రైతులకు మరింత ధీమా | CM Jagan Credited YSR Zero Interest And Input Subsidy Scheme Benefits To Farmers | Sakshi
Sakshi News home page

రైతులకు మరింత ధీమా

Published Tue, Nov 29 2022 11:24 PM | Last Updated on Tue, Nov 29 2022 11:24 PM

CM Jagan Credited YSR Zero Interest And Input Subsidy Scheme Benefits To Farmers - Sakshi

కడప సిటీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ, ఇన్‌పుట్‌సబ్సిడీ రాయితీ పథకాలు అన్నదాతలకు మరింత ధీమాను ఇస్తున్నాయని కలెక్టర్‌ విజయరామరాజు, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఆప్కాబ్‌ చైర్‌ పర్సన్‌ మల్లెల ఝాన్సీరాణిలు సంయుక్తంగా పేర్కొన్నారు. సోమవారం తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 2020–21 సంవత్సరానికి రబీ సీజన్‌కు సంబంధించి, 2021 ఖరీఫ్‌ కాలానికి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకాలు, 2022 ఖరీఫ్‌లో ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద లబ్ధి మొత్తాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకు జమ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్‌లోని వీసీ హాలు నుంచి కలెక్టర్‌ విజయరామరాజుతోపాటు మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, నగర మేయర్‌ సురేష్‌బాబు, ఆప్కాబ్‌ చైర్‌ పర్సన్‌ మల్లేల ఝాన్సీరాణి, జేసీ సాయకాంత్‌వర్మ, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ నిత్యానందరెడ్డి, పులివెందుల మార్కెట్‌యార్డు చైర్మన్‌ చిన్నప్ప, వ్యవసాయ సలహా మండలి సభ్యులు బలరామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.  

అన్నదాతలకు కొండంత అండ : కలెక్టర్‌ విజయరామరాజు 
ఈ సందర్భంగా కలెక్టర్‌ విజయరామరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సున్నా వడ్డీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ పథకాలు అన్నదాతలకు కొండంత అండగా నిలుస్తున్నాయన్నారు. వైఎస్సార్‌ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 2020–21 రబీ సీజన్‌కు సంబంధించి రూ. లక్షలోపు పంట రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లించిన 12,112 మంది జిల్లా రైతులకు మంజూరైన రూ. 2.69 కోట్లు, 2021 ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి 24,920 మంది రైతులకు రూ. 6.05 కోట్లు, అలాగే 2020 ఖరీఫ్‌ సీజన్‌కుగాను సున్నా వడ్డీ కింద 30233 మంది వివిధ కారణాలతో జమకాని రైతులకుగాను రూ. 7.30 కోట్లు జమ అయిందన్నారు. మొత్తంగా జిల్లాలో 67,265 మంది రైతులకు రూ. 16.04 కోట్లు లబ్ధి చేకూరిందన్నారు. అలాగే 2022 ఖరీఫ్‌ కాలానికి ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద జిల్లాలో 3855 మంది రైతులకు  రూ. 4.33 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశారని తెలిపారు.  

మెగా చెక్కు అందజేత 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వీసీ అనంతరం సున్నా వడ్డీ, ఇన్‌పుట్‌ సబ్సిడీకి సంబంధించిన మెగా చెక్కులను కార్యక్రమానికి హాజరైన అతిథులందరూ కలిసి లబ్ధిదారులకు అందజేశారు. 
ఈ కార్యక్రమంలో వీరపునాయునిపల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి, జిల్లా వ్యవసాయశాఖ అధికారి నాగేశ్వరరావు, పశుసంవర్థకశాఖ జేడీ శారద, డీసీఓ సుభాషిణి, వ్యవసాయ ఏడీలు నరసింహారెడ్డి, సుబ్బారావు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. 

రైతు పక్షపాత ప్రభుత్వం: ఎస్‌.రఘురామిరెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే 
తమది రైతు పక్షపాత ప్రభుత్వమని మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. ప్రతి రైతు తలెత్తుకుని జీవించాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమన్నారు. రైతు దేశానికి వెన్నముక అని, రైతు బాగుంటేనే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని ప్రభుత్వం భావించి రైతులను అన్ని విధాలా ఆదుకుంటోందన్నారు. 

అన్నదాతల కోసం అమూల్య పథకాలు : సురేష్‌బాబు, నగర మేయర్‌ 
అన్నదాతల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమూల్యమైన పథకాలను అమలు చేస్తున్నారని నగర మేయర్‌ సురేష్‌బాబు తెలిపారు. వరుసగా మూడవ సంవత్సరం సజావుగా సున్నా వడ్డీ, ఇన్‌పుట్‌ సబ్సిడీలను రైతులకు అందిస్తున్న ఘనత మన ముఖ్యమంత్రిదేనన్నారు.   

పథకాలను సద్వినియోగం చేసుకోవాలి :  మల్లెల ఝాన్సీరాణి,  ఆప్కాబ్‌ చైర్‌ పర్సన్‌ 
ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన పథకాలను రైతన్నలు సద్వినియోగం చేసుకోవాలని ఆప్కాబ్‌ చైర్‌ పర్సన్‌ మల్లెల ఝాన్సీరాణి తెలిపారు.  రైతుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని కొనియాడారు.  

రైతు భరోసా కేంద్రాలు రైతులకు కల్పతరువులు : సంబటూరు ప్రసాద్‌రెడ్డి, వ్యవసాయ సలహా మండలి జిల్లా అధ్యక్షుడు 
ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు రైతులకు అన్ని విధాలా కల్పతరువుగా మారాయని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ సంబటూరు ప్రసాద్‌రెడ్డి పేర్కొ న్నారు. ప్రభుత్వం విత్తనం నుంచి అమ్మకం వరకు రైతులకు అండగా నిలుస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు అన్ని సేవలు అందుతున్నాయన్నారు.  

రైతు బాంధవుడు ముఖ్యమంత్రి 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు బాంధవుడిగా మారి రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారు. రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటుందని నమ్మిన నాయకుడు జగనన్న. ప్రభుత్వ మద్దతు ధరతో పండించిన పంటలను ఆర్బీకేల ద్వారా విక్రయించుకోగలిగాను.     
– భాస్కర్, రైతు, యల్లారెడ్డిపల్లె, కమలాపురం  

జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలి 
వ్యవసాయ రంగంలో రైతుల అభ్యున్నతికి అనేక మార్పులు తెచ్చి ఆపన్నహస్తం అందిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగానే ఉండాలని కోరుకుంటున్నాను.     
– పి.వీరారెడ్డి, చౌటపల్లె, కడప  

రైతు శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రి 
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రైతు శ్రేయస్సు కోరే ముఖ్యమంత్రిగా ఘనత సాధించారు. అనేక పథకాలను రైతుల కోసం ప్రవేశపెట్టారు. ఇలాంటి ముఖ్యమంత్రి కలకాలం ఉండాలన్నదే మా అందరి ఆకాంక్ష.     
– ఎం.సుబ్బిరెడ్డి, చౌటపల్లె, కడప 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement