ISRO: మరో ప్రయోగానికి ఇస్రో రెడీ.. | ISRO To Launch SSLV On 7th August | Sakshi
Sakshi News home page

ISRO: మరో ప్రయోగానికి ఇస్రో రెడీ..

Published Sat, Aug 6 2022 8:39 AM | Last Updated on Sat, Aug 6 2022 2:33 PM

ISRO To Launch SSLV On 7th August - Sakshi

సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూళ్లూరుపేటలోని సతీష్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 9.18 గంటలకు స్మాల్‌ శాటిలైట్‌ లాంచింగ్‌ వెహికల్‌(ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1)ను ప్రయోగించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ప్రయోగాన్ని 13.2 నిమిషాల్లోనే పూర్తి చేయనున్నారు. శనివారం ఉదయం 11 గంటలకు మిషన్‌ సంసిద్ధత సమావేశం నిర్వహించి ప్రయోగ తేదీని అధికారికంగా ప్రకటిస్తారు. ల్యాబ్‌ చైర్మన్‌ ఆర్ముగం రాజరాజన్‌ ఆధ్వర్యంలో రాకెట్‌కు తుది విడత తనిఖీలు నిర్వహించి ప్రయోగానికి 7 గంటల ముందు.. అంటే ఆదివారం రాత్రి 2.18 గంటలకు కౌంట్‌డౌన్‌ను ప్రారంభిస్తారు. ప్రయోగంలోని మూడు దశలను ఘన ఇంధనం సాయంతో నిర్వహించనున్నారు.
చదవండి: టీచర్లకు గుడ్‌న్యూస్‌.. ప్రమోషన్లకు విద్యాశాఖ గ్రీన్‌సిగ్నల్‌!

సమాచారం ఎప్పటికప్పుడు చేరవేసేలా..
చిన్నచిన్న ఉపగ్రహాలతో అంతరిక్షంలోకి దూసుకెళ్లేలా ఎస్‌ఎస్‌ఎల్‌వీ డీ1ను ఇస్రో రూపొందించింది. 34 మీటర్ల పొడవు, రెండు మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువు ఉండే ఈ రాకెట్‌ ద్వారా రెండు ఉపగ్రహాలను రోదసీలోకి పంపిస్తున్నారు. ఇందులో దేశ అవసరాలకు సంబంధించిన 135 కేజీల మైక్రోశాట్‌–2ఏ(ఎర్త్‌ అబ్జర్వేషన్‌ శాటిలైట్‌) ఉపగ్రహంతో పాటు దేశంలోని 75 జిల్లా పరిషత్‌ హైస్కూల్స్‌కు చెందిన 750 మంది గ్రామీణ విద్యార్థినులు తయారు చేసిన ‘ఆజాదీ శాట్‌’ను ప్రయోగిస్తున్నారు.

8 కిలోల ఆజాదీశాట్‌ ఉపగ్రహం 

ఇస్రో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన భూ పరిశీలన ఉపగ్రహమే మైక్రోశాట్‌ 2ఏ. అధిక రిజల్యూషన్‌తో కూడిన ప్రయోగాత్మక ఆప్టికల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ ఉపగ్రహం ఇది. ఈ ఉపగ్రహం భూమికి తక్కువ ఎత్తులో ఉండి అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో భూమి మీద ఉన్న వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసి సమాచారాన్ని చేరవేస్తుంటుంది.

విద్యార్థినులు తీర్చిదిద్దిన బుల్లి ఉపగ్రహం.. 
బుల్లి ఉపగ్రహమైన ఆజాదీ శాట్‌ బరువు 8 కేజీలు. ఇందులో 75 పే లోడ్స్‌ను ఏకీకృతం చేశారు. ఉష్ణోగ్రత సెన్సార్లు, రేడియేషన్‌ కౌంటర్లు, సోలార్‌ ప్యానల్‌ సహాయంతో ఫొటోలు తీయడానికి సెల్ఫీ కెమెరాలు, దీర్ఘ శ్రేణి కమ్యూనికేషన్‌ ట్రాన్స్‌పాండర్లు అమర్చారు. ఈ ఉపగ్రహం 6 నెలలు మాత్రమే సేవలందిస్తుంది. ఈ ఏడాదిని ‘అంతరిక్షంలో అతివ’గా పరిగణిస్తున్న నేపథ్యంలో ‘సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ–ఇంజనీరింగ్‌ మ్యాథమేటిక్స్‌’లో మహిళలను ప్రోత్సహించేందుకు దీనిని మొదటి అంతరిక్ష మిషన్‌గా ప్రయోగిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు రిఫాత్‌ షరూక్‌ అనే మహిళ చీఫ్‌ టెక్నాలజీ ఆఫీసర్‌గా విద్యార్థులతో ఈ ఉపగ్రహాన్ని తయారు చేయించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement