | Sakshi
Sakshi News home page

‘రుయా’లో విషాదం.. సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

Published Mon, May 10 2021 10:27 PM | Last Updated on Tue, May 11 2021 9:47 AM

Tirupati RUIA Hospital Oxygen Supply Delay Patients Health Critical - Sakshi

సాక్షి, తిరుపతి/తిరుపతి తుడా/గుంటూరు రూరల్‌/అమరావతి: తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి ఆక్సిజన్‌ సరఫరాలో ప్రెజర్‌ తగ్గి 5 నిమిషాల పాటు అంతరాయం ఏర్పడటంతో 11 మంది కరోనా బాధితులు ఊపిరాడక మృతి చెందారు. మరికొందరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆస్పత్రి అధికారులు, వైద్యులు, సిబ్బంది సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. రంగంలోకి దిగిన అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడంతో పాటు ఆక్సిజన్‌  సరఫరాను పునరుద్ధరించి వందలాది మంది ప్రాణాలను నిలబెట్టగలిగారు. ఈ  ఘటనపై ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే పూర్తిస్థాయి విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. కోవిడ్‌ బాధితుల కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.

ఆక్సిజన్‌ ట్యాంకర్‌ ఆలస్యంగా రావడంతో..
చెన్నై నుంచి రావాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్‌ 20 నిమిషాలు ఆలస్యం కావడంతో సమస్య ఏర్పడిందని అధికారులు తెలిపారు. వచ్చిన ట్యాంకర్‌ను అమర్చే సమయంలో ఐదు నిమిషాల పాటు ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో వెంటిలేటర్‌పై ఉన్న కరోనా బాధితులు ఆ  ఐదు నిమిషాలు ఊపిరి ఆడక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న రుయా ఆస్పత్రి అధికారులు, ఎంపీ గురుమూర్తి, కలెక్టర్‌ హరినారాయణన్, కమిషనర్‌ గిరీష, ఎస్పీ వెంకట అప్పలనాయుడు, మేయర్‌ శిరీష, జేసీ వీరబ్రహ్మం, ఆర్డీవో కనక నరసారెడ్డి, ఇతర అధికారులు హుటాహుటిన చేరుకుని పరిస్థితిని సమీక్షించి అదుపులోకి తెచ్చారు. రుయా ఆస్పత్రిలో ప్రభుత్వం 135 ఐసీయూ బెడ్లు, 573 ఆక్సిజన్, 319 సాధారణ బెడ్లను ఏర్పాడు చేసి కరోనా బాధితులకు వైద్య సేవలు అందిస్తోంది. ప్రైవేటు దోపిడీ సమయంలో ప్రభుత్వ వైద్యులు ప్రాణాలకు తెగించి వేలాది మందికి ఉచిత వైద్యసేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం రుయాలో 1,027 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు.

బాధాకరమైన ఘటన.. ఆందోళన చెందొద్దు
రుయా ఆస్పత్రిలో చోటుచేసుకున్న ఘటన చాలా బాధాకరం. వెంటనే అధికారులు స్పందించటంతో పెను ప్రమాదం తప్పింది. వందలాది మంది ప్రాణాలను నిలబెట్టేందుకు 30 మంది వైద్యులు చర్యలు చేపట్టారు. ఐదు నిమిషాలు మాత్రమే ఆక్సిజన్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఐసీయూలో ఉన్న 11 మంది కరోనా బాధితులు మృతి చెందారు. చెన్నై నుంచి ఆక్సిజన్‌ రావడంలో ఆలస్యమే ఈ పరిస్థితికి కారణం. ఆక్సిజన్‌ ప్లాంట్లలో ప్రెజర్‌ తగ్గడం వల్ల ఐసీయూలోకి సరఫరా ఆందలేదు. ఘటనపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడి పరిస్థితిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపి సీఎంకు నివేదిక ఇస్తాం. ఈ ఘటనకు కారకులు ఎవరైనా ఉన్నట్టు తేలితే చర్యలు తప్పవు.    – హరినారాయణన్, కలెక్టర్‌

ఎలాంటి సాంకేతిక సమస్య లేదు
ఆక్సిజన్‌ సరఫరాలో ఎలాంటి సాంకేతిక సమస్య లేదు. కేవలం ట్యాంకర్‌ రావడం ఆలస్యమైంది. ఆ సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకుంది. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకుంటాం.
– డాక్టర్‌ గురుమూర్తి, ఎంపీ, తిరుపతి 

చదవండి: సెకండ్‌ వేవ్‌ గుణపాఠం: ముందే మేల్కొన్న ముఖ్యమంత్రి..

చదవండి: రేపు కేబినెట్‌ భేటీ: లాక్‌డౌన్‌పై తేల్చనున్న సీఎం కేసీఆర్

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement