రఘువీర్‌కు ‘వినూత్న రైతు’ అవార్డు Innovative Farmer Award to Raghuveer | Sakshi
Sakshi News home page

రఘువీర్‌కు ‘వినూత్న రైతు’ అవార్డు

Published Fri, Jun 7 2024 5:44 AM | Last Updated on Fri, Jun 7 2024 5:44 AM

Innovative Farmer Award to Raghuveer

న్యూఢిల్లీలో జరిగిన జాతీయ కేవీకే మేళాలో అవార్డు ప్రదానం 

సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన అభ్యుదయ యువరైతు నందం రఘువీర్‌కు భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ(ఐఏఆర్‌ఐ) వినూత్న రైతు అవార్డు–2024ను అందజేసింది. న్యూఢిల్లీలో గురువారం జరిగిన జాతీయ కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకే) మేళాలో ఐఏఆర్‌ఐ డైరెక్టర్‌ కమ్‌ వైస్‌ చాన్సలర్‌ డాక్టర్‌ ఏకే సింగ్‌ ఈ అవార్డును రఘువీర్‌కు ప్రదానం చేశారు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డును ఆంధ్రప్రదేశ్‌ నుంచి అందుకున్న ఏకైక ఆదర్శ రైతుగా రఘువీర్‌ నిలిచారు.

 అంతరించిపోతున్న పురాతన ధాన్యపు సిరులను సంరక్షించి భవిష్యత్‌ తరాలకు అందించాలన్న సంకల్పంతో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలి దేశవ్యాప్తంగా పర్యటించి 257 రకాల పురాతన వరి విత్తనాలను సేకరించారు. వీటిలో 10కి పైగా జీఐ ట్యాగ్‌ కలిగిన వంగడాలు కూడా ఉన్నాయి. పెనమలూరులో తనకున్న కొద్దిపాటి వ్యవసాయ భూమిలో తాను సేకరించిన పురాతన విత్తనాలతో విత్తన సంరక్షణ చేస్తున్నారు. ఎనిమిది జిల్లాల్లో విత్తన నిధులను ఏర్పాటు చేశారు. 

ఏజెన్సీ ప్రాంతమైన పెదబయలు మండలంలో పురాతన దేశీ విత్తన నిధిని ఏర్పాటుచేశారు. గిరిజన రైతులకు పురాతన వంగడాలను ఉచితంగా అందిస్తూ వాటి పునరుత్పత్తికి కృషిచేస్తున్నారు. రఘువీర్‌ గత ఏడాది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ మొక్కల జన్యురక్షకుని అవార్డు, మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు చేతుల మీదుగా జాతీయ ఉత్తమ రైతు అవార్డులతోపాటు మిజోరాం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి 2022లో ఉత్తమ రైతు అవార్డులను అందుకున్నారు. 

అంతరించిపోతున్న పురాతన విత్తనాలను సంరక్షించి భవిష్యత్‌ తరాలకు అందించడమే లక్ష్యంగా తాను ముందుకువెళుతున్నానని రఘువీర్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఐఏఐఆర్‌ నుంచి వినూత్న రైతు అవార్డు అందుకోవడం తనకు లభించిన అరుదైన గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement