ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు కసరత్తు | Exercise for conducting inter exams | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు కసరత్తు

Published Sun, Dec 31 2023 5:01 AM | Last Updated on Sun, Dec 31 2023 5:01 AM

Exercise for conducting inter exams - Sakshi

సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ పబ్లిక్‌ పరీక్షల నిర్వహణకు బోర్డు చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. ఆలస్య రుసుంతో సహా ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. నామినల్‌ రోల్స్‌లో తప్పులు సరిదిద్దుకునే గడువు కూడా శనివారంతో పూర్తయ్యింది. బోర్డు పరీక్షలు మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించేందుకు ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. పేపర్ల మోడరైజేషన్‌(సెట్టింగ్‌), పరీక్ష కేంద్రాల ఎంపిక పూర్తి కావడంతో ఇంటర్‌ బోర్డు అధికారులు పరీక్షల నిర్వహణపై దృష్టి పెట్టారు. 2023–24 విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ జూనియర్‌ కాలేజీల్లో 10,07,097 మంది విద్యార్థులు ఇంటర్‌ చదువుతున్నారు. వీరిలో మొదటి ఏడాది 5,29,015 మంది, రెండో ఏడాది 4,75,744 మంది విద్యార్థులున్నారు.

గతేడాది పలు సబ్జెక్టులలో ఫెయిలైన 1.48 లక్షల మందిలో దాదాపు 90 వేల మంది వరకు ప్రభుత్వం కల్పించిన ‘రీ అడ్మిషన్‌’ అవకాశాన్ని వినియోగించుకున్నారు. మరో 53 వేల మంది పరీక్షలకు ఫీజు చెల్లించారు. కాగా, నామినల్‌ రోల్స్‌లో విద్యార్థుల పేర్లు, తల్లి/తండ్రి పేర్లు, పుట్టిన తేదీ, కులం తదితరాల్లో ఏమైనా తప్పులుంటే సరిదిద్దుకునే అవకాశాన్ని ఇంటర్‌ బోర్డు కల్పించింది.

శనివారంతో ఈ గడువు కూడా ముగిసింది. ఇంకా తప్పులు సరిదిద్దకుండా నిర్లక్ష్యం వహించిన కాలేజీల ప్రిన్సిపల్స్‌ను బాధ్యులను చేసి, వారిపై చర్యలు తీసుకోవాలని ఇంటర్‌ బోర్డు నిర్ణయించింది. విద్యార్థుల సంఖ్యపై స్పష్టత రావడంతో ఇంటర్‌ బోర్డు పరీక్షల నిర్వహణ అధికారులు.. పరీక్షా కేంద్రాలపై దృష్టి పెట్టారు. గతంలో ప్రాంతీయ పరిశీలన అధికారులు(ఆర్‌ఐఓ) తమ రీజియన్‌ పరిధిలో పరీక్షా కేంద్రాలను ఎంపిక చేసేవారు.

ఈ విద్యా సంవత్సరం ఈ బాధ్యతను ఇంటర్మీడియట్ విద్యామండలి పర్యవేక్షిస్తోంది. అనుమతుల కోసం వచ్చిన వాటిలో అన్ని అర్హతలున్న 1,489 జూనియర్‌ కాలేజీలను కంట్రోల్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ ఎంపిక చేసింది. రీజనల్‌ అధికారులు, జిల్లా విద్యా శాఖ అధికారులు ఆయా కేంద్రాలను క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి, నివేదిక సమర్పిస్తారు. ప్రతి పరీక్షా కేంద్రంలోనూ సీసీ కెమెరాలతో నిఘా, తగినంతగా తాగునీటి వనరులు, టాయిలెట్లు తదితరాలను తప్పనిసరి చేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement