సంఘటితం.. సమారాధనం | Karthika vanabhojanalu Trend changing in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

సంఘటితం.. సమారాధనం

Published Sun, Nov 6 2022 4:23 AM | Last Updated on Sun, Nov 6 2022 4:23 AM

Karthika vanabhojanalu Trend changing in Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: అనుకూలమైన వనంలో బంధుమిత్రుల కలయిక. లక్ష్మీ దేవి స్వరూపంగా భావించే ఉసిరి చెట్టుకు పూజలు. అక్కడే వంటలు, ఆటలు, పాటలు, భోజనాలు.. ఓ వైపు ఆధ్యాత్మిక వాతావరణం. మరోవైపు ఆహ్లాదకరమైన సమారాధనం.. ఇదీ కార్తీక మాస వనభోజనాల ప్రత్యేకం. గతంలో ఇలా జరిగిన వన భోజనాల రూపు నేడు మారింది. ఒక కులానికి చెందిన వారంతా ఒక చోటకు చేరుతున్నారు.

రాజకీయాలు, ఆర్థిక తారతమ్యాలకు అతీతంగా వనభోజనాల్లో ఐక్యతారాగం పాడుతున్నారు. ఉత్తేజపూరిత ప్రసంగాలు చేస్తున్నారు. తమ కులస్థులు ఉన్నత స్థాయికి ఎదిగే ప్రణాళికలు వేస్తున్నారు. కుల జనోద్దరణ కోసం కార్తీక వనభోజనాలను వేదికగా చేసుకోవడం ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో దాదాపు 20 ఏళ్ల క్రితం మొదలైంది.

అది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ట్రెండ్‌గా మారింది. కులస్థులను సంఘటితం చేసే సంకల్పంతో సమారాధనలు జరుగుతున్నాయి. తమ కులంలో ఆర్థికంగా వెనుకబడిన వారికి చేయాత నిచ్చే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సమాజంలో ఎదుగుతున్న వారికి వెన్నుదన్నుగా ఎలా ఉండాలి అనే ప్రణాళికలు కూడా వేస్తున్నారు.

మునుల కాలం నుంచి..  
మాసాల్లో కార్తీకమాసానిది ప్రత్యేకం. శివకేశవులు ఆరాధన, ఉపవాస నియమాలు, పుణ్యతీర్థాల్లో స్నానాలు, ఆలయాల సందర్శనలు, వివిధ మాల ధారణలు ఇలా ఎటు చూసినా ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిస్తూ ఉంటుంది. మరో పక్క వనభోజనాల సందడి కనిపిస్తూ ఉంటుంది.  కార్తీక పౌర్ణమి రోజునే నైమిశారణ్యంలో సూత మహర్షి ఆధ్వర్యంలో మునులంతా వనభోజనాలు ఏర్పాటు చేసుకున్నట్లు ‘కార్తీక పురాణం’లో ప్రస్తావించారు. భారతీయ సంప్రదాయంలో  వనవిహారానికి ప్రాముఖ్యత ఉంది. ఆయుర్వేదంలో ఉసరికి ప్రత్యేక స్థానం ఉంది. ఇలా అన్నీ కలసిన కార్తీకం మానసిక ఉల్లాసాన్నిస్తుంది.  

స్థానికంగా కుల సమారాధన.. 
రాష్ట్రంలో ప్రధానంగా కాపు, రెడ్డి, గౌడ–శెట్టిబలిజ, యాదవ, వైశ్య, కమ్మ, క్షత్రియ తదితర కులాల వారీగా సామాజిక వన భోజనాల సందడి కొనసాగుతోంది. ఉద్యోగులు, వ్యాపారులకు విరామం దొరికే ఆదివారం అయితే మరింత జోరుగా జరుగుతుంది. ఈ ఏడాది కార్తీకమాసం తొలి ఆదివారం రాజమండ్రిలో నిర్వహించిన గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత కుల సమారాధనకు పార్టీలకు అతీతంగా పలువులు నేతలు హాజరయ్యారు.

గత ఆదివారం భీమవరంలో నిర్వహించిన ఆర్యవైశ్య సమ్మేళనంలో ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు నేతలు పాల్గొని సంఘీభావం తెలిపారు. సింగపూర్‌లోని ఆర్యవైశ్యులు సైతం అక్కడి కూర్మ ద్వీపంలో (కుసు ఐలాండ్‌) కార్తీక వనభోజనాలను నిర్వహించుకోవడం విశేషం. చీమకుర్తి మండలం రామతీర్థంలోని మోక్ష రామలింగేశ్వరస్వామి దేవస్థానం వద్ద యోగి వేమన రెడ్ల సత్రంలో ఈ నెల 14న కార్తీక వన భోజనాలను నిర్వహించనున్నారు.

రాయలసీమ ప్రాంతంలో రెడ్లు, కురుబ, యాదవ, బలిజ, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో కమ్మ, కాపు, గౌడ కులాలు, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో శెట్టిబలిజ–గౌడ, ఆర్యవైశ్య, క్షత్రియ, ఉత్తరాంధ్రలో తూర్పుకాపు, నగరాలు, కాళింగ తదితర కులాల వారీగా వన సమారాధనలు ఏర్పాటు చేసుకుంటున్నారు.  

ట్రెండ్‌ మారింది.. సంఘటిత శక్తి చాటుతోంది 
గతంలో ఆధ్యాత్మిక కార్యక్రమంగా బంధు మిత్రుల సమక్షంలో కార్తీక వన భోజనాలు నిర్వహించేవారు. ఆ తర్వాత ఆ వేదికలను సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు ఉపయోగించుకున్నారు. మరింత సామాజిక స్పృహ పెరిగి సొంత కులంలో ఆర్థికంగా దెబ్బతిన్న వారిని ఆదుకోవడానికి, విద్యా, వైద్యానికి సాయమందించడానికి కార్తీక వన సమారాధనలను వేదికగా చేసేవారు. క్రమంగా సామాజిక సంఘటిత శక్తిని చాటేందుకు ఉపయోగించుకోవడంతో పాటు రాజకీయంగా రాణించేందుకు దిశానిర్దేశం చేసేలా వన సమారాధనలు మారాయి.  
– పాకా వెంకట సత్యనారాయణ, కన్వీనర్, బీసీ కులాల సమాఖ్య

పుణ్యం.. పురుషార్థం 
రాష్ట్రంలో కార్తీక సమారాధనలో పూజలతో పుణ్యం వస్తుంది. బంధు మిత్రులు ఒకే చోట కలుసుకుని సాధకబాధకాలు చర్చించుకుని, ఐక్యంగా పరిష్కారాలు కనుగొని ముందుకు సాగేందుకు చేసే ప్రయత్నాలతో పురుషార్థం నెరవేరుతుంది. రాష్ట్రంలో చాలా కాలంగా అనేక విధాలుగా కాపులు వన సమారాధనలు నిర్వహించి కులస్థుల్లో ఉత్సాహం నింపుతున్నారు. విహారయాత్రలు, వన సమారాధనలు నిర్వహిస్తున్నారు. అన్ని రంగాల్లోను రాణించేలా సంఘీయులు దిశానిర్దేశం చేస్తుంటారు.  
– చినమిల్లి వెంకట్రాయుడు, కాపు సంక్షేమ సంఘం అధ్యక్షుడు, పశ్చిమగోదావరి జిల్లా

సంఘటితం.. చైతన్యం 
వెనుకబడిన తరగతులకు చెందిన గౌడ, శెట్టిబలిజ, ఈడిగ, శ్రీశయన, యాత వంటి గీత కులాల వారు ఒకే సామాజికవర్గంగా ఉన్నారు. వీరంతా మరింత సంఘటితమై చైతన్యవంతంగా ముందుకు సాగేందుకు ఎన్నో ఏళ్ల నుంచి కార్తీక వనభోజనాలను నిర్వహిస్తున్నారు. సమాజంలో వారిని వారు రక్షించుకునేందుకు మొదలైన సంఘటిత నిర్మాణం.. కార్తీక వన సమారాధనలతో మరింత చైతన్యవంతమైంది.  
–వేండ్ర వెంకటస్వామి, గౌడ–శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు, పశ్చిమగోదావరి జిల్లా.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement