ఆరోగ్యానికి రక్ష.. జగనన్న సురక్ష  | Specialist medical services for people at village and ward levels: ap | Sakshi
Sakshi News home page

ఆరోగ్యానికి రక్ష.. జగనన్న సురక్ష 

Published Mon, Jan 29 2024 2:31 AM | Last Updated on Mon, Jan 29 2024 2:31 AM

Specialist medical services for people at village and ward levels: ap - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి ఇంటిని జల్లెడ పట్టి.. ప్రజల ఆరోగ్య సమస్యలను గుర్తించి సత్వర చికిత్సలు చేయించే లక్ష్యంతో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ (జేఏఎస్‌) కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ నెల 2వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ జేఏఎస్‌ కార్యక్రమాన్ని వైద్య శాఖ ప్రారంభించి.. 10 లక్షల మందికి వైద్య సేవల మైలు రాయికి చేరువైంది. నిర్దేశించిన షెడ్యూల్‌ మేరకు గ్రామాలు, పట్టణాల్లోని వార్డుల్లో సురక్ష శిబిరాలను నిర్వహిస్తూ.. స్పెషలిస్ట్‌ వైద్యుల ద్వారా చికిత్సలు అందిస్తున్నారు. శిబిరం వద్దే కంటి వైద్య పరీక్షలతోపాటు, ఈసీజీ, డెంగీ, మలేరియా వంటి ఇతర పరీక్షలను నిర్వహిస్తున్నారు. 

9.48 లక్షల మందికి వైద్యం 
ప్రతి జిల్లాలో మండలాలను విభజించి సగం మండలాల్లో మంగళవారం, మిగిలిన సగం మండలాల్లో శుక్రవారం శిబిరాలు నిర్వహిస్తున్నారు. పట్టణాలు, నగరాల్లో బుధవారం శిబిరాలు ఏర్పాటు చేస్తున్నా­రు. 6 నెలల్లో రాష్ట్రమంతటా 13,954 శిబిరాలను నిర్వహించడం లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నెలలో 3,583 శిబిరాలు నిర్వహించాల్సి ఉండగా.. ఇప్పటికే 2,838 నిర్వహించారు. శిబిరాల ద్వారా గ్రా­మాల్లో 6,94,596, పట్టణాల్లో 2,53,668 చొప్పున మొత్తంగా 9,48,264 మందికి ఉచిత వైద్య సేవలు అందించారు.

ఒక్కో శిబిరంలో సగటున 334 మంది వైద్య సేవలు అందుకున్నారు. అత్య­ధి­కంగా అ­నంతపురం జిల్లాలో 58,474 మంది ఉచి­త చికిత్స­లు పొందారు. నంద్యాల జిల్లాలో 57,894, వైఎస్సార్‌ జిల్లాలో 51,735 మంది స్పెషలిస్ట్‌ వైద్య సే­వలు అందుకున్నారు. శిబిరాల వద్దే లక్షకు పైగా స్పాట్‌ టెస్ట్‌లు నిర్వహించారు. వైద్య పరీక్షల నిర్వహణకు 7 రకాల కిట్లను, ఈసీజీ, ఇతర పరికరాలను శిబిరాల్లో అందుబాటులో ఉంచారు.  

తొలి దశలో 60.27 లక్షలు 
తొలి దశ జేఏఎస్‌ కార్యక్రమంలో 12,423 శిబిరాలను నిర్వహించిన ప్రభుత్వం 60,27,843 మందికి ఉచిత వైద్యసేవలు అందించింది. వైద్య సిబ్బంది 1.45 కోట్ల గృహాలను సందర్శించి ప్రజలను స్క్రీనింగ్‌ చేశారు. 6.45 కోట్ల వైద్య పరీక్షలు నిర్వహించారు. శిబిరాల్లో పరిశీలించిన అనంతరం వైద్యులు 1,64,982 మందిని తదుపరి వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రెఫర్‌ చేశారు. వీరు ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందేలా ప్ర­యాణ ఖర్చుల కింద రూ.500 చొప్పున ప్రభుత్వం సాయం చేసింది. రిఫరల్‌ కేసుల్లో బాధితులందరికీ ప్రభుత్వమే ఉచితంగా చికిత్సలు చేయించడంతో పాటు, చికిత్స తరువాతా అండగా నిలుస్తోంది.  

యూరినరీ సమస్యకు పరిష్కారం 
కొన్ని నెలలుగా యూరినరీ సమస్యతో బాధపడుతున్నాను. మా ఊళ్లో ఆరోగ్య సురక్ష శిబిరం ఏర్పాటు చేసినప్పుడు స్పెషలిస్ట్‌ వైద్యులు వచ్చారు. శిబిరానికి వెళ్లి నా సమస్యను వైద్యులకు వివరించాను. విజయవాడ ఆస్పత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం చేస్తారని చెప్పారు. పీహెచ్‌సీ వైద్యులు, ఏఎన్‌ఎంల చొరవతో విజయవాడలోని ఆస్పత్రికి వెళితే అక్కడ ఉచితంగా సర్జరీ చేశారు.    – ఖాసీంవలి, దబ్బాకులపల్లి,ఎన్టీఆర్జిల్లా 

నిరంతరం ఫాలోఅప్‌ 
సురక్ష శిబిరాల్లో వైద్య సేవలు అందించి, అనంతరం కూడా బాధితుల ఆరోగ్యంపై నిరంతరం ఫాలోఅప్‌ ఉంచుతున్నాం.రిఫరల్‌ వైద్యం అవసరం గల వారిని స్థానిక ఫ్యామిలీ డాక్టర్, వైద్య సిబ్బందికి అనుసంధానం చేస్తున్నాం. సంబంధిత రోగి ఆస్పత్రికి వెళ్లి సేవలు పొందేలా సమన్వయం చేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కాలానుగుణంగా మందులు అందించడం, ఆరోగ్యం గురించి వాకబు చేస్తున్నాం. గుండె, కిడ్నీ, కాలేయం, క్యాన్సర్‌ సంబంధిత జబ్బుల బాధితులకు ఇళ్ల వద్దకే మందులను డెలివరీ చేస్తున్నాం.  – జె.నివాస్, కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement