1 నుంచి రేషన్‌ లబ్దిదా­రులకు రాగిపిండి పంపిణీ | Distribution of ragi flour from 1st | Sakshi
Sakshi News home page

1 నుంచి రేషన్‌ లబ్దిదా­రులకు రాగిపిండి పంపిణీ

Published Thu, Feb 22 2024 5:38 AM | Last Updated on Thu, Feb 22 2024 5:40 AM

Distribution of ragi flour from 1st - Sakshi

సాక్షి, అమరావతి: వచ్చే నెల 1 నుంచి రేషన్‌ లబ్దిదా­రులకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రాగిపిండిని పంపిణీ చేయనుంది. తద్వారా ప్రభుత్వం పౌష్టికాహార భద్రతకు పెద్దపీట వేయనుంది. ముందు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో బల­వర్థక ఆహారంగా రాగి పిండిని సరఫరా చేయా­లని నిర్ణయించింది. మార్చి 1 నుంచి కిలో ప్యాకెట్ల రూపంలో దీన్ని అందించనుంది.

బహిరంగ మార్కె­ట్‌లో కిలో రాగిపిండి రూ.40పైనే పలుకుతుండగా ప్రభుత్వం లబ్దిదారులకు కిలో రూ.11కే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతోంది. తొలుత శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అ­ల్లూ­రి సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, రాయలసీమలోని వైఎస్సార్, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

కాగా ఒక్కో కార్డుకు ప్రస్తుతం ఇస్తున్న బియ్యంలో కిలో బియ్యం బదులు రాగులు/జొన్నలను అందజేస్తోంది. ఈ క్రమంలోనే కార్డుదారులు వాటిని మిల్లింగ్‌ చేసుకుని వినియోగించుకుంటున్నారు. ఇకపై లబ్దిదారులకు మరింత సౌకర్యవంతంగా ఉండేలా.. పౌరసరఫరాల శాఖ చరిత్రలో తొలిసారిగా రాగిపిండి పంపిణీకి శ్రీకారం చుడుతోంది.  

నేరుగా రైతుల నుంచే కొనుగోలు 
రేషన్‌ లబ్ధిదారులకు నాణ్యమైన ఉత్పత్తులు అందించడంలో భాగంగా స్థానిక రైతులకు సంపూర్ణ మద్దతు కల్పిస్తూ పౌరసరఫరాల సంస్థ రాగులు, జొన్నల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. వ్యవసా­య శాఖ ద్వారా రైతులను చిరుధాన్యాల సాగువైపు తీసుకెళ్తోంది. ఇందులో భాగంగానే రాయితీపై చిరు­ధాన్యాల విత్తనాలను అందిస్తోంది. కొర్రల కొనుగోలుకు సైతం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మరీ మద్దతు ధరల జాబితాలో చేర్పించింది.

కొర్రలు కోతలకు వచ్చే సమయంలో వాటిని రైతు భరోసా కేంద్రాల ద్వారా సేకరించేందుకు ప్రణాళికలు రూపొందించింది. ఇప్పుడు శ్రీసత్యసాయి, పా­ర్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లా­ల్లో రాగులు, అనంతపురం, నంద్యాల, వైఎస్సార్, కర్నూలు జిల్లాల్లో జొన్నల కొనుగోలును చేపడుతోంది. ఆర్బీకేల ద్వారా ఈ–క్రాప్‌ ప్రామాణికంగా వ్యవసాయ క్షేత్రం నుంచే పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తూ రైతుకు బాసటగా నిలుస్తోంది.

వాటిని ప్రాసెసింగ్‌ చేసి తిరిగిన స్థానిక ప్రజలకు ఉపయోగపడేలా ప్రజాపంపిణీ వ్యవస్థ (పీడీఎస్‌) ద్వారా పంపిణీ చేస్తోంది. దీంతోపాటు భార­త ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) ద్వారా ఇతర రాష్రా­్టల నుంచి రాగులును దిగుమతి చేసుకుంటోంది. ఈ ఖరీఫ్‌లో ఇప్పటివరకు రాగులు, జొన్నలు కలిపి సుమారు 6,500 టన్నులకుపైగా సేకరించింది.

మరో 20 వేల టన్నుల జొన్నలు.. 
నంద్యాల జిల్లాలో జొన్నలు మంచి దిగుబడులు వచ్చాయి. రైతుల నుంచి డిమాండ్‌ ఉండటంతో అదనంగా జొన్నల కొనుగోలుకు పౌరసరఫరాల సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. దీని ప్రకా రం మరో 20వేల టన్నుల వరకు జొన్నలను సేకరించనుంది. ఇందులో రాష్ట్ర అవసరాలకు పోనూ మిగిలిన వాటిని ఎఫ్‌సీఐకి అందించనుంది. తద్వారా రాష్ట్ర రైతులకు పూర్తి మద్దతు ధర దక్కేలా చర్యలు చేపడుతోంది. 

గోధుమ పిండికి డిమాండ్‌.. 
పీడీఎస్‌లో అందిస్తున్న ఫోర్టిఫైడ్‌ గోధుమ పిండికి మంచి డిమాండ్‌ ఉంది. ప్రతి నెలా 2,500 టన్నుల నుంచి 5 వేల టన్నుల వరకు వినియోగం ఉంటోంది. ఇదే గోధుమ పిండిని కేంద్ర ప్రభుత్వం భారత్‌ బ్రాండ్‌ పేరుతో కిలో రూ.27.50కు ఇస్తుంటే.. రాష్ట్రంలో కిలో రూ.16కే అందిస్తున్నారు. మార్కెట్‌ రేటు కంటే తక్కువకే నాణ్యమైన గోధుమపిండి లభిస్తుండటంతో కార్డుదారులు తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.

పౌష్టికాహారం అందించాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యం.. 
పీడీఎస్‌లో పౌష్టికాహారం అందించాలన్నదే సీఎం జగన్‌ లక్ష్యం. అందుకే నాణ్యమైన ఫోర్టిఫైడ్‌ బియ్యంతో పాటు రాగులు, జొన్నలు, ఫోర్టిఫైడ్‌ గోధుమ పిండిని సరఫరా చేస్తున్నాం. రాగులుకు వినియోగదారుల్లో మంచి డిమాండ్‌ ఉంది.

అయితే వాటిని మిల్లింగ్‌ చేసుకుని వాడుకునేందుకు కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనిపై ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. అందుకే రాగిపిండిని ఇవ్వాలని నిర్ణయించాం. కిలో ప్యాకెట్ల రూపంలో రూ.11కే మార్చి నుంచి అందుబాటులోకి తెస్తున్నాం. రాగులను ప్రాసెసింగ్‌ చేసి.. పిండి ఆడించి, ప్యాకింగ్, రవాణా చేసేందుకయ్యే ఖర్చులను మాత్రమే రేటుగా నిర్ధారించాం.    – హెచ్‌.అరుణ్‌ కుమార్, కమిషనర్, పౌరసరఫరాల శాఖ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement