మరో 4 జిల్లాల్లో ప్రైమ్‌ రిజిస్ట్రేషన్లు | Prime registrations in 4 more districts | Sakshi
Sakshi News home page

మరో 4 జిల్లాల్లో ప్రైమ్‌ రిజిస్ట్రేషన్లు

Published Wed, Nov 8 2023 4:41 AM | Last Updated on Wed, Nov 8 2023 4:41 AM

Prime registrations in 4 more districts - Sakshi

సాక్షి, అమరావతి: తమ ఆస్తుల రిజిస్ట్రేషన్లను ప్రజలు సులభంగా చేసుకునేలా ప్రభుత్వం తీసుకు­వచ్చిన కొత్త విధానం కార్డ్‌ ప్రైమ్‌ మరో 4 జిల్లాల్లో ప్రారంభమైంది. నంద్యాల, విశాఖ, అనకాపల్లి, తిరుపతి జిల్లాల్లోని 51 సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో సోమవారం నుంచి ఈ విధానంలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహిస్తున్నారు. గత రెండు నెలల నుంచి కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లోని 24 సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. అక్కడ విజయవంతంగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండటంతో దశల వారీగా మిగిలిన అన్ని జిల్లాల్లో ప్రారంభిస్తున్నారు.

ఈ నెల 14న శ్రీకాకుళం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, వైఎస్సార్, పశ్చిమ­గోదావరి జిల్లాల్లో ఈ విధానాన్ని అమలు చేయడం ప్రారంభించనున్నారు. దశల వారీగా ఈ నెలాఖరు­కల్లా అన్ని జిల్లాల్లో కొత్త రిజిస్ట్రేషన్ల విధానాన్ని అమలు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

ఇకపై ఈ–సిగ్నేచర్‌తోనే.. 
ప్రస్తుతం డాక్యుమెంట్‌లో ఆస్తి యజమాని సంతకాలు పెట్టే విధానాన్ని కొనసాగిస్తున్నా త్వరలో ఈ–సిగ్నేచర్‌ను మాత్రమే అనుమతించనున్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ సంతకాలు ఇప్పటికే ఈ–సైన్ల ద్వారా జరుగుతున్నాయి. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయిన తర్వాత వ్యవసాయ భూములైతే ఆన్‌లైన్‌లో నమోదు చేయించుకోవడానికి తహశీల్దార్‌ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

రిజిస్ట్రేషన్‌ పూర్తవ­గానే ఆటోమేటిక్‌గా మ్యుటేషన్‌ కూడా కొత్త విధా­నంలో జరిగిపోతుంది. రిజిస్టర్‌ అయిన డాక్యుమెంట్లను సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ ఆఫీసులు, గ్రామ, వార్డు సచివాలయాలు, మీ–సేవా కేంద్రాలు, సీఎస్‌సీ కేంద్రాల్లో ఎక్కడైనా తీసుకోవచ్చు. 

అవగాహన లేకే ‘జిరాక్సుల’ ప్రచారం
కొత్త రిజిస్ట్రేషన్ల విధానంలో ప్రజల డాక్యుమెంట్లను వారికివ్వకుండా జిరాక్సులు మాత్రం వారికిచ్చి, ఒరిజినల్‌ డాక్యుమెంట్లను సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాల­యా­­ల్లోనే ఉంచుతారనే ప్రచారంపై స్టాంపులు, రిజి­స్ట్రేషన్ల శాఖ కమిషనర్‌ అండ్‌ ఐజీ వి.రామకృష్ణ స్ప­ందించారు. లక్షల డాక్యుమెంట్లను దాచిపెట్టే­టన్ని బీరు­­వాలు, కప్‌బోర్డులు తమ ఆఫీసుల్లో లేవ­న్నారు. జిరా­­క్సుల ప్రచారం అపోహ మాత్రమే­నని, అవగా­హన లేకుండా ఇలాంటి ప్రచారాలు చేయడం తగదన్నా­రు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement