వైద్యశాఖలో ఉద్యోగాల పండుగ Notification released for filling up 253 medical posts | Sakshi
Sakshi News home page

వైద్యశాఖలో ఉద్యోగాల పండుగ

Published Fri, Feb 2 2024 5:11 AM | Last Updated on Fri, Feb 2 2024 6:23 AM

Notification released for filling up 253 medical posts - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో ఉద్యోగాల జాతర కొనసాగుతోంది. కొద్ది రోజుల క్రితం డైరెక్టరేట్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (డీఎంఈ) ఆస్పత్రులు, ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 424 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఓవైపు ఈ పోస్టుల భర్తీ కొనసాగుతుండగానే మరోవైపు 253 వైద్య పోస్టుల భర్తీకి ఏపీ మెడికల్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు గురువారం నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఇందులో 234 పోస్టులు నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) పరిధిలో ఉన్నాయి. మరో 19 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను విశాఖ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (విమ్స్‌)లో భర్తీ చేయనున్నట్టు రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ సభ్య కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన ఈ పోస్టుల భర్తీ ఉంటుందన్నారు.

11 స్పెషాలిటీల్లో 19 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి ఈ నెల 9న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విమ్స్‌లో వాక్‌ ఇన్‌ రిక్రూట్‌మెంట్‌ నిర్వహించనున్నారు. అర్హులైన వైద్యులు నేరుగా హాజరు కావాలి. బ్రాడ్‌ స్పెషాలిటీల్లో నెలకు రూ.92 వేలు, సూపర్‌ స్పెషాలిటీల్లో నెలకు రూ.1.60 లక్షలు చొప్పున వేతనాలు ఇస్తారు.  

7 వరకు దరఖాస్తులకు అవకాశం 
కాగా ఎన్‌హెచ్‌ఎం పరిధిలో 234 స్పెషలిస్ట్‌ వైద్య పోస్టులకు   http://apmsrb.ap.gov.in/msrb/ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నెల 7 వరకు గడువు ఉంది. ఓసీలు రూ.1,000, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ వర్గాలకు చెందినవారు రూ.500 చొప్పున దరఖాస్తు రుసుం చెల్లించాలి. ఉద్యోగాలకు ఎంపికైనవారికి మైదాన ప్రాంతాల్లో అయితే నెలకు రూ.1.10 లక్షలు, గిరిజన ప్రాంతాల్లో అయితే రూ.­1.40 లక్షలు చొప్పున వేతనాలు ఇస్తారు.

దరఖాస్తు సమయం­లో ఏమైనా సమస్యలు తలెత్తితే అభ్యర్థులు 7416664387/8309725712 నంబర్లను సంప్రదించవచ్చు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా ఎప్ప­టి­కప్పుడు ఖాళీలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన భర్తీ చేస్తోంది. ఈ క్రమంలో 2019 నుంచి ఇప్పటివరకు ఏకంగా 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టింది.

అంతేకాకుండా వైద్య శాఖలో నియామకాల కోసమే ప్రత్యేకంగా రిక్రూట్‌మెంట్‌ బోర్డ్‌ను సైతం ఏర్పాటు చేసింది. వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేసేలా బోర్డు­కు అత్యవసర అనుమతులు ఇచ్చింది. దీంతో గతంలో ఎన్నడూ­లేని విధంగా వైద్య శాఖలో పోస్టుల భర్తీ కొనసాగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement