‘స్కిల్‌’ విచారణ సీబీఐకి! High Court received Undavalli Arun Kumar Petition on Chandrababu Skill Development Scam | Sakshi
Sakshi News home page

‘స్కిల్‌’ విచారణ సీబీఐకి!

Published Sat, Oct 14 2023 5:21 AM | Last Updated on Sat, Oct 14 2023 11:29 AM

High Court received Undavalli Arun Kumar Petition on Chandrababu Skill Development Scam - Sakshi

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం తీవ్రత దృష్ట్యా ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యంపై (పిల్‌) హైకోర్టు స్పందించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీఐడీలతో పాటు స్కిల్‌ కుంభకోణంలో కీలక నిందితులైన మాజీ సీఎం చంద్రబాబు, అచ్చె­న్నా­యుడు, అప్పటి అధికారులు గంటా సు­బ్బా­రావు, డాక్టర్‌ కె.లక్ష్మీ­నారా­యణ, నిమ్మగడ్డ వెంకట కృష్ణ ప్రసాద్, డిజైన్‌టెక్‌ ఎండీ వికాస్‌ వినయ్‌ కన్వీల్కర్, సీమెన్స్‌ మాజీ ఎండీ సుమన్‌ బోస్, సంజయ్‌ డాగా, ఐఏఎస్‌ అధి­కారిణి అపర్ణ ఉపాధ్యాయ సహా 44 మందికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్‌ 10కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూ­ర్తులు జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాద­రావు, జస్టిస్‌ ఏవీ రవీంద్రబాబు ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రజా ప్రయోజనాల దృష్ట్యా సీబీఐకి... 
ఉండవల్లి తరఫున సీనియర్‌ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వాదనలు వినిపిస్తూ, ఈ కేసులో రూ.371 కోట్ల ప్రజాధనం ముడిపడి ఉంద­న్నారు. గత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులంద­రూ ఇందులో నిందితులుగా ఉన్నారని, ప్రజా­ప్రయోజనాల కోసం, సమర్థమైన దర్యాప్తు కోసం కేసును సీబీఐకి బదిలీ చేయా­లని కోరారు. దీనికి ధర్మాసనం స్పంది­స్తూ ఈ కేసుతో మీకు సంబంధమేంటని ప్రశ్నిం­చింది. మాజీ ఎంపీ అయిన పిటిష­న­ర్‌కు ఇపుడు ఏ పార్టీతోనూ సంబంధం లేదని, రాష్ట్ర విభ­జనపైన, పోలవరం విషయంలో కేంద్రం ఇవ్వాల్సిన నిధులపై వ్యాజ్యాలు వేసి న్యాయ­పోరాటం చేస్తున్నారని కృష్ణమూర్తి తెలిపారు.

సీబీఐ దర్యాప్తును అప్పుడే కోరాం...
తరువాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు విని­పిస్తూ ‘ఈ కుంభకోణంలో వేరువేరు రాష్ట్రాల్లో డబ్బులు భారీగా చేతులు మారాయి. రాజ­కీయ పార్టీలకూ సంబంధం ఉన్నట్లు దర్యా­ప్తులో వెల్లడైంది. వాస్తవానికి కేబినెట్‌ సబ్‌కమిటీ సిఫారసుల ఆధారంగా 2020లోనే ఈ వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) చేత విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కానీ సిట్‌ను వ్యతిరేకిస్తూ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఆ సందర్భంగా... కేంద్రాన్ని దీన్లో చేర్చాలని రాష్ట్రం కోరింది. దర్యాప్తును సీబీఐకి అప్పగించడానికి స్వచ్ఛందంగా అంగీకరించింది.

కానీ సిట్‌కు సంబంధించి తదు­పరి ప్రొసీడింగ్స్‌ అన్నిటిపైనా స్టే ఇస్తూ... ఇంప్లీడ్‌ అప్లికేషన్‌ను హైకోర్టు డిస్మిస్‌ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. హైకో­ర్టు తీర్పును సుప్రీంకోర్టు పక్కనబెట్టింది. కేంద్రాన్ని సుమోటోగా ఇంప్లీడ్‌ చేసి... కేసును మళ్లీ హైకోర్టుకు పంపింది. మళ్లీ విచారించాలని, రాష్ట్ర అభ్యర్థన మేరకు కేంద్రం కౌంటర్‌ గనక అఫిడవిట్‌ వేస్తే... దాన్ని కూడా విచారించాలని పేర్కొంది’’ అని వివరించారు. తద్వారా సిట్‌ చూస్తున్న వ్యవహారాలను సీబీఐకి బదలాయించడానికి రాష్ట్ర ప్రభుత్వా­నికి ఎలాంటి అభ్యంతరం లేదనేది తేట­తెల్ల­మవుతోందని, అందుకే ఆ రెండు పిటిషన్లలో ఇంప్లీడ్‌ అప్లికేషన్లు వేసిందని వివరించారు.

దాడుల హెచ్చరికలు సరికాదు...
నిందితుడు చంద్రబాబు తరఫు లాయర్లు వ్యవహరిస్తున్న తీరును ఏజీ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ‘‘నిందితుడి తరఫున వివిధ కోర్టుల్లో హాజర­వుతున్న లాయర్లు ప్రభుత్వ న్యాయాధికారుల్ని బెదిరిస్తున్నారు. భౌతికంగా దాడులు చేస్తామ­ని హెచ్చరిస్తున్నారు. వాస్తవా­నికి న్యాయాధికా­రులు తమ బాధ్యతల్ని చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నారు. అది వారి విధి. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినంత వరకూ ఈ రిట్‌ పిటిషన్లో, దర్యాప్తులో ఎలాంటి రాజకీయ కోణమూ లేదు’’ అని వివరించారు. దీంతో కోర్టు వివిధ పక్షాలకు నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement