ఇంగ్లిష్‌ 'పది'లం | CM Jagan radical reforms in Govt Schools education with English Medium | Sakshi
Sakshi News home page

ఇంగ్లిష్‌ 'పది'లం

Published Sun, Feb 18 2024 4:34 AM | Last Updated on Sun, Feb 18 2024 9:02 AM

CM Jagan radical reforms in Govt Schools education with English Medium - Sakshi

మా లాంటి పేదలకు అండగా సీఎం
గిరిజన ప్రాంతంలో జన్మించిన నేను ప్రారంభంలో తెలుగు మీడియంలోనే చదువుకున్నా. జగన్‌ మావయ్య ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంగ్లిష్‌ మీడియంలో చదువుతున్నా. ప్రస్తుతం జీకే వీధి ఇంగ్లిష్‌ మీడియం ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా. జగన్‌ మావయ్య మాలాంటి పేద విద్యార్థులకు అండగా నిలిచారు. ఉన్నత చదువులు చదివి మావయ్య ఆశయాన్ని సాధిస్తా. మా అమ్మ కిల్లో జమున, నాన్న కిల్లో నవకుమార్‌ పోడు వ్యవసాయం చేస్తారు. ఆ ఆదాయంతో నన్ను చదివించేవారు. ఇప్పుడు ఇంగ్లిష్‌ మీడియం స్కూల్లో ఉచితంగా వసతి కల్పిస్తున్నారు. టీచర్లు బాగా బోధిస్తున్నారు. 
– కె.ధారామణి, ఇంగ్లిష్‌ మీడియం గిరిజన ఆశ్రమ పాఠశాల, జీకే వీధి, అల్లూరి జిల్లా

సాక్షి, అమరావతి: విద్యా రంగంలో సమూల సంస్కరణలతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నాలుగేళ్ల క్రితం తలపెట్టిన చదువుల యజ్ఞం సత్ఫలి­తాలనిస్తోంది. మన విద్యార్థులు అంతర్జాతీయంగా సత్తా చాటుకునేలా దూరదృష్టితో ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చిన ఇంగ్లిష్‌ మీడియం చదువులకు ఆదరణ పెరుగుతోంది. ఇన్నాళ్లూ మాతృభాష ముసుగులో పేద బిడ్డల ఇంగ్లిష్‌ చదువులకు అడ్డుపడుతూ కొందరు పెత్తందార్లు కార్పొరేట్‌ విద్యా సంస్థల కొమ్ము కాశారు. రాష్ట్ర ప్రభుత్వం సర్కారీ స్కూళ్లలో పేద విద్యార్థుల కోసం ఇంగ్లీషు మీడియం తీసుకొస్తే తెలుగును అణగదొక్కుతున్నారంటూ విష ప్రచారం చేశారు.

అందరూ ఆంగ్లంలోనే చదివితే తమ పరిస్థితి ఏం కావాలని కార్పొరేట్‌ విద్యా సంస్థలు బెంబేలెత్తాయి. ఇవన్నీ అధిగమిస్తూ ప్రభుత్వ విద్యా సంస్థలు మంచి ఫలితాలను నమోదు చేస్తున్నాయి. రాష్ట్రంలో ఇంగ్లీషు మీడియంలో టెన్త్‌ పరీక్షలు రాసే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల సంఖ్య భారీగా పెరుగుతోంది. సర్కారీ స్కూళ్లలో గత ఐదేళ్లలో దాదాపు 25 శాతం మంది విద్యార్థులు తెలుగు నుంచి ఇంగ్లీషు మీడియంలోకి మారిపోయి పదో తరగతి పరీక్షలకు హాజరైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్ది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఇంగ్లీషు మీడియం చదువులను ముఖ్యమంత్రి జగన్‌ అందిస్తుండటం తెలిసిందే.

ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంతో అత్యధిక విద్యార్థులు తెలుగు నుంచి ఆంగ్ల మాధ్యమంలోకి మారారు. ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులకు జగనన్న విద్యా కానుక కింద పాఠ్యపుస్తకాలతో పాటు యూనిఫాం, బూట్లు తదితరాలతో కిట్‌ను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. విద్యార్ధులు సులభంగా అర్ధం చేసుకోవడానికి వీలుగా బైలింగ్యువల్‌ పాఠ్యపుస్తకాలను సమకూరుస్తోంది. ఇప్పటివరకు జగనన్న విద్యా కానుక కింద రూ.3,366.53 కోట్లను వ్యయం చేయగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యా కానుక నిధులను సిద్ధం చేస్తూ రూ.1,042.51 కోట్లకు పరిపాలన అనుమతి మంజూరు చేసింది. 

► వచ్చే నెలలో టెన్త్‌ పరీక్షలు రాయనున్న మొత్తం విద్యార్ధులు 6.23 లక్షల మంది ఉండగా ఏకంగా 4.51 లక్షల మందికిపైగా ఇంగ్లీషు మీడియంలోనే పరీక్షలు రాయనుండటం గమనార్హం. వీరిలో ప్రభుత్వ స్కూళ్లు, సంక్షేమ హాస్టళ్లలో చదువుతున్న వారు ఏకంగా 3.97 లక్షల మంది ఉన్నారు. ప్రైవేట్, అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లలో చదువుతున్న వారి సంఖ్య 2.25 లక్షల వరకు ఉంది. ఇంగ్లీషు మీడియంలో పరీక్షలు రాసే విద్యార్థుల సంఖ్య త్వరలోనే వంద శాతానికి చేరుతుందంని విద్యావేత్తలు, నిపుణులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థుల ఆంగ్ల నైపుణ్యాలకు పదును పెడుతూ టోఫెల్‌ శిక్షణ సైతం అందుబాటులోకి తెచ్చిందని  ఉదహరిస్తున్నారు. 

► చంద్రబాబు హయాంతో పోలిస్తే ఐదేళ్లలో పరిస్థితి తిరగబడింది. సీఎం జగన్‌ ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంతో వచ్చే నెలలో పదో తరగతి పరీక్షలు ఆంగ్ల మాధ్యమంలో రాయనున్న విద్యార్ధులు 72.54 శాతానికి పెరిగారు. ఈసారి తెలుగు మీడియంలో టెన్త్‌ పరీక్షలు రాసే విద్యార్ధులు 26.74 శాతం మంది మాత్రమే ఉన్నారు. మిగతా అతి స్వల్ప శాతం విద్యార్థులు ఉర్దూ, కన్నడ, తమిళం, ఒడియా భాషల్లో చదువుతున్న వారున్నారు.  

► టీడీపీ హయాంలో ఇంగ్లీషు మీడియంలో పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య 2.88 లక్షలు కాగా ఇప్పుడు ఏకంగా 4.51 లక్షలకు పెరిగింది. గత సర్కారు హయాం కంటే ఇప్పుడు ఇంగ్లీషు మీడియంలో పరీక్షలు రాసే వారి సంఖ్య 1.63 లక్షలు పెరగడం గమనార్హం. వీరంతా ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లీషు మీడియంలో చదివిన విద్యార్థులే కావడం మరో విశేషం.

పరీక్షలపై సీఎస్‌ సమీక్ష
వచ్చే నెలలో జరిగే పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, ఇతర భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. కలెక్టర్లు పరీక్షా కేంద్రాలను సందర్శించి ఏర్పాట్లును సమీక్షించాలని ఆదేశించారు. మంచినీటి సౌకర్యంతో పాటు బాలురు, బాలికలకు వేర్వేరుగా టాయిలెట్‌ సౌకర్యాలుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొబైల్‌ పోలీస్‌ స్క్వాడ్లను నియమించాలని ఎస్పీలను ఆదేశించారు. 

జగన్‌ మావయ్య ఆశయాన్ని సాధిస్తా
గిరిజన ప్రాంతంలో జన్మించిన నేను ప్రారంభంలో తెలుగు మీడియంలోనే చదువుకున్నా. జగన్‌ మావయ్య ప్రభుత్వం వచ్చిన తరువాత ఇంగ్లీష్‌ మీడియంలో చదువుతున్నా. ప్రస్తుతం జీకే వీధి ఇంగ్లీష్‌ మీడియం ఆశ్రమ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నా. జగన్‌ మావయ్య ఇంగ్లీష్‌ మీడియం పెట్టి మాలాంటి పేద విద్యార్థులకు అండగా నిలిచారు. ఉన్నత చదువులు చదివి మావయ్య ఆశయాన్ని సాధిస్తా. మా అమ్మ కిల్లో జమున, నాన్న కిళ్లో నవకుమార్‌ పోడు వ్యవసాయం చేస్తారు. వాటి నుంచి వచ్చే ఆదాయంతో నన్ను చదివించేవారు. ఇప్పుడు ఇంగ్లీష్‌ మీడియం స్కూల్లో ఉచితంగా మాకు వసతి కల్పిస్తున్నారు. స్కూల్‌లో టీచర్లు చాలా బాగా బోధిస్తున్నారు. 
– కె.ధారామణి, ఇంగ్లీష్‌ మీడియం గిరిజన ఆశ్రమ పాఠశాల, జీకే వీధి, అల్లూరి జిల్లా.

కోరిక నెరవేరింది
మా ఊరి ప్రాథమిక పాఠశాలలో ఐదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివా. ఇంగ్లీష్‌ మీడియంలో చదవాలన్నది నా చిన్ననాటి కోరిక. పేదరికం కారణంగా నా ఆశ నెరవేరదేమో అనుకున్నా. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మా పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం ప్రవేశపెట్టడంతో నా కోరిక నెరవేరింది. ఇప్పుడు ఇంగ్లీషు మీడియంలో ఆరో తరగతి చదువుతున్నా. జగన్‌ మామకు మేమంతా రుణపడి ఉంటాం. మా అమ్మ చిలకమ్మ నన్ను కాన్వెంట్‌లో ఇంగ్లీషు మీడియంలో చదివించాలని బలంగా కోరుకునేది. దళితులమైనందున పేదరికంతో కాన్వెంట్‌లో చదివించలేకపోయింది. ప్రభుత్వ స్కూళ్లలో జగనన్న ఇంగ్లీషు మీడియం ప్రవేశపెట్టడంతో మా అమ్మ కోరిక నెరవేరింది. 
–సామాబత్తుల లక్ష్మి, కాకినాడ జిల్లా, సంపర ప్రాధమిక పాఠశాల

మా అదృష్టం..
కళ్యాణదుర్గంలోని కరణం చిక్కప్ప ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నా. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియంలో చదువులు చెప్పడం మా అదృష్టం. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదవడానికి, మంచి ఉద్యోగాల్లో స్థిరపడటానికి ఇంగ్లీష్‌ మీడియం పునాదిగా ఉపయోగపడుతుంది. మా తల్లిదండ్రులు నాగరాజు, పద్మావతి బేల్దారి పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. మాలాంటి పేదలకు ఇంగ్లీష్‌ మీడియం అందించిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. 
–తలారి శ్వేత, అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement