AP: ఆరోగ్య సురక్ష రెండోదశ | CM Jagan aim to take care of health of every family in AP state | Sakshi
Sakshi News home page

AP: ఆరోగ్య సురక్ష రెండోదశ

Published Tue, Jan 2 2024 4:18 AM | Last Updated on Tue, Jan 2 2024 12:59 PM

CM Jagan aim to take care of health of every family in AP state - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి కుటుంబం, ప్రతి పౌరుడి ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మక కార్యక్రమం ‘జగనన్న ఆరోగ్య సురక్ష ’(జేఏఎస్‌) రెండో దశ అమలుకు వైద్య ఆరోగ్య శాఖ సన్నద్ధమైంది. నేటి నుంచి గ్రామాల్లో ఈ కార్యక్రమం ప్రారంభం కానుండగా వారానికి రెండు రోజుల చొప్పున మంగళ, శుక్రవారాల్లో జేఏఎస్‌ను నిర్వహిస్తారు. ఇక పట్టణాలు, నగరాల్లో రెండో దశ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభం కానుంది. తొలిదశలో భాగంగా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లో 50 రోజులపాటు జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున వైద్య శిబిరాలను విజయవంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. సొంత ఊళ్లలోనే 60 లక్షల మంది ప్రజలకు ప్రభుత్వం ఉచిత వైద్య సేవలందించింది. 

నిరంతరాయంగా కార్యక్రమాన్ని కొనసాగించడంలో భాగంగా రెండో దశను చేపట్టారు.ఆరు నెలల్లో 13,954 శిబిరాలు జేఏఎస్‌ రెండో దశలో రాష్ట్రవ్యాప్తంగా ఆరు నెలల్లో 13,954 సురక్ష శిబిరాలు నిర్వహించేలా వైద్య శాఖ ప్రణాళిక రూపొందించింది. గ్రామాల్లో 10,032, పట్టణాలు, నగరాల్లో 3,922 చొప్పున శిబిరాలు నిర్వహించనున్నారు. ఈ నెలలో 3,583 శిబిరాలను నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి మండలంలో వారానికి ఒక గ్రామం చొప్పున, మునిసిపాలిటీల్లో వారానికి ఒక వార్డు చొప్పున రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను ఆర్నెళ్లలో కవర్‌ చేసేలా శిబిరాలను నిర్వహిస్తారు.

శిబిరాల నిర్వహణకు 15 రోజుల ముందు ఒకసారి, మూడు రోజుల ముందు మరోసారి వలంటీర్లు, ప్రజాప్రతినిధులు ప్రతి ఇంటికి వెళ్లి జేఏఎస్‌–2పై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ప్రతి శిబిరంలో స్థానిక మెడికల్‌ ఆఫీసర్‌తో పాటు ఇద్దరు స్పెషలిస్టు వైద్యులు, పారామెడికల్‌ ఆప్తాల్మిక్‌ అసిస్టెంట్‌ ఉంటారు. ప్రజలకు సొంత ఊళ్లలో స్పెషలిస్ట్‌ వైద్య సేవలందించేందుకు 543 జనరల్‌ మెడిసిన్, 645 గైనకాలజిస్ట్, 349 జనరల్‌ సర్జన్, 345 ఆర్థోపెడిక్స్, 378 మంది చొప్పున ఇతర స్పెషలిస్ట్‌ వైద్యులను, కంటి సమస్యల స్క్రీనింగ్‌ కోసం 562 మంది పారామెడికల్‌ ఆప్తాల్మిక్‌ ఆఫీసర్లను నియమించారు. వైద్య శిబిరాల్లో అవసరమైన అన్ని రకాల మందులను అత్యవసర ఔషధాలతో సహా అందుబాటులో ఉంచుతున్నారు. వైద్య పరీక్షల నిర్వహణకు ఏడు రకాల కిట్లు శిబిరాల్లో అందుబాటులో ఉంటాయి. 

చేయి పట్టి నడిపిస్తూ..
వైద్య శిబిరాల ద్వారా సొంతూళ్లలో వైద్య సేవలు అందించడమే కాకుండా అనారోగ్య బాధితులను వైద్య పరంగా ప్రభుత్వం చేయి పట్టుకుని నడిపిస్తోంది. జేఏఎస్‌ శిబిరాల నుంచి మెరుగైన వైద్యం కోసం ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు రిఫర్‌ చేసిన రోగులను ఫ్యామిలీ డాక్టర్, కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్, ఏఎన్‌ఎంలు పర్యవేక్షిస్తారు. వీరు ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందడం కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రయాణ చార్జీల కింద రూ.500 చొప్పున అందచేస్తోంది.

రిఫరల్‌ రోగులను ఆస్పత్రులకు తరలించి అక్కడ ఉచితంగా అన్ని వైద్య సేవలు అందేలా సమన్వయం చేస్తారు. జీజీహెచ్‌లు, ప్రైవేట్‌ నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్య సురక్ష రిఫరల్‌ కేసుల కోసం ప్రత్యేక కౌంటర్‌లు ఉంటాయి. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారికి ప్రభుత్వం వైద్య పరంగా అండగా నిలుస్తోంది. వీరికి ఉచిత కన్సల్టేషన్‌లతో పాటు కాలానుగుణంగా ఉచితంగా మందులు అందజేస్తోంది.

జిల్లాల వారీగా ప్రత్యేక అధికారులు
జేఏఎస్‌–2 కార్యక్రమం అమలు పర్యవేక్షణకు వైద్య, ఆరోగ్య శాఖ జిల్లాలవారీగా ప్రత్యేకంగా అధికారులను నియమించింది. వీరు తమకు కేటాయించిన జిల్లాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో కార్యక్రమం అమలును పర్యవేక్షిస్తారు. లోటుపాట్లు ఉంటే సంబంధిత విభాగాధిపతుల దృష్టికి తెచ్చి సమస్య పరిష్కరానికి చర్యలు చేపడతారు.

ప్రజల వద్దకే వైద్యం
జేఏఎస్‌–2 నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశాం. మందులు, వైద్య పరీక్షల కిట్‌లు సరఫరా చేశాం. శిబిరాల నిర్వహణపై జిల్లా యంత్రాంగాలు షెడ్యూల్‌లు రూపొందించాయి. ఆ మేరకు ఎలాంటి అవాంతరాలు లేకుండా శిబిరాలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నాం. ప్రభుత్వ వైద్య సేవలను ప్రజల వద్దకు చేరుస్తూ జేఏఎస్‌ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ప్రతి ఒక్కరూ ఈ సేవలను వినియోగించుకోవాలి. 
– జె.నివాస్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement