పింఛన్‌ కోసం.. నలుగురు మృత్యువాత | old people are losing their lives for pension money in ap | Sakshi
Sakshi News home page

పింఛన్‌ కోసం.. నలుగురు మృత్యువాత

Published Fri, May 3 2024 5:23 AM | Last Updated on Fri, May 3 2024 5:23 AM

old people are losing their lives for pension money in ap

డబ్బులు తెచ్చుకునేందుకు వెళ్లి వడదెబ్బతో ముగ్గురు.. 

ఎలా తెచ్చుకోవాలో తెలీక చింతిస్తూ మరొకరు.. 

చంద్రబాబు, నిమ్మగడ్డపై శాపనార్థాలు పెడుతున్న బాధిత కుటుంబ సభ్యులు

సాక్షి నెట్‌వర్క్‌: అవ్వాతాతలు, వృద్ధులు, వితంతువులు తదితరుల ఇళ్లకే వెళ్లి ప్రతీనెలా ఠంఛనుగా ఒకటో తేదీ పొద్దున్నే వలంటీర్ల ద్వారా పింఛన్లను అందజేస్తున్న రాష్ట్ర ప్రభుత్వ విధానంపై టీడీపీ–బీజేపీ–జనసేన కూటమి అక్కసుకు వారు బలవుతున్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఎక్కడ మైలేజీ వస్తుందేమోనన్న దుగ్థతో కూటమి పార్టీలు ఎన్నికల సంఘానికి పదేపదే ఇ చ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. 

దీంతో గత నెలలో సచివాలయాల వద్ద ఇవ్వగా దీనిపైనా కూటమి అభ్యంతరాలు చెప్పడంతో ఈనెల బ్యాంకుల్లో పింఛన్‌ మొత్తం జమచేయమని ఈసీ ఆదేశించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాలున్న వారికి బ్యాంకుల్లో పింఛన్లను జమచేసింది. ఈ నేపథ్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులకు తరలివెళ్లిన అవ్వాతాతలు, వికలాంగులు, వితంతువులు భగభగలాడుతున్న మండుటెండల్లో నానా అవస్థలు పడ్డారు. ఇలా ఎండలకు తాళలేక వడదెబ్బతో ముగ్గురు మృత్యువాత పడగా మరొకరు పెన్షన్‌ ఎలా తెచ్చుకోవాలో తెలీక చింతిస్తూ మరణించారు. వివరాలివీ.. 

చిత్తూరులో జిల్లాలో స్పృహతప్పి.. 
చిత్తూరు జిల్లా కార్వేటినగరం పరిధిలోని పద్మసరస్సు ఎస్టీ కాలనీకి చెందిన చిన్నముత్తయ్య (గోపాలయ్య) మామిడి తోటలో కాపలాదారు. పింఛన్‌ కోసం బ్యాంకుకు వెళ్లి తిరిగి వస్తుండగా జీలగల్లు ప్రాంతంలో ఎండ వేడికి తాళలేక స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.  

పెన్షన్‌ కోసం చింతిస్తూ.. 
ఇన్నాళ్లూ ఇంటికే వచ్చిన పింఛన్‌ సొమ్ము బ్యాంకులో జమకావడంతో ఎలా తెచ్చు­కోవాలో తెలీక శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెమళ్లదిన్నె ఎస్టీ కాలనీకి చెందిన రాగి తిరుపాలమ్మ (75) చింతిస్తూ గురువారం మృతిచెందింది. తిరుపాలమ్మ బుధవారం పింఛను డబ్బుల కోసం సచివాలయం వద్దకు వెళ్లగా బ్యాంకు ఖాతాలో జమ అయినట్లు సమాచారం ఇచ్చారు. కానీ, డబ్బులు చేతికి అందలేదనే దిగులుకు తోడు ఆ డబ్బుల్ని ఎలా తెచ్చుకోవాలో తెలీక చింతిస్తూ  తెల్లవారుజామున ప్రాణాలు విడిచింది.  

పింఛను తీసుకున్న పది నిమిషాలకే వడదెబ్బ.. 
అన్నమయ్య జిల్లా  పెనగలూరుకు చెందిన  బుజ్జమ్మ (60)  బ్యాంకులో పింఛన్‌ తీసుకుని ఇంటికి బయల్దేరుతుండగా ఎండవేడిమి తాళలేక దారిలోనే కుప్పకూలింది.  ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మరణించింది.  

బ్యాంకు బయటే కుప్పకూలి.. 
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కొటాలకు చెందిన వెంకట నాగులు (72) తన ఖాతాలో పింఛను డబ్బులు జమకావడంతో  ఏ.రంగంపేటలోని బ్యాంకుకు వెళ్లాడు. ఎండ వేడిమికి తట్టుకోలేక బ్యాంకు వెలుపలగుండెపోటుతో కుప్పకూలిపడిపోయాడు. తిరుపతి రుయాలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement