ఏపీ గ్రిడ్‌తో ‘సెంబ్‌కార్ప్‌’ అనుసంధానం | Integration of Sembcorp with AP Grid | Sakshi
Sakshi News home page

ఏపీ గ్రిడ్‌తో ‘సెంబ్‌కార్ప్‌’ అనుసంధానం

Published Wed, Jan 24 2024 5:11 AM | Last Updated on Wed, Jan 24 2024 5:11 AM

Integration of Sembcorp with AP Grid - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ వృథాకు అడ్డుకట్ట వేయ­డంతోపాటు విద్యుత్‌ ఆదా చేయడం ద్వారా వినియోగదారులపై భారం తగ్గించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచన మేరకు ఏపీ ట్రాన్స్‌కో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సెంబ్‌కార్ప్‌ థర్మల్‌ విద్యుత్‌ కేంద్రానికి ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ నిర్మా­ణణం చేపట్టింది.

5 కిలోమీటర్ల పొడవున ఈ లైన్‌  పూర్తికావడంతో మంగళవారం ఏపీట్రాన్స్‌కో అధికారులు సెంబ్‌­కార్ప్‌ థర్మల్‌ ప్లాంటు లైన్‌ను పవర్‌గ్రిడ్‌ లైన్‌ నుంచి తప్పించి ఏపీగ్రిడ్‌ లైన్‌కు అనుసంధానం చేశారు. దీంతో పవర్‌గ్రిడ్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్లతో సంబంధం లేకుండా నేరుగా ఏపీట్రాన్స్‌కో ట్రాన్స్‌మిషన్‌ లైన్ల ద్వారా ఏపీ గ్రిడ్‌కు, అక్క­డ నుంచి డిస్కంలకు విద్యుత్‌ సరఫరా అవుతోంది. 

ఏడాదికి రూ.365  కోట్లు ఆదా 
విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం (పీపీఏ)లో భాగంగా సెంబ్‌కార్ప్‌ ఎనర్జీ ఇండియా లిమిటెడ్‌ (ఎస్‌ఈఐఎల్‌)కు చెందిన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని థర్మల్‌ పవర్‌ ప్లాంటు నుంచి రాష్ట్రంలోని విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటి వరకూ ఈ ప్లాంటు నుంచి పవర్‌గ్రిడ్‌కు చెందిన ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ ద్వారా ఏపీ ఏపీట్రాన్స్‌కోకు చెందిన రాష్ట్ర గ్రిడ్‌కు, అక్కడి నుంచి డిస్కమ్‌లకు విద్యుత్‌ సరఫరా అవుతోంది.

పవర్‌గ్రిడ్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్‌ వినియోగించుకున్నందుకు ఆ సంస్థకు యూనిట్‌కు రూ.0.72 పైసలు చొప్పున ఏపీ ట్రాన్స్‌కో చెల్లిస్తోంది. అంటే రోజుకు సగటున రూ.కోటి పవర్‌గ్రిడ్‌కు ట్రాన్స్‌కో ఇవ్వాల్సి వస్తోంది. సెంబ్‌కార్ప్‌ థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌తో ఏపీ గ్రిడ్‌ను నేరుగా అనుసంధానం చేయడంవల్ల ఈ ఖర్చు ఆదా కానుంది. రోజుకు 15  మిలియన్‌ యూనిట్ల చొప్పున ఏడాదికి సుమారు 5,475  మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ‘సెంబ్‌కార్ప్‌’ నుంచి రాష్ట్ర గ్రిడ్‌కు సరఫరా అవుతోంది. 

శుభపరిణామం: మంత్రి పెద్దిరెడ్డి
తక్కువ సమయంలోనే ఈ లైన్‌ నిర్మాణం పూర్తిచేసి సెంబ్‌కార్ప్‌ను నేరుగా ఏపీ గ్రిడ్‌కు అనుసంధానం చేయడం రాష్ట్రానికి ఎంతో మేలు చేకూర్చే పరిణామమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంతోషం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement