చంద్రబాబుకు సుప్రీంలో నో రిలీఫ్‌  Chandrababu Naidu bail plea: SC adjourns hearing till Nov 9 | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు సుప్రీంలో నో రిలీఫ్‌ 

Published Sat, Oct 21 2023 4:06 AM | Last Updated on Sat, Oct 21 2023 7:05 AM

Chandrababu Naidu bail plea: SC adjourns hearing till Nov 9 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఫైబర్‌నెట్‌ కుంభకోణం కేసులో ముందస్తు బెయిలు కోరుతూ మాజీ సీఎం చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు నవంబరు 9వ తేదీకి వాయిదా వేసింది. శుక్రవారం ఈ పిటిషన్‌ జస్టిస్‌ అనిరుద్ధ బోస్, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం వద్దకు రాగా చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించారు. మొత్తంగా మూడు ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు కాగా ఒకటి తీర్పు రిజర్వు అయిందని నివేదించారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తీర్పు వెలువడే వరకు ఈ కేసులో వేచి చూద్దామా? అని జస్టిస్‌ బోస్‌ ప్రశ్నించగా, ఆ విషయాన్ని ధర్మాసనానికే వదిలేస్తున్నట్లు లూథ్రా బదులిచ్చారు. అయితే, చంద్ర­బాబుకు మధ్యంతర రక్షణ కొనసాగించాలని లేదంటే ఈ పిటిషన్‌కు కాలపరిమితి ముగిసిపోతుందన్నారు. ఈ దశలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తరఫు సీనియర్‌ న్యాయవాది రంజిత్‌కుమార్‌ జోక్యం చేసుకుంటూ ఒక వ్యక్తి ఒకసారి కస్టడీలో ఉన్నప్పుడు మరోసారి అరెస్టు ఉత్పన్నం కాదని, జ్యుడీషియల్‌ కస్టడీ కొనసాగుతుందని తెలిపారు.

ఇదే అంశాన్ని కౌంటర్‌ అఫిడవిట్‌లో పేర్కొన్నట్లు చెప్పారు. స్కిల్‌ కేసులో తీర్పు కోసం వేచి చూస్తున్నామన్నారు. చంద్రబాబు కస్టడీలో ఉన్నందున ప్రశ్నించుకోవచ్చని జస్టిస్‌ బోస్‌ పేర్కొనగా, ఇంటరాగేషన్‌ చేయాలంటే కోర్టు అనుమతి అవసరమని, సెక్షన్‌ 267 కింద వారెంటు జారీ చేశామని రంజిత్‌ కుమార్‌ తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేసిన తర్వాతే పోలీసు కస్టడీని కోరగలమన్నారు. ఈ సమయంలో లూథ్రా జోక్యం చేసుకుంటూ ఇదంతా అబద్ధమని, చట్టాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపణలు చేశారు. సెప్టెంబరు 9న కస్టడీలో తీసుకున్న నాటి నుంచి చంద్రబాబును ఏ ప్రశ్నా అడగలేదన్నారు.

ఈ సమయంలో జస్టిస్‌ బోస్‌ జోక్యం చేసుకుంటూ ముందస్తు బెయిలుపై నవంబరు 8న విచారిస్తామని తొలుత ప్రకటించారు. అయితే విచారణను నవంబరు 9కి వాయిదా వేయాలని సిద్ధార్థ లూథ్రా అభ్యర్థిచడంతో న్యాయస్థానం అందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణంపై తొలుత తీర్పు వెలువరిస్తామని, తర్వాత ఈ అంశాన్ని పరిగణిస్తామని ధర్మాసనం పేర్కొంది. అప్పటి వరకు చంద్రబాబు అరెస్టు ఉండదని తెలిపింది. కా­గా, ఈ నెల 29వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు సెలవులు కావడంతో స్కిల్‌ డెవ­లప్‌మెంట్‌ కుంభకోణం కేసులో తీర్పు ఆ తర్వాతే వెలువడే అవకాశం ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement