అదనపు ఆదాయం కావాలా?.. అయితే ఇలా చేయండి.. Farmers Benefit From Intercropping | Sakshi
Sakshi News home page

అదనపు ఆదాయం కావాలా?.. అయితే ఇలా చేయండి..

Published Sat, Feb 11 2023 7:28 PM | Last Updated on Sat, Feb 11 2023 7:41 PM

Farmers Benefit From Intercropping - Sakshi

పలమనేరు(చిత్తూరు జిల్లా): సాధారణంగా రైతులు ఓ పంట కాలంలో ఒక పంటను మాత్రమే సాగుచేయడం సాధారణం. కానీ ఏక కాలంలో ఒకే భూమిలో రెండు మూడు పంటలను సాగుచేయడంపై రైతులు ఆసక్తి చూపుతున్నారు. అంతర పంటల సాగుతో ఓ పంటలో నష్టం వచ్చినా మరోపంట రైతును ఆదుకుంటోంది. దీంతోపాటు అదనపు ఆదాయం వస్తోంది. మామిడి తోటలున్న రైతులు ఏడాదికోమారు తోట ను విక్రయించి ఆదాయం పొందేవారు. ఇప్పుడు రైతులు కాస్త విభిన్నంగా ఆలోచిస్తున్నారు. మామిడి తోటలోనే ఏడాదికి మూడు రకాల పంటలను పండిస్తూ ఏడాదికొచ్చే మామిడి ఆదాయంతో పాటు అంతకు మూడు రెట్ల ఆదాయాన్ని గడిస్తున్నారు.

మామిడి రైతులకెంతో మేలు  
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి విస్తీర్ణం 2.60 లక్షల ఎకరాలుగా ఉంది. ఇందులో నీటి సౌకర్యం ఉన్న తోటలు 80వేల ఎకరాలు. గత మూడేళ్లుగా మామిడి తోటల్లో ఇతర పంటల సాగు క్రమేణా విస్తరిస్తోంది. ప్రస్తుతం 40 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగుచేస్తున్నట్టు ఉద్యానవన శాఖ తెలిపింది. ఏటా మామిడి ఫలసాయంతోపాటు అంతరపంటల కారణంగా రెట్టింపు ఆదాయం గ్యారెంటీగా దక్కుతుంది. రైతులు మామిడిలో అంతర పంటలుగా బీన్సు, టమాటా, వంగ, బెండ, పసుపు, మిరప లాంటి అంతరపంటలను పండిస్తున్నారు. అలసంద, జీనుగ, పెసర, మునగతో పాటు తక్కువ వ్యవధి పంటలైన ఆకుకూరలను  సాగుచేస్తున్నారు.
చదవండి: కడుపులో మంట వస్తుందా?.. లైట్‌ తీసుకోవద్దు.. షాకింగ్‌ విషయాలు 

సాగవుతున్న అంతరపంటలు 
బొప్పాయి తోటలో బీన్సు, కొత్తిమీర, ధనియాలు, వెల్లుల్లి, మిరపలో అరటి, టమాటాలో కాకర, దోస, తీగబీన్సు, బీర తదితర పంటలను సాగుచేస్తున్నారు. బంతిపూలలో దోస, కొత్తిమీర, బెండ, బీన్సు, టమాటా, వంగతోటలో బంతి, టమాటలో కాకర లాంటి కాంబినేషన్లు రైతులకు లాభసాటిగా మారాయి. కొందరు రైతులు బొప్పాయిలో బంతి, మిరపలో అరటి, బంతిలో అలసంద, క్యాబేజిలో వెల్లుల్లి, కొత్తిమీర సాలుపంటగా జొన్నలను పండిస్తున్నారు.

ఈ విధానాలతో బహుళ లాభాలు  
పంట సాగుకు అవరసమైన భూసారానికి సేంద్రీయ ఎరువులు, నీటివినియోగం, కూలీలు, క్రిమిసంహారకమందుల ఖర్చు భారీగా తగ్గుతుంది. ముఖ్యంగా పంటకాలం ఆదా అవుతుంది. కాబట్టి ఏటా మూడు పంటల్లో రెండు, మూడు పంటలను మిశ్రమ, అంతర పంటలుగా సాగుచేసుకోవచ్చు. దీంతో ఓ పంటకు ధర తగ్గినా మరో రెండు పంటలకు ధరలుండే అవకాశం ఉంటుంది. ఫలితంగా రైతుకు నష్టాలు వచ్చే అవకాశముండదు.

టమాటా రైతులకు ఇదోవరం  
పలమనేరు హార్టికల్చర్‌ డివిజన్‌లో టమాటా ఎక్కువగా సాగవుతోంది. అయితే టమాటా ధరలు ఎప్పుడూ నిలకడగా ఉండవు.  ఎకరా పొలంలో టమాటాను సాగుచేసేందుకు దాదాపు రూ.80వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. పంట దిగుబడి మధ్యలో ఉన్నప్పుడు ఇదే పొలంలో తీగపంటలైన బీన్సు, బీర, కాకర, సొర లాంటి పంటలను సాగుచేస్తే టమాటా పంట అయిపోగానే, అదే కర్రలకు రెండో పంట తీగలను పెట్టుకోవచ్చు. ఫలితంగా పంట పెట్టుబడి తగ్గడంతో పాటు భూమిని కొత్త పంటకు సిద్ధం చేసే ఖర్చు కూడా తగ్గుతుంది. టమాటా ధర లేనప్పుడు, రెండో పంట ఆసరాగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement