నవ ప్రపంచాన్ని నిర్మించే శక్తి యువత సొంతం | Governor at the ANU graduation ceremony | Sakshi
Sakshi News home page

నవ ప్రపంచాన్ని నిర్మించే శక్తి యువత సొంతం

Published Wed, Aug 30 2023 3:32 AM | Last Updated on Wed, Aug 30 2023 3:32 AM

Governor at the ANU graduation ceremony - Sakshi

ఏఎన్‌యూ: సాంకేతికతను సద్వినియోగం చేసుకుని నవ ప్రపంచాన్ని నిర్మించే శక్తి యువతకు ఉందని గవర్నర్‌ జస్టిస్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ 39, 40వ స్నాతకోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ చాన్సలర్‌ హోదాలో పాల్గొన్న గవర్నర్‌ సందేశం ఇస్తూ మానవాళి ప్రయోజనాలు పరిరక్షించే నూతన ఆవిష్కరణలకు యువత కృషిచేయాలని సూచించారు. చదువు, సాంకేతిక పరిజ్ఞానంతోపాటు నైతికత, సామాజిక బాధ్యత కూడా ముఖ్యమని చెప్పారు.

యువత నేర్చుకునే సాంకేతిక, నైపుణ్యం కేవలం తమ సొంతానికి మాత్రమే కాకుండా సమాజ హితం కోసం వాడాలని సూచించారు. ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లు, సంక్షోభాలకు పరిష్కారం చూపే వైవిధ్యభరితమైన ఆవిష్కరణలు చేయడంతోపాటు వాటి ద్వారా అపారమైన అవకాశాలు సృష్టించాలని సూచించారు. ప్రపంచానికి స్టార్టప్‌ హబ్‌గా భారత్‌ నిలిచిందని, ఇది మంచి పరిణామమన్నారు. యువత పారిశ్రామికవేత్తలుగా ఎదిగితే నిరుద్యోగంతోపాటు అనేక సమస్యలను పరిష్కరించవచ్చన్నారు.

కృత్రిమ మేధస్సు వినియోగం నుంచి బయోటెక్నాలజీ వరకు ప్రతి అంశం మానవాళికి ప్రయోజనం కలిగించేదిగా ఉండాలన్నారు. యూనివర్సిటీ వీసీ ఆచార్య పి.రాజశేఖర్‌ ఏఎన్‌యూ అభివృద్ధి నివేదికను సమర్పించారు. అనంతరం ప్రముఖ సంపాదకుడు పాలగుమ్మి సాయినాథ్‌కు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. పలువురు విద్యార్థులకు పీహెచ్‌డీలు, బంగారు పతకాలు, డిగ్రీ పట్టాలు అందించారు. 

అడిషనల్‌ డీజీ రవిశంకర్‌కు డాక్టరేట్‌  
ఆంధ్రప్రదేశ్‌ లా అండ్‌ ఆర్డర్‌ అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యన్నార్‌కు డాక్టరేట్‌ పట్టాను గవర్నర్, వీసీ అందించారు. ఏఎన్‌యూ కామర్స్‌ విభాగంలో ఆచార్య జీఎన్‌ బ్రహా్మనందం పర్యవేక్షణలో రవిశంకర్‌ అయ్యన్నార్‌ పీహెచ్‌డీ పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి, ఏఎన్‌యూ రెక్టార్‌ ఆచార్య రాజశేఖర్, రిజిస్ట్రార్‌ ఆచార్య బి.కరుణ, పలువురు డీన్‌లు, ప్రిన్సిపాల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు.

వ్యవసాయ రంగ సమస్యలపై అధ్యయనం చేసిన తొలి రాష్ట్రం ఏపీ : సాయినాథ్‌
వ్యవసాయ రంగంలో సంక్షోభం, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని ప్రముఖ సంపాదకుడు పాలగుమ్మి సాయినాథ్‌ చెప్పారు. ఏఎన్‌యూ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం, రైతుల సమస్యలపై తాను 2001–2002 కాలంలో అధ్యయనం చేశానని చెప్పారు.

2006లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి రాష్ట్రంలో వ్యవసాయ రంగ సంక్షోభంపై అధ్యయనానికి ప్రత్యేకంగా కమిటీని నియమించారని తెలిపారు. ఈ కమిటీ సుదీర్ఘకాలంగా రాష్ట్రంలో వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి నిశితంగా అధ్యయనం చేసిందని పేర్కొన్నారు.

తన సొంత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు ప్రాంతాల్లో వ్యవసాయ రంగ సమస్యలు, వాస్త­వ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేశానని తెలిపారు. ఆ సేవలకు దక్కిన గౌరవంగా ఈ డాక్టరేట్‌ను భావిస్తానని సాయినాథ్‌ తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement