స్వచ్ఛ ఓటర్ల జాబితా ముఖ్యం | ECI delegation mandate to state officials: andhra prdesh | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ ఓటర్ల జాబితా ముఖ్యం

Published Sat, Dec 23 2023 6:35 AM | Last Updated on Sat, Dec 23 2023 6:35 AM

ECI delegation mandate to state officials: andhra prdesh - Sakshi

సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటు అనేది అత్యంత కీలకమని, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా రాష్ట్ర అధికారులు చర్యలు తీసుకోవా­లని కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) అధికారు­లు ఆదేశించారు. ఓటర్ల జాబితా తయారీలో 100శాతం స్వచ్చత ఎంత ముఖ్యమో... ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా అంతే ముఖ్యమని ఈసీఐ ప్రతినిధుల బృందం సారథి సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్‌ ధర్మేంద్ర శర్మ అన్నారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఎస్‌ఆర్‌)–2024, సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై శుక్రవారం విజయవాడలో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర ఎన్నికల సంఘం నుంచి సీనియర్‌ డిప్యూటీ ఎలక్షన్‌ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్‌ వ్యాస్, స్వీప్‌ డైరెక్టర్‌ సంతోష్‌ అజ్మేరా, అండర్‌ సెక్రటరీ సంజయ్‌కుమార్‌తోపాటు ఏపీ చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి ముఖేష్కుమార్‌ మీనా, అడిషనల్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్, జాయింట్‌ చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ ఎ.వెంకటేశ్వరరావు, స్టేట్‌ పోలీస్‌ నోడల్‌ అధికారి వినీత్‌ బ్రిజ్‌లాల్‌ తదితరులు హాజరయ్యారు.

ధర్మేంద్ర శర్మ మాట్లాడుతూ అర్హత ఉన్నవారందరూ ఓటు నమోదు చేసుకునేలా, ఓటు హక్కు వినియోగించుకునేలా  ప్రో­­త్స­హించడం ప్రధానమని చెప్పారు. బూత్, నియోజకవర్గ స్థాయిలో గతంలో నమోదైన పోలింగ్‌ శాతాలను పరిశీలించి... తక్కువగా ఉన్నచోట అందుకు కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసి పోలింగ్‌ శాతం పెంచేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా సిస్టమాటిక్‌ ఓటర్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ఎలక్టోరల్‌ పారి్టసిపేషన్‌  (స్వీప్‌) కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.

ఎలాంటి అవరోధాలు లేకుండా ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసేందుకు సమగ్ర, ప­టిష్ట ఎన్నికల నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ) అవసరమని, స్వచ్చమైన ఓటర్ల జాబితాతోపాటు సుశిక్షి­తులైన మానవవనరులు, మెటీరియల్‌ తదితరాలపై దృష్టిసారించాలన్నారు. ప్రస్తుతం ఇన్ఫర్మేషన్‌ టెక్నా­లజీ వేదికలు ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల నిర్వహణలో అత్యంత ప్రాధాన్యత సంతరిం­చుకున్నా­యని, ఈఎస్‌ఎంఎస్, సువిధ, ఈఎన్‌కోర్, సీ విజిల్, ఈటీపీబీఎంఎస్, ఓటర్‌ టర్నవుట్, కౌంటింగ్‌ ఓట్స్‌ యాప్‌లపై అధికారులు, సి­బ్బందికి తప్పనిస­రిగా అవగాహన ఉండాలన్నారు.

జిల్లాస్థాయిలో­నూ సమర్థ మానవ వనరులతో ఐటీ టీమ్స్‌ ఏర్పాటుచేయాలని సూచించా­రు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. కాగా, ఓటు హక్కుపై స్ఫూర్తిదాయకమైన ప్రముఖులతో అవగాహన కార్యక్రమాలు, విశ్వసనీయత పెంపొందిస్తూ క్షేత్రస్థాయి తనిఖీల ఆధారంగా ఓటుకు సంబంధించిన దరఖాస్తుల పరిష్కారం, మ­ద్యం, డబ్బు తదితరాల అక్రమ రవాణాలను అడ్డు­కునేందుకు సరిహద్దు జిల్లాలు, రాష్ట్రాల మధ్య సమన్వయం, ఎన్నికల సమయంలో నమోదైన కేసుల విచారణ, రాజకీయ తటస్థత కలిగిన ఎన్‌జీవోలు, పౌర సంస్థల భాగస్వామ్యం, పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ తదితర శాఖల మధ్య సమన్వయం, ఓటింగ్‌ శాతం పెంపు కోసం వివిధ ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు తదితరాలపై ఈసీఐ అధికారులు పలు సూచనలు చేశారు.  

కలెక్టర్లు, ఎస్‌పీల పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ 
ఈ సమావేశంలో జిల్లాల కలెక్టర్లు ఎస్‌ఎస్‌ఆర్‌–2024, సాధారణ ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఎస్పీలు శాంతిభద్రతల పరిరక్షణ, గత ఎన్నికల నిర్వహణ సమయంలో ఉల్లంఘనలకు సంబంధించి నమోదైన కేసుల విచారణ, అక్రమ మద్యం, డబ్బు తరలింపులను అడ్డుకునేందుకు తీసుకుంటున్న చర్యలు, చెక్‌పోస్టుల మ్యాపింగ్, సమస్యాత్మక, వల్నరబుల్‌ పోలింగ్‌ స్టేషన్లు తదితరాలపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. 

పారదర్శకంగా ఎస్‌ఎస్‌ఆర్‌–2024: సీఈవో
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024 ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని రాష్ట్ర చీఫ్‌ ఎలక్టోరల్‌ అధికారి ముఖేష్కుమార్‌ మీనా తెలిపారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అధిక సంఖ్యలో దరఖాస్తులు అందాయన్నారు. ఈసీఐ మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని పరిష్కరిస్తున్నట్లు తెలిపారు. ఎస్‌ఎస్‌ఆర్‌–2023 కింద ఈ ఏడాది జనవరి 5న తుది జాబితా ప్రచురించిన తర్వాత నుంచి దాదాపు 90 లక్షల దరఖాస్తులు వచ్చాయని.. వీటిలో 89 లక్షల దరఖాస్తుల పరిష్కారం పూర్తయిందన్నారు.

మిగిలినవి ఈ నెల 26లోపు పరిష్కరిస్తామని తెలిపారు. ప్రతి వారం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నామని, వారి సూచనలను పరిగణనలోకి తీసుకుంటూ ఫిర్యాదులను పరి­ష్క­రిస్తున్నట్లు వివరించారు. జిల్లా అధికార యంత్రాంగం ఎస్‌ఎస్‌ఆర్‌–2024, ఎన్నికల సన్నద్ధతకు సంబంధించి ప్రతి దశలోనూ సమస్యను గుర్తించడంతోపాటు పరిష్కరిస్తు­న్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో 26 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement