పీజీ వైద్య సీట్లపై ఎందుకీ ఫీట్లు? | Eenadu false writings on Allotment of PG seats | Sakshi
Sakshi News home page

పీజీ వైద్య సీట్లపై ఎందుకీ ఫీట్లు?

Published Mon, Sep 4 2023 4:00 AM | Last Updated on Mon, Sep 4 2023 4:00 AM

Eenadu false writings on Allotment of PG seats - Sakshi

సాక్షి, అమరావతి: ఉల్లిపాయను ఎంత ఉడకబెట్టినా దాని కంపు పోదు.. చింతకాయను ఎంత చితక్కొట్టినా దాని పులుపు పోదు.. అలాగే, రామోజీ రాతల రంకు రోజూ బయటపడుతున్నా ఆయన సిగ్గుపడడు. ఎందుకంటే ఆయన రామోజీ కనుక. ప్రభుత్వంపై బురద జల్లడం, నిందలు ఆపాదించడం ఆయనకు పెన్నుతో పెట్టిన విద్య. ఆ లక్షణంతోనే ఆయన కళ్లు మూసుకుని నిజానిజాలు తెలుసుకోకుండా గుడ్డిగా ఏదిపడితే అది రాసిపారేస్తున్నారు.

నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ (ఎన్‌ఎంసీ) నుంచి వైద్య కళాశాలలకు అదనపు పీజీ సీట్ల మంజూరులో జరిగిన అవకతవకల్లో రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లుతూ ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నాడు. ‘పీజీ వైద్య సీట్ల కోసం అక్రమాల దందా’ అంటూ ఈనాడు పత్రికలో ఆదివారం కథనం రాసుకొచ్చారు. ఈ సీట్ల పెంపుపై ఎన్‌ఎంసీ నుంచి నకిలీ లెటర్‌ ఆఫ్‌ పర్మిషన్‌ (ఎల్‌ఓపీ)లు సృష్టించారు.

ఈ వ్యవహారంలో డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం కళ్లు మూసుకుందని.. రాష్ట్ర ప్రభుత్వంపై మరో మచ్చ పడిందని రామోజీరావు తెగ గగ్గోలు పెట్టారు. ఢిల్లీలో కేంద్రం అజమాయిషీలో పనిచేసే ఎన్‌ఎంసీ పేరిట నకిలీ ఎల్‌ఓపీలు వస్తే ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంపై మచ్చ పడటం ఏమిటి?.. అసలు రామోజీరావుకు ఏమైంది..? మరీ ఇంతలా ఎందుకు దిగజారుతున్నారని మేధావులు సైతం మండిపడుతున్నారు. ఈ విషయంలో రామోజీ రాతల వెనుక వాస్తవాలను పరిశీలిస్తే..

ఎన్‌ఎంసీనే అప్రమత్తం చేసిన ప్రభుత్వం 
2023–24 విద్యా సంవత్సరంలో పీజీ సీట్ల పెంపుదలకు సంబంధించి నంద్యాల జిల్లా శాంతిరాం వైద్య కళాశాల సమర్పించిన ఎల్‌ఓపీ నకిలీదని ఆగస్టు 29న ఎన్‌ఎంసీ ఆరోగ్య విశ్వవిద్యాలయం దృష్టికి తీసుకొచ్చింది. దీంతో అప్రమత్తమైన విశ్వవిద్యాలయం అధికారులు అప్పటివరకూ నిర్వహించిన పీజీ అడ్మిషన్ల ప్రక్రియను నిలిపివే­శారు. శాంతిరాంలో 25 సీట్లు కాగా, అదనంగా మరో 74 సీట్లకు ఎల్‌ఓపీలు జారీ అయినట్లు గుర్తించారు.

వెంటనే రాష్ట్రంలో ఇతర వైద్య కళాశాలలు సమర్పించిన ఎల్‌ఓపీలను నిశితంగా పరిశీలించారు. ఈ నేపథ్యంలో రాజమండ్రి జీఎస్‌ఎల్, విజ­య­నగరం మహారాజా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌లో కూడా ఇలాంటి తతంగమే చోటుచేసు­కుందని గుర్తించారు. ఈ విషయం సీఎం జగన్‌ దృష్టికి తీసుకువెళ్లడంతో వెంటనే నకిలీ అనుమతుల వ్యవహారంపై ఎన్‌ఎంసీకి లేఖ రాయాలని ఆయన వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతాధికా­రులను ఆదేశించారు.

దీనిపై విచారణ చేపట్టాలంటూ ఎన్‌ఎంసీని కోరాలని, విచారణకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారాన్ని అందించాలని సూచించారు. దీంతో గత నెల 31న వైద్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎన్‌ఎంసీకి లేఖ రాశారు. దీన్నిబట్టి చూస్తే.. కాస్త ఇంగితం ఉన్న ఎవ్వరికైనా ప్రభుత్వమే ఎన్‌ఎంసీని అప్రమత్తం చేసిందని అర్థమవుతుంది. 

వాస్తవాలకు పాతరేయడమే రామోజీ లక్ష్యం..
ఇలా నకిలీ పీజీ సీట్ల అనుమతుల వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, మన విద్యార్థులకు నష్టం జరగకుండా చర్యలు చేపడితే ఆ విషయాలను కప్పిపుచ్చి ఏదోకలా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా రామోజీ కుట్రచేశారు. మొత్తం వ్యవహారాన్ని రాష్ట్ర ప్రభుత్వ తప్పిదంగా, రాష్ట్ర ప్రభుత్వ వ్యవస్థల్లో లోపంగా చూపించేందుకు వాస్తవాలను వక్రీకరించేందుకు తెగ తాపత్రయపడ్డారు.

పైగా రాజకీయాలను ఆపాదిస్తూ ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేశారు. శాంతిరాం కళాశాల యజమాని వైఎస్సార్‌సీపీలో ఇటీవలే చేరారని, అందుకనే ఇది జరిగిందన్నట్లుగా ఈనాడు ఒక ముద్రవేసే ప్రయత్నం చేసింది. శాంతిరాం కళాశాల యజమాని ఇటీవల వైఎస్సార్‌­సీపీలో చేరిన మాట వాస్తవమే. కానీ, కొద్దిరోజుల కిందటి వరకూ ఆయన ఏ పార్టీలో ఉన్నారన్న విషయాన్ని రామోజీ 
ఎందుకు దాచిపెట్టారు?.

నాటి లోకేశ్‌ ట్వీట్‌ ఊసెత్తని రామోజీ..
2019లో ఐటీ శాఖ తమ మద్దతుదారుడైన శాంతిరాంపై సోదాలు చేస్తోందని, మోడీ తీరును ఖండిస్తున్నామంటూ అప్పట్లో చంద్రబాబు తనయుడు లోకేశ్‌ చేసిన ట్వీట్‌­లోని అంశాలను విస్మరించి రాతలు రాయ­డం రామోజీరావు నిస్సిగ్గుతనానికి నిద­ర్శనం. నిజానికి.. ఎల్‌ఓపీల జారీలో గోల్‌­మాల్‌ జరిగింది ఢిల్లీలోని ఎన్‌ఎంసీలో.. అది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యవస్థ కాదని రాజగురువింద రామోజీకి తెలీదా? దాన్ని రాష్ట్ర ప్రభు­త్వానికి, ఆరోగ్య విశ్వవిద్యాల­యా­నికి ఆపా­­దించడం ఎంత­వరకు సబబని వైద్య వర్గాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఒక కాలేజీలో తప్పు జరిగిందని తెలిసిన వెంటనే మిగిలిన కళాశాలలను పరిశీలించి స్వయంగా ప్రభు­త్వమే ఎన్‌ఎంసీని అప్రమత్తం చేస్తే సక్ర­మంగా పనిచేసినట్లు కాదా రామోజీ? నకి­లీల వ్యవహారంపై పూర్తిగా విచారణకు సహ­­కరించాలని రాష్ట్ర ప్రభుత్వమే ఆదే­శాలు జారీచేస్తే, ఈనాడు మాత్రం ఇక్కడే ఏదో జరిగిపోయినట్లు వక్రీకరణలు చేయ­డం రామోజీ దిగజారుడుతనానికి నిదర్శ­నం. అలాగే, ఏపీతోపాటు తమిళ­నాడు­లోనూ ఇదే తరహా వ్యవహారం వెలుగు­చూసిన విషయం రామోజీ మరిచినట్లున్నారు?

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement