మసకేయిస్తున్న ‘మయోపియా’ Decreasing distance vision in children | Sakshi
Sakshi News home page

మసకేయిస్తున్న ‘మయోపియా’

Published Sat, Jun 22 2024 5:23 AM | Last Updated on Sat, Jun 22 2024 5:23 AM

Decreasing distance vision in children

పిల్లల్లో తగ్గుతున్న దూర దృష్టి 

కంటి లోపాలున్న పిల్లల్లో ప్రతి 20 మందిలో 18 మందికి సమస్య

ఔట్‌డోర్‌ క్రీడలు లేకపోవడమే కారణమంటున్న వైద్యులు

స్మార్ట్‌ ఫోన్‌ అధికంగా చూడటంతో అనేక సమస్యలు 

సరైన చికిత్స పొందకుంటే చూపు మందగించే ప్రమాదం– పిల్లల్లో తగ్గుతున్న దూర దృష్టి 

లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఓవైపు ఔట్‌డోర్‌ ఆటలకు అవకాశం లేకుండా ఉదయం నుంచి రాత్రి వరకు ఒకటే చదువులు.. ఇంకోవైపు కాస్తో కూస్తో దొరికిన విరామంలో స్మార్ట్‌ ఫోన్లతో కాలక్షేపం.. వెరసి పిల్లలు కంటి సమస్యల బారినపడుతున్నారు. ముఖ్యంగా మయోపియా కబళిస్తోంది. పిల్లల్లో దూర దృష్టి తగ్గిపోతోంది. 

కంటి లోపాలున్న పిల్లల్లో ప్రతి 20 మందిలో 18 మందిని మయోపియా వేధిస్తోంది. నేత్ర వైద్యులు ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఉదయాస్తమానం చదువులు, ఆ తర్వాత సెల్‌ఫోన్‌లో గేమ్స్‌కు అలవాటుపడుతున్న పిల్లల్లో మయోపియా సమస్యకు దారితీస్తోందని అంటున్నారు.

‘స్మార్ట్‌’ కాటు..
ప్రస్తుతం చిన్నారుల నుంచి వృద్ధుల వరకూ స్మార్ట్‌ ఫోన్‌ చేతిలో లేనిదే నిమిషం గడవడం లేదు. ఎక్కువసేపు దీన్ని వాడే వారిలో పలు సమస్యలు వస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు. నిత్యం 5 నుంచి 6 గంటలు స్మార్ట్‌ ఫోన్‌ వినియోగించేవారు కళ్లు డ్రై అవడంతో సమస్యలకు గురవుతున్నారు. 

అలాంటి వారిలో కళ్లు మంటలు, దురదలు రావడం, వెలుతురు సరిగ్గా చూడలేకపోవడం, కళ్లు ఎర్రగా మారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. ఈ దశలో సరైన చికిత్స పొందకుంటే చూపు మందగించే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా డ్రైవింగ్‌ చేసే సమయంలో ఏకాగ్రతను కోల్పోయి కంగారు పడతారని అంటున్నారు.

నివారణకు ఇలా చేయాలి..
» పిల్లలు బయట ఆటలు ఆడేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి.
»   దగ్గర వాటితోపాటు దూరంగా ఉన్న వాటిని కూడా తరచూ చూస్తుండాలి.
»    బ్రైట్‌నెస్‌ తక్కువగా పెట్టుకుని స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించాలి. 
»   కళ్లకు ఫోన్‌ 15 సెంటిమీటర్ల దూరంలో ఉంచి చూడాలి. ముఖానికి దగ్గరగా పెట్టుకోకూడదు. 
»    20 నిమిషాల పాటు ఫోన్, కంప్యూటర్‌ వాడాక 20 సెకన్ల పాటు దూరంలో ఉన్న వస్తువులను చూడాలి. కనురెప్పలు వేయడంతో నల్లగుడ్డు పొరపైకి నీరు చేరి కళ్లు డ్రై కావు. 
»  ఎట్టి పరిస్థితుల్లో చీకట్లో స్మార్ట్‌ ఫోన్‌ను వినియోగించరాదు. 
»    కంప్యూటర్‌పై పనిచేసే వారు యాంటీ రిఫ్లెక్టివ్‌ గ్లాసెస్‌ వాడితే ప్రయోజనకరంగా ఉంటుంది. 
»    రోజులో ఎక్కువసేపు స్మార్ట్‌ ఫోన్, కంప్యూటర్‌పై పనిచేసే వారు ఐడ్రాప్స్‌ వాడాలి.

పిల్లల్లో దూర దృష్టి సమస్య..
ప్రస్తుతం పిల్లల్లో ఎక్కువగా దూరపు చూపు తగ్గుతోంది. మా వద్దకు వచ్చే ప్రతి 20 మందిలో 18 మందికి ఇదే సమస్య ఉంటోంది. దీనికి కారణం పిల్లలు కేవలం పుస్తకాలు చదవడం, స్మార్ట్‌ ఫోన్‌లు చూడటానికి పరిమితం కావడమే. అలాంటి వారిలో కంటి సైజు పెరిగి దూరపు చూపు మందగిస్తోంది. ఔట్‌డోర్‌ క్రీడలు కూడా చాలా అవసరం. దూరంగా ఉన్న వాటిని కూడా పిల్లలు చూస్తూ ఉండాలి.. ఆటలు ఆడుతుండాలి.        – డాక్టర్‌ బషీర్‌ అహ్మద్‌ మయోఖ్, నేత్ర వైద్య నిపుణుడు, విజయవాడ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement