‘డిజిటల్‌’ అంతరాలు! | Oxfam India Report Use of digital gadgets in India | Sakshi
Sakshi News home page

‘డిజిటల్‌’ అంతరాలు!

Published Fri, Mar 10 2023 2:31 AM | Last Updated on Fri, Mar 10 2023 6:57 AM

Oxfam India Report Use of digital gadgets in India - Sakshi

సాక్షి, అమరావతి: దేశంలో డిజిటల్‌ గ్యాడ్జెట్ల వినియోగం ఊపందుకున్న తరువాత కులం, మతం, లింగం, తరగతి, భౌగోళిక ప్రాంతాల­వారీగా అసమానతలు పెరుగుతున్నట్లు స్వచ్ఛంద సంస్థ ఆక్స్‌ఫామ్‌ ఇండియా డిజిటల్‌ డివైడ్‌ నివేదిక తెలిపింది. దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో విద్యార్థుల చదువుల కోసం ఇంటర్నెట్, కంప్యూటర్‌ వాడకం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ‘సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియా ఎకానమీ’ నిర్వహించిన ఇంటింటి సర్వే డేటాను విశ్లేషించి పలు కీలక అంశాలను వెల్లడించింది.

పురు­షులతో పోలిస్తే దేశంలో కంప్యూటర్, ల్యాప్‌­టాప్, మొబైల్‌ ఫోన్, ఇంటర్నెట్‌ సదుపాయాలు మహిళలకు తక్కు­వగా అందుబాటులో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. మొబైల్‌ ఫోన్ల అందుబాటు, వినియోగంలో మహిళలు 15 శాతం వెనకబడి ఉన్నారు. ఇంటర్నెట్‌ సేవలను వినియోగించుకునే సదుపాయం కూడా మహిళలకు తక్కువేనని, పురుషులతో పోలిస్తే ఏకంగా 33 శాతం మేర వ్యత్యాసం ఉన్నట్లు తెలిపింది. దేశంలో మూడింట ఒక వంతు మంది మహిళలు మాత్రమే ఇంటర్నెట్‌ వినియోగించుకోగలుగుతున్నారు. 

► దేశాన్ని డిజిటల్‌ ఇండియాగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలను చేపడుతున్నా అవన్నీ పట్టణ వాసులకే ఎక్కువగా అందుబాటులో ఉంటున్నాయని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనా అనంతరం డిజిటల్‌ వృద్ధి రేటు పెరిగింది. ఒక్క ఏడాదిలోనే 13 శాతం మేర వృద్ధి సాధించినట్లు గణాంకాలు పేర్కొంటున్నా గ్రామీణ ప్రాంతాల్లో తక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతంలో కేవలం 31 శాతం మంది మాత్రమే ఇంటర్నెట్‌ వినియోగించుకోగలుగుతున్నారు. అదే పట్టణ ప్రాంతాల్లో 67 శాతానికి పైగా ఇంటర్నెట్‌ వాడుతున్నట్లు ఆక్స్‌ఫామ్‌ ఇండియా నివేదిక తెలిపింది. 

► గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సామాజిక వర్గాలు డిజిటల్‌ వినియోగంలో వెనుకబడి ఉన్నట్లు హౌస్‌హోల్డ్‌ సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయని ఆక్స్‌ఫామ్‌ ఇండియా పేర్కొంది. ఓబీసీలు, ఆ తరువాత ఎస్సీలు, ఆపై ఎస్టీలు వెనుకబడి ఉన్నట్లు తెలిపింది. ఎస్సీ, ఎస్టీల కంటే ఓబీసీ వర్గాలు కంప్యూటర్‌ సదుపాయం, ఇంటర్నెట్‌ వినియోగంలో ముందున్నారని విశ్లేషించింది. ఎస్సీ, ఓబీసీల కంటే ఎస్టీలు 8 శాతానికి పైగా వెనుకబడినట్లు నివేదిక వెల్లడించింది. 

► విద్యాసంస్థల్లో విద్యార్థుల చదువుల కోసం ఇంటర్నెట్, కంప్యూటర్‌ వాడకం తక్కువగా ఉన్నట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.  

► పేదల్లో 40 శాతం మంది డిజిటల్‌ చెల్లింపులు చేస్తున్నారు. ఆపై వర్గాలు, ధనవంతుల్లో 60 శాతానికి పైగా డిజిటల్‌ చెల్లింపులు జరుపుతున్నారు. 

► దేశాన్ని డిజిటల్‌ ఇండియాగా మార్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా అంతర్జాతీయంగా పోలిస్తే చాలా వెనుకంజలో ఉన్నట్లు ఆక్స్‌ఫామ్‌ నివేదిక పేర్కొంది. ఐక్యరాజ్యసమితి రూపొందించే ఈ–పార్టిసిపేషన్‌ ఇండెక్స్‌ 2022 సూచీల్లో దేశం 105 స్థానంలో ఉంది. మొత్తం 193 దేశాల్లో టెలి కమ్యూనికేషన్, డిజిటల్‌ కనెక్టివిటీ, మానవ వనరుల సామర్థ్యాలను పరిగణలోకి తీసుకొని ఐరాస దీన్ని తయారు చేస్తుంది.

► దేశంలో అత్యధికంగా ఇంటర్నెట్, కంప్యూటర్ల వాడకంలో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉంది. గోవా, కేరళ తరువాత స్థానాల్లో నిలిచాయి. అత్యల్పంగా ఇంటర్నెట్‌ వినియోగించే రాష్ట్రాల్లో బిహార్, జార్ఖండ్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలున్నాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement