చైనా గ్యాంగ్‌ చెరలో భారతీయులు | Human Trafficking In The Name Of Jobs, China's Gang Is Committing Cyber Crimes By Force | Sakshi
Sakshi News home page

చైనా గ్యాంగ్‌ చెరలో భారతీయులు

Published Wed, May 22 2024 4:56 AM | Last Updated on Wed, May 22 2024 12:13 PM

Human trafficking in the name of jobs

ఒక్క ఏపీ నుంచే 150 మంది 

ఉద్యోగాల పేరుతో విదేశాలకు మానవ అక్రమ రవాణా

బలవంతంగా సైబర్‌ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌

కంబోడియాలో భారతీయుల తిరుగుబాటు

ఈ రాకెట్‌ను బయటపెట్టిన విశాఖ పోలీసులు

తిరుగుబాటుదారులను అరెస్టు చేసిన అక్కడి పోలీసులు

జైలులో ఉన్న వారిని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నాలు

బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు

విశాఖ సిటీ: విదేశీ ఉద్యోగాలంటూ కోటి ఆశలతో కంబోడియా వెళ్లిన భారతీయులు మోసపోయారు. కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగమని తీసుకువెళ్లి అక్కడ బలవంతంగా సైబర్‌ నేరాలు చేయిస్తున్న చైనా గ్యాంగ్‌పై సోమవారం తిరుగుబాటు చేసిన బాధితులు జైలు పాలయ్యారు. నిర్వాహకులు తమను చిత్ర హింసలకు గురి చేస్తున్నారని కొంత మంది బాధితులు విశాఖ పోలీసులకు మంగళవారం వాట్సాప్‌తో పాటు ‘ఎక్స్‌’ ద్వారా వీడియో సందేశాలు పంపించారు.

దీంతో బాధితులను తీసుకువచ్చేందుకు విశాఖ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ ఎ.రవిశంకర్‌ ప్రత్యేక దృష్టి సారించారు. ఈ విషయాన్ని బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. ఉద్యోగాల పేరుతో విదేశాలకు మానవ అక్రమ రవాణా రాకెట్‌ గుట్టు విశాఖ పోలీసులు మూడు రోజుల కిందట బట్టబయలు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గాజువాక ప్రాంతానికి చెందిన ముగ్గురు ఏజెంట్లను అదుపులోకి తీసుకొని విచారించగా విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 

ఉద్యోగాల పేరుతో మానవ అక్రమ రవాణా
విదేశాల్లో కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగాలు అంటూ గాజువాకకు చెందిన చుట్టా రాజేష్‌ విజయ్‌కుమార్‌ సోషల్‌ మీడియాలో ప్రకటనలు ఇచ్చాడు. అది నిజమని నమ్మి విశాఖ నుంచే కాకుండా రాష్ట్రంలో సుమారు 150 మంది నిరుద్యోగులు రూ.1.5 లక్షలు చొప్పున చెల్లించారు. వారిని బ్యాంకాక్, సింగపూర్‌ల మీదుగా కంబోడియాకు పంపించారు. అక్కడ మరో గ్యాంగ్‌ బాధితులను రిసీవ్‌ చేసుకొని కంబోడియాలో పాయిపేట్‌ వీసా సెంటర్‌కు తీసుకెళ్లింది. ఓ నెలకు టూరిస్ట్‌ వీసా చేయించి ఆ గ్యాంగ్‌ చైనా ముఠాకు విక్రయించింది. నిరుద్యోగుల నైపుణ్యం ఆధారంగా వారిని రూ.2,500 నుంచి రూ.4వేల అమెరికన్‌ డాలర్లకు చైనా కంపెనీలకు అమ్మేశారు. 

సైబర్‌ నేరాలు చేయాలంటూ బలవంతం
చైనా ముఠా నిరుద్యోగులకు టైపింగ్‌తో పాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ను పరీక్షించింది. తర్వాత టూరిస్ట్‌ వీసాను బిజినెస్‌ వీసాగా మార్చింది. కంప్యూటర్‌ ఆపరేటర్‌ ఉద్యోగం కోసం ఏడాది పాటు పనిచేసేలా అగ్రిమెంట్‌ రాయించుకుంది. మధ్యలో వెళ్లిపోతే 400 డాలర్లు చెల్లించాలని ఒప్పందం చేయించుకుని పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకుంది. ఒప్పందం అనంతరం వారిని కంబోడియాలోనే ఒక చీకటి గదిలో బంధించారు. ఫెడెక్స్, టాస్క్‌గేమ్స్, ట్రేడింగ్‌తో పాటు ఇతర సైబర్‌ నేరాలు చేయాలని బలవంతం చేశారు.

అలా చేయని వారికి ఆహారం పెట్టకుండా చిత్ర హింసలకు గురి చేశారు. ఎలా చేయాలో వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. సైబర్‌ నేరాలు చేసిన వారికి వచ్చిన డబ్బులో ఒక శాతం కమీషన్‌గా ఇస్తూ.. 99 శాతం చైనా గ్యాంగ్‌ దోచుకొనేది. వీరు అక్కడ ఉత్సాహంగా పనిచేసేందుకు అదే కాంపౌండ్‌లో పలు రకాల ఎంటర్‌టైన్‌మెంట్లు పబ్, క్యాసినో గేమ్స్, మద్యపానం, జూదంతో పాటు వ్యభిచారం సదుపాయాలు కల్పించారు.

ఒక వ్యక్తి ఫిర్యాదుతో
అక్కడ పని చేసి చైనా వారి చెర నుంచి తప్పించుకున్న నగరానికి చెందిన బొత్స శంకర్‌ అనే వ్యక్తి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సైబర్‌ నేరాలతో పాటు మానవ అక్రమ రవాణా వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకువచ్చారు. రాకెట్‌కు ప్రధాన ఏజెంట్‌ అయిన చుక్క రాజేష్‌తో పాటు అదే ప్రాంతానికి చెందిన సబ్‌ ఏజెంట్లు సబ్బవరపు కొండలరావు, మన్నేన జ్ఞానేశ్వరరావులను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో అనేక వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. చైనా ముఠా చెరలో సుమారు 5 వేల మంది భారతీయులు ఉన్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఒక్క ఆంధ్రప్రదేశ్‌ నుంచే 150 మంది చైనా గ్యాంగ్‌ ఆధీనంలో ఉన్నట్లు గుర్తించారు.

బాధితుల తిరుగుబాటు.. అరెస్టు
కంబోడియాలో చైనా గ్యాంగ్‌ హింసలను భరించలేని బాధితులు అక్కడి పరిస్థితులను వివరిస్తూ విశాఖ పోలీసులకు వీడియోలు పంపించా­రు. అలాగే చైనా ముఠాకు వ్యతిరేకంగా మంగళవారం సుమారు 300 మంది బాధితులు కంబోడి­యాని సైబర్‌ క్రైమ్‌ ఫ్రాడ్‌ ఫ్యాక్టరీల హబ్‌ అయిన సిహనౌక్‌విల్‌లోని జిన్‌బీ కాంపౌండ్‌లో తిరు­గుబాటు చేశారు. తమను వెంటనే భారత్‌కు పంపించాలని డిమాండ్‌ చేశారు. దీంతో వీరిని అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై విశాఖ సీపీ ఎ.రవిశంకర్‌ ప్రత్యే­క దృష్టి సారించారు. ఈ వ్యవహారాన్ని బ్యూరో ఆఫ్‌ ఇమిగ్రేషన్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వీరిని బయటకు తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నారు.

ఏడు ప్రత్యేక బృందాలు ఏర్పాటు
ఈ కేసుని లోతుగా దర్యాప్తు చేయాలని సీపీ రవిశంకర్‌ ఆదేశాలు జారీ చేశారు. దీంతో జాయింట్‌ కమిషనర్‌ ఫకీరప్ప సారథ్యంలో సైబర్‌ క్రైమ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.భవానీప్రసాద్, సిబ్బందితో ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మానవ అక్రమ రవాణా రాకెట్‌ను వెలికితీసేందుకు విస్తృతంగా పనిచేస్తున్నాయి. విశాఖకు చెందిన బాధితులు, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయం కోసం సైబర్‌ క్రైమ్‌ సీఐ 94906 17917, సీపీ వాట్సాప్‌ నెంబర్‌ 94933 36633, కంట్రోల్‌ రూమ్‌ నెంబర్‌ 0891–2565454 సంప్రదించాలని సీపీ సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement