చేప ప్రసాదంగా కొల్లేరు కొర్రమీను Kolleru Korraminu is a fish prasadam | Sakshi
Sakshi News home page

చేప ప్రసాదంగా కొల్లేరు కొర్రమీను

Published Sat, Jun 1 2024 5:22 AM | Last Updated on Sat, Jun 1 2024 5:22 AM

Kolleru Korraminu is a fish prasadam

ఏపీ నుంచి 7 లక్షల కొర్రమీను సరఫరాకు టెండర్లు 

జూన్‌ 8న నాంపల్లిలో బత్తిన సోదరులతో చేప ప్రసాదం పంపిణీ

ఏలూరు, పశ్చిమ గోదావరి నుంచి నలుగురు సీడ్‌ ఫార్మర్ల టెండర్లు  

కైకలూరు: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలోని కొల్లేరు కొర్రమీను పిల్లలు (సీడ్‌) ఆస్తమా నివారణలో ఔషధంగా మారాయి. మృగశిరకార్తె రోజున హైదరాబాద్‌ నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదానికి కొల్లేరు ప్రాంత కొర్రమీను పిల్లలను సరఫరా కానున్నాయి. 

తెలంగాణ స్టేట్‌ ఫిషరీస్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ (టీఎస్‌ ఎఫ్‌సీఓఎఫ్‌) ఆధ్వర్యంలో చేప మందు ప్రసాదం నిమిత్తం టెండర్లను ఆహా్వనించింది. దాదాపు 5 లక్షల నుంచి 7 లక్షల వరకు కొర్రమీను పిల్ల అవసరమని గుర్తించారు. తెలంగాణ మత్స్యశాఖ అధికారులు కొర్రమీను సీడ్‌ అందించే సీడ్‌ ఫామ్‌లను పరిశీలించి నివేదికను అక్కడి ప్రభుత్వానికి అందించారు.  

తెలంగాణలో లభ్యత లేకపోవడంతో.. 
చేప ప్రసాదానికి తెలంగాణలో సరిపడినన్ని చేప పిల్లల లభ్యత లేకపోవడంతో ఏపీ నుంచి కొర్రమీను పిల్లలకు మే 21న టెండర్లు ఆహా్వనించింది. ఏపీ నుంచి కొల్లేరు ప్రాంతాలైన ఏలూరు జిల్లాలోని ముదినేపల్లి మండలం దేవపూడి ఫణిరామ్‌ ఫిష్‌ సీడ్‌ ఫామ్, ఏలూరుకు చెందిన దుర్గమల్లేశ్వర ఫిష్‌ హేచరీస్, కలిదిండి మండలం పోతుమర్రు, పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు నుంచి దుర్గ ఫిష్‌ సీడ్‌ ఫామ్‌తో పాటు తెలంగాణలోని నల్గొండ, హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు కలిపి మొత్తం ఏడుగురు టెండర్లను దాఖలు చేశారు. 

తెలంగాణకు చెందిన వనపర్తి, ఖమ్మం, హన్మకొండ, సంగారెడ్డిలకు చెందిన జిల్లా మత్స్యశాఖ అధికారులకు పర్యవేక్షణ బాధ్యతను అక్కడి ప్రభుత్వం అప్పగించింది. ఖమ్మం మత్స్యశాఖ అధికారి డి.ఆంజనేయస్వామి నేతృత్వంలో అధికారులు టెండర్లు వేసిన ఏపీలో సీడ్‌ ఫామ్‌లను పరిశీలించి ఈ నెల 25 తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక అందించారు.  

పోషకాల గని కొర్రమీను 
కొర్రమీను పిల్ల చాలా హుషారుగా ఉంటుంది. ఇది మీటరు వరకు పెరుగుతుంది. మంచినీటి సరస్సులు, పొలాల బోదెలు, బురద నేలల్లో ఇవి పెరుగుతాయి. వీటిలో 18–20 శాతం మాంసకృత్తులు ఉంటాయి. ఆకు కూరల్లో లభించే విటమిన్‌ ‘ఏ’ కంటే కొర్రమీనులో ఉండే విటమిన్‌ ‘ఏ’ తేలిగ్గా జీర్ణమవుతుంది. వీటిలో గంధకం కలిగిన లైసిన్, మిథియానిక్, సిస్టిన్‌ అమినో యాసిడ్లు లభిస్తాయి.

చేప మందుతో కొర్రమీనుకు గుర్తింపు 
ఆస్తమా, ఉబ్బసం, దమ్ము, దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు చేప ప్రసాదాన్ని హైదరాబాద్‌లో బత్తిన సోదరులు ఉచితంగా అందిస్తారు. కరోనా కారణంగా మూడేళ్లు ఆగిన ప్రసాదం పంపిణీ ఈ ఏడాది జూన్‌ 8న మృగశిరకార్తె ప్రారంభమయ్యే ఉదయం 11 నుంచి 9వ తేదీ ఉదయం 11 గంటల వరకు పంపిణీ చేయనున్నారు. 

వీరు తయారు చేసిన ప్రత్యేక మందును కొర్రమీను పిల్ల సహా నోటిలో వేస్తారు. తెలంగాణకు సరఫరా చేసే కొర్రమీను పిల్ల సైజు 2 అంగుళాల నుంచి 3 అంగుళాలు ఉండాలి. నల్ల రంగులో హుషారుగా ఉండాలి. ప్రస్తుత మార్కెట్‌లో ఒక్కో కొర్రమీను పిల్ల రూ.30 ధర పలుకుతోంది.  

పిల్ల సేకరణ ఓ సవాల్‌ 
కొర్రమీను పిల్లను సేకరించడం పెద్ద సవాల్‌గా మారుతోంది. కొల్లేరు సరస్సు, పొ­లాల గుంతల్లో కొర్రమీను తల్లి చేపను గుర్తిస్తారు. తల్లి వద్ద తిరిగే వేలల్లో పిల్లలను సేకరించి సిమెంటుతో చేసిన కుండీలలో ప్రత్యేకంగా పెంచుతారు. రోజుకు మూడు­పూటలా నీరు మారుస్తారు. నాలుగు పూటలా మేత వేస్తారు. 

తెలంగాణ వరకు వ్యాన్‌లలో అత్యంత జాగ్రత్తగా వీటిని రవాణా చేస్తారు. కొల్లేరు ప్రాంతాల నుంచి వెళ్లే వ్యాన్‌లలో పిల్లలకు మూడు ప్రాంతాల్లో నీటిని మార్పు చేస్తారు. చేప మందు ప్రసాదం నిమిత్తం జూన్‌ 6వ తేదీన ఉదయం హైదారాబాద్‌కు కొల్లేరు కొర్రమీను పిల్లల్ని తరలించనున్నారు.

కొల్లేరు ప్రాంతం అనుకూలం 
చిత్తడి నేలల ప్రాంతమైన కొల్లేరు సరస్సులో సహజసిద్ధంగా కొర్రమీను పెరుగుతుంది. నల్లజాతి చేపల్లో కొర్రమీనుకు ప్రత్యేక స్థానం ఉంది. కొల్లేరు పరీవాహక ప్రాంతా­ల నుంచి ఇతర  రాష్ట్రాలకు వీటిని సరఫరా చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొర్రమీను సాగు సైతం చేస్తున్నారు. కొర్రమీనులో పోషకాహారాలు అధికంగా ఉంటాయి. – షేక్‌ చాన్‌బాషా, ఫిషరీస్‌ ఏడీ, కైకలూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement