ప్రభుత్వ ఉద్యోగుల 341 డిమాండ్లు పరిష్కారం | Settlement of 341 demands of government employees | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఉద్యోగుల 341 డిమాండ్లు పరిష్కారం

Published Fri, Jul 14 2023 4:54 AM | Last Updated on Fri, Jul 14 2023 10:49 AM

Settlement of 341 demands of government employees - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగు­లకు సంబంధించి సుమారు 461 డిమాండ్లలో 341 డిమాండ్లను పరిష్కరించామని, మిగతా వాటిని కూడా సాధ్యమైనంత త్వరలో పరిష్కరిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) డా.కేఎస్‌ జవహర్‌ రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం గురువారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది.

సీఎస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు, పలు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సీఎస్‌ వివరించారు. ఉద్యోగ సంఘాల నేతలు చెప్పిన డిమాండ్లను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల హర్షం వ్యక్తం చేశారు.

జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశంలో సీఎస్‌ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. శాఖల స్థాయిలో ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి, చాలా వరకు పరిష్కరించినట్లు చెప్పారు. ఆరేడు నెలలుగా ఉద్యోగ సంఘాలతో తరచూ మంత్రివర్గ ఉప సంఘం, అధికారులు సమావేశమై చర్చిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత వరకు అన్ని డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు.

కరోనాతో చనిపోయిన ఉద్యోగుల కుటుంబీకులకు కారుణ్య విధానంలో త్వరలోనే 1042 ఉద్యోగాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ ప్రక్రియను కూడా త్వరగా పూర్తి చేస్తామన్నారు. ఉద్యోగుల వేతన సవరణకు మాజీ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలో 12వ పీఆర్సీని కూడా నియమించినట్లు చెప్పారు.  ఉద్యోగుల ఆరోగ్య పథకంపై త్వరలో స్టీరింగ్‌ కమిటీ సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. వివిధ శాఖల్లో ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలను ఆ శాఖల ఉన్నతాధికారులు వివరించారు.

ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు కె.ప్రవీణ్‌ కుమార్, అజయ్‌ జైన్, బి.రాజశేఖర్, ఎం.టి. కృష్ణబాబు, గోపాలకృష్ణ ద్వివేది, ముఖ్య కార్యదర్శులు చిరంజీవి చౌదరి, జయలక్ష్మి, శశిభూషణ్‌ కుమార్, ప్రవీణ్‌ ప్రకాశ్, శ్యామల రావు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ఉద్యోగ సంఘాల నుండి రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి, ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు, రెవెన్యూ సర్వీసెస్‌ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎస్టీయూ, పీఆర్టీయూ, యూటీఎఫ్, ఏపీటీఎఫ్, ఏపీ ఉపాధ్యాయ సంఘాల అధ్యక్షులు సాయి శ్రీనివాస్, ఎం.కృష్ణయ్య, ఎన్‌.వెంకటేశ్వర్లు, జి.హృదయరాజు, సీహెచ్‌ శ్రావణ్‌ కుమార్, ప్రభుత్వ డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు ఎస్‌.శ్రీనివాసరావు, ఏపీజీఈఏ జనరల్‌ సెక్రటరీ జె.ఆస్కార్‌ రావు, ఆల్‌ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ నాలుగో తరగతి ఉద్యోగుల సెంట్రల్‌ అసోసియేషన్ల అధ్యక్షులు సి.గోపాలకృష్ణ, ఎస్‌.మల్లేశ్వరరావు, వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం అధ్యక్షుడు వేణుమాధవరావు, ఎకనమిక్స్‌ అండ్‌ స్టాటిస్టికల్‌ సబార్డినేట్‌ సంఘం అధ్యక్షుడు రజనీష్‌ బాబు, జూనియర్‌ వెటర్నరీ అధికారులు, వెటర్నరీ లైవ్‌స్టాక్‌ అధికారులు సంఘం అధ్యక్షుడు సేవా నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

వేగంగా సమస్యల పరిష్కారం హర్షణీయం: బండి శ్రీనివాసరావు
40 ఏళ్ల చరిత్రలో తొలిసారి చాలా గొప్ప జాయింట్‌ కౌన్సిల్‌ సమావేశం జరిగింది. వేగంగా సమస్యల పరిష్కారం హర్షణీయం. 40 రోజుల్లో కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామన్నారు. కొత్త జిల్లాల హెడ్‌ క్వార్టర్స్‌లో 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపాం.

పెన్షనర్ల డిమాండ్లు పరిష్కరించాలని కోరాం. పోలీసులు, ఉద్యోగులకు సరెండర్‌ లీవుల బకాయిలు రూ. 800 కోట్లు ఆగస్టు, సెప్టెంబర్‌ నెలల్లో క్లియర్‌ చేస్తామన్నారు. యూరోపియన్‌ ఏఎన్‌ఎంలను రెగ్యులరైజేషన్, ఎంపీడీవోల ప్రమోషన్లలో మినిస్టీరియల్‌ సిబ్బందికి 34 శాతం కోటాపై సానుకూలంగా స్పందించారు. 2004 కు ముందు ఉద్యోగంలో చేరిన వారికి ఓపీఎస్‌ అమలు చేయమని కోరాం. మన్మోహన్‌ సింగ్‌ ను పీఆర్సీ కమిషన్‌ చైర్మన్‌గా నియమించడం హర్షణీయం.

ఓపీఎస్‌ టు జీపీఎస్‌ గతంలోకంటే బాగుంది: వెంకట్రామిరెడ్డి 
కాంట్రాక్టు ఉద్యోగులందరి క్రమబద్ధీకరణకు ఒకే జీవో ఇస్తామన్నారు. వారు పనిచేసే చోట రెగ్యులర్‌ చేసేంత వరకు నోటిఫికేషన్‌లు ఇవ్వొద్దని కోరాం. ఓపీఎస్‌ టు జీపీఎస్‌ గతంలోకంటే బాగుంది. జీపీఎస్‌ ఉత్తర్వులు ఇచ్చే ముందు ఉద్యోగ సంఘాలతో చర్చించాలని కోరాం. అందుకు సీఎస్‌ అంగీకరించారు. జగనన్న లే అవుట్‌లలో ఇచ్చిన స్థలం కాకుండా జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌లో ఉద్యోగులకు వంద ఎకరాలు ఇళ్ల స్థలాలకు కేటాయించాలని కోరాం. అవుట్‌సోర్సింగ్‌ ఎంప్లాయీస్‌కు ప్రభుత్వ పథకాలు ఇవ్వాలని, జీతాలు పెంచాలని కోరగా సీఎస్‌ అంగీకరించారు.

గ్రీవెన్స్‌ డే నిర్వహించడం సంతోషం: బొప్పరాజు వెంకటేశ్వర్లు
ఇకపై నాలుగు నెలలకు ఒకసారి జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి మొదటిసారిగా గ్రీవెన్స్‌ డే నిర్వహించడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ నిర్ణయం హర్షణీయం. 2014 జూన్‌ 2 నాటికి ఉద్యోగంలో చేరిన కాంట్రాక్ట్‌ ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలి.

జీతాలు, పింఛన్లు 1వ తేదీన చెల్లించాలని కోరాం. ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఇవ్వడం సంతోషం. ఆర్టీసీ ఉద్యోగుల అలవెన్సులు కూడా జీతాలతో కలిపి ఇవ్వాలని కోరగా సానుకూలంగా స్పందించారు. ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌ను బలోపేతం చేయాలని, తక్షణమే ట్రస్ట్‌ అకౌంట్‌లో డబ్బులు జమ చేయాలని కోరాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement